Velur
-
ప్రిన్సిపాల్ వేధింపులు.. ఉపాధ్యాయురాలు ఆత్మహత్య
సాక్షి, చెన్నై: ప్రధానోపాధ్యాయుడి వేధింపులు తాళలేక ఉపాధ్యాయురాలు బలవన్మరణానికి పాల్పడింది. వివరాలు.. వేలూరు జిల్లా గుడియాత్తం తాలుకా కామాక్షి అమ్మన్ గార్డన్‌కు చెందిన నాగేశ్వరి(56) గుడియాత్తం నెల్లూరు పేటలోని ప్రభుత్వ పాఠశాలలో టైలరింగ్ టీచర్‌గా పనిచేస్తోంది. ఈమె కుమారుడు విఘ్నేష్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. శుక్రవారం నాగేశ్వరి ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కుమారుడు విఘ్నేష్ గుడియాత్తం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాఠశాల హెచ్ఎం తన తల్లి నాగేశ్వరిని టైలరింగ్ శిక్షణకు అనుమతి ఇవ్వకుండా వేధించేవాడని, ప్రతి రోజూ గ్రంథాలయ భవనంలో విధులు నిర్వహించాలని ఆదేశించేవాడని పేర్కొన్నారు. తరచూ అసభ్య పదజాలంతో దూషించేవాడని, ఈ నేపథ్యంలో ఆనారోగ్యం కారణంగా తన తల్లి 12 రోజుల పాటు మెడికల్ సెలవు పెట్టిందని ఫిర్యాదులో వెల్లడించారు. రెండు రోజుల క్రితం మెడికల్ సర్టిఫికెట్తో పాఠశాలకు వెళ్లగా హెచ్ఎం తన గదిలో గంట పాటు దూషించి వేధింపులకు గురి చేశాడని, మెడికల్ సర్టిఫికెట్ తీసుకోవాడానికి కూడా నిరాకరించి ఇంటికి పంపి వేశాడని ఆరోపించారు. ఆ మనోవేదనతో తన తల్లి నాగేశ్వరి ఇంట్లో ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
ఆలయ కోనేటి వద్ద తొక్కిసలాట: నలుగురు మృతి
వేలూరు (తమిళనాడు) : తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయం తీర్థవారిలో అపశృతి చోటుచేసుకుంది. ఆలయ కోనేరు వద్ద జరిగిన తొక్కిసలాటలో నలుగురు భక్తులు మృతి చెందారు. 30 ఏళ్లకు ఒక్కసారి వచ్చే తైఅమావాస్య తిరువణ నక్షత్రం రావడంతో సోమవారం తమ పూర్వీకులకు తర్పణాలు వదిలేందుకు కోనేటి వద్దకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఉదయం ఆలయంలోని అన్నామలై అయ్యర్, ఉన్నామలై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థవారి నిర్వహించేందుకు ఆలయ సమీపంలోని అయ్యం కోనేటికి స్వామివారిని తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో సుమారు పదివేల మంది భక్తులు ఒక్కసారిగా ఆలయ గురుకుల్‌పై పడ్డారు. స్వామి వారి విగ్రహాలను తీసుకొచ్చిన గురుకుల్తోపాటు భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. కొంత మంది కోనేటిలో పడిపోయారు. కోనేటిలో మునిగి ఆలయ గురుకుల్ పుణ్యకోటి(50), తిరువణ్ణామలై అమ్మణియమ్మన్ వీధికి చెందిన వెంకటరమణ(30), అయ్యం కోనేటి వీధికి చెందిన మణిగండన్(32), చెన్నైకి చెందిన శివకుమార్(30) మృతి చెందారు. వీరిలో వెంకటరమణ, మణిగండన్ ఆలయ పురోహితులుగా పనిచేస్తున్నారు. ఘటనపై డీఐజీ తమిళ్‌చంద్రన్, కలెక్టర్ జ్ఞానశేఖరన్ విచారణ చేస్తున్నారు.