కడప నగరంలో బైక్ ర్యాలీలో డీఆర్‌డీఏ ‘వెలుగు’ ఉద్యోగులు
కడప రూరల్ : తమకు ఉద్యోగ భద్రత లభించే వర కు ఉద్యమం ఆగదని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్ధ వెలుగు ఉద్యోగుల జేఏసీ సభ్యులు స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం వారు చేపట్టిన సమ్మె బుధవారానికి 8వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆ జేఏసీ ఆధ్వర్యంలో ఏడు రోడ్ల కూడలి నుంచి దాదాపు 200 మంది సిబ్బంది కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా యాని మేటర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభుదాస్, ఆ జేఏసీ సభ్యులు గూగూడు, నరసింహులు, నీలకంఠారెడ్డి, సత్యనారాయణ మాట్లాడుతూ వెలుగు సంస్ధలో కష్టించి పనిచేస్తున్నా తమకు ఇంతవరకు ఉద్యోగ భద్రత లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. తమ కడుపులు కాలి రోడ్డు మీదకు వచ్చామన్నారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ డిమాండ్స్‌ను నెరవేరుస్తామని చెప్పి, మోసగించారని ఆరోపించారు. తమకు ఉద్యోగ భద్రత లభించే వరకూ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. సుబ్బనాయుడు, అనంతయ్య, రామాంజనేయులు, అపర్ణ, సురేష్, రెడ్డెయ్య, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వంతో చర్చలు విఫలం
రాష్ట్ర ప్రభుత్వం వెలుగు ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర సభ్యులతో బుధవారం విజయవాడలో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ముందు మీరు సమ్మె ను విరమించండి, మీ సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీని వేస్తామని సెర్ఫ్ సీఈఓ తెలిపారు. అందుకు ఆ జేఏసీ సభ్యులు తమకు ఉద్యోగ భధ్రత లభించే వరకు సమ్మెను విరమించమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను విరమించమని ఉద్యోగులను బెదిరిస్తోంది, ఆ మేరకు దిగువస్థాయి కేడర్‌ను ప్రలోభాలకు గురిచేస్తోందని ఆ జేఏసీ సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె మరింతకాలం కొనసాగనుంది. ఫలి తంగా జిల్లా గ్రామీ ణాభివృద్ధి సంస్ధలో అమలవుతున్న దాదాపు 17కు పైగా పథకాల అమలుపై తీవ్ర ప్రభావం పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment