వేలూరు (తమిళనాడు) : తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయం తీర్థవారిలో అపశృతి చోటుచేసుకుంది. ఆలయ కోనేరు వద్ద జరిగిన తొక్కిసలాటలో నలుగురు భక్తులు మృతి చెందారు. 30 ఏళ్లకు ఒక్కసారి వచ్చే తైఅమావాస్య తిరువణ నక్షత్రం రావడంతో సోమవారం తమ పూర్వీకులకు తర్పణాలు వదిలేందుకు కోనేటి వద్దకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఉదయం ఆలయంలోని అన్నామలై అయ్యర్, ఉన్నామలై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థవారి నిర్వహించేందుకు ఆలయ సమీపంలోని అయ్యం కోనేటికి స్వామివారిని తీసుకొచ్చారు.
ఈ నేపథ్యంలో సుమారు పదివేల మంది భక్తులు ఒక్కసారిగా ఆలయ గురుకుల్‌పై పడ్డారు. స్వామి వారి విగ్రహాలను తీసుకొచ్చిన గురుకుల్‌తోపాటు భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. కొంత మంది కోనేటిలో పడిపోయారు. కోనేటిలో మునిగి ఆలయ గురుకుల్ పుణ్యకోటి(50), తిరువణ్ణామలై అమ్మణియమ్మన్ వీధికి చెందిన వెంకటరమణ(30), అయ్యం కోనేటి వీధికి చెందిన మణిగండన్(32), చెన్నైకి చెందిన శివకుమార్(30) మృతి చెందారు. వీరిలో వెంకటరమణ, మణిగండన్ ఆలయ పురోహితులుగా పనిచేస్తున్నారు. ఘటనపై డీఐజీ తమిళ్‌చంద్రన్, కలెక్టర్ జ్ఞానశేఖరన్ విచారణ చేస్తున్నారు.
ఆలయ కోనేటి వద్ద తొక్కిసలాట: నలుగురు మృతి
Published Mon, Feb 8 2016 7:42 PM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM
Advertisement