అన్నమయ్య వేమన్న పదాలు
‘భక్తి కొలది వాడే పరమాత్ముడు’ అన్నాడు అన్నమయ్య. ‘భక్తి గలుగ వాడు పరమాత్ముడగునయా’ అని చెప్పాడు వేమన్న. ఈ విధంగా పదాలను ఉదహరిస్తూ పోతే అన్నమయ్యకూ వేమన్నకూ ఎంత దగ్గరి సామ్యం ఉందో స్పష్టంగా తెలుస్తుంది.
‘భక్తి కొలది వాడే పరమాత్ముడు’ అన్నాడు అన్నమయ్య. ‘భక్తి గలుగ వాడు పరమాత్ముడగునయా’ అని చెప్పాడు వేమన్న. ‘రానున్నా అది రాకుమన్న బోదు’ అని పాడాడు అన్నమయ్య. ‘రానున్నది కోరుకున్న రానే వచ్చున్’ అని చాటాడు వేమన్న. ‘ఎంత విభవము గలిగె నంతయును నాపదని’ అని సూక్ష్మం చెప్పాడు అన్నమయ్య. ‘ఎంత భాగ్యమున్న అంత కష్టపు చింత’ అని మరింత సూటిగా బోధించాడు వేమన్న. శ్రీ వేంకటేశ్వరస్వామి తత్త్వంతో సంకీర్తనా రచన సాగించిన పదకవితా పితామహుడు అన్నమయ్య.
సామాజిక బోధన ప్రధానమైన తన పద్య రచనలతో సంఘ సంస్కర్తగాట పసిద్ధుడైనాడు వేమన. రాయలసీమ ప్రాంత వాసులైన అన్నమయ్య 15వ శతాబ్దానికీ, వేమన 17వ శతాబ్దానికీ చెందినవారు. వారిరువురి నడుమ సుమారు రెండు శతాబ్దాల తేడా వుండవచ్చు. వారి జీవిత చరిత్రలను పరిశీలిస్తే వారి కుటుంబీకులు కర్షకులైనప్పటికీ ఇరువురి జీవన విధానంలో ఎంతో వైరుధ్యముంది. కానీ, వారిరువురి రచనలను గమనిస్తే పద, భావాలలో ఎన్నో పోలికలు కనిసిస్తాయి.
తాళ్లపాక అన్నమాచార్యులు క్రీ.శ.1408వ సంవత్సరంలో నందవరీక బ్రాహ్మణులైన లక్కమాంబ, నారాయణసూరి దంపతులకు కడప జిల్లా తాళ్లపాక గ్రామంలో జన్మించాడు. పుట్టుకతోనే ప్రతిభావంతుడైన అన్నమయ్య వేంకటేశ్వరునిపై రోజుకు ఒక సంకీర్తన చొప్పున 32,000 సంకీర్తనలు రచించాడు. తిరుమలలోని స్వామి సన్నిధిలో తన జీవితం గడిపి, క్రీ.శ.1503లో దివ్యధామం చేరుకొన్నాడు.
వేమన సరళమైన అచ్చ తెనుగు పదాలతో ఆశుకవిగా తన స్వీయ అనుభవాలను ఆటవెలదుల్లో అలవోకగా లోకానికి విప్పి చెప్పిన విలక్షణ ప్రజాకవి. సుమారు 3000 పద్యాలు చెప్పాడు. అయితే, వేమన జీవిత చరిత్రకు సంబంధించిన ప్రాంతము, కాలం, కులము విషయంలో అనేక మంది పండితులలో, పరిశోధకులలో సందేహాలు ఉన్నాయి. వేమన కులము కాపు లేక రెడ్డి. తల్లి మల్లమ్మ, తండ్రి రెడ్డెన్న. వేమన కడప జిల్లాకు చెందినవాడని చాలామంది అభిప్రాయపడ్డారు. రాయలసీమ ప్రాంతానికి చెందినవాడన్న విషయాన్ని మాత్రం అందరూ అంగీకరించారు. చివరికి కదిరి దగ్గర కఠారుపల్లెలో సమాధి నిష్టుడయ్యెనని చెప్పవచ్చు. వేమన త్రిశతాబ్ది జయంతిని క్రీ.శ.1972గా నిర్ణయించి, ఆయన జన్మించిన కాలం క్రీ.శ.1672 అని ‘ప్రభుత్వం’ అధికార ముద్ర వేయడం జరిగింది.
అన్నమయ్య కాలం నుంచి వేమన కాలం వరకు దేశంలో కులమత భేదాలలోనూ, క్షుద్ర దేవతలను పూజించి, జంతుబలులివ్వడంలోనూ, శకునాలు, మూఢనమ్మకాలను పాటించడంలోనూ ప్రజలలో పెద్దగా మార్పు రాలేదు. కుల వ్యత్యాసాలు చూపకూడదని యిద్దరూ ఉద్బోధించారు. సమాజాన్ని చైతన్య పరచడంలో వారిరువురి సాహిత్యపు ఒరవడి నేటికి కూడా తిరుగులేనిదని చెప్పవచ్చు. విష్ణు దేవాలయాలను సందర్శించే నిమిత్తం కీర్తనలు పాడుతూ దేశం నలుమూలలా అన్నమయ్య, ఆయన సంతతి వారు సంచారం చేసినారు. వారు పర్యటించిన ప్రదేశాలలో యాదృచ్ఛికంగా వేమన కూడా సంచారాన్వేషణ చేసాడు. ఈ విధమైన యాత్రల మూలంగా అన్నమయ్య పదసాహిత్యపు వాసనలు వేమనకు దగిలి యుండవచ్చు. పద్యము కన్నా పదం సామాన్య జనానికి అందుబాటులో ఉంటుందని అన్నమయ్య గుర్తించి, సమాజములోని సామాన్యులు, దీనులు, అర్థార్థులు, జిజ్ఞాసువులు, ప్రపన్నులు అయిన వారికోసం పద రచన చేసాడు. ఆయన రచించిన అనేక కీర్తనలు ఆటవెలది పద్య ఛందమునకు దగ్గరగా ఉన్నవి.
అన్నమయ్య పదకవితల శిల్ప విశేషాలను ప్రబంధ కవులు, పదకవులు యధేచ్ఛగా అనుకరించిన సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా వేమన మహాకవి కూడా తానొక సంస్కరణాభిలాషిగా, విశ్వశ్రేయోదాయక కవితా సందేశకర్తగా అన్నమయ్య పద రచనల పట్ల బాగా ఆకృష్టుడై ఉండవచ్చు. అవే పద భావాలను గ్రహించి, మరింత సులభతరంగా ఎన్నో పద్యాలు చెప్పగలిగినాడు. తులనాత్మక సూత్రాలను అనుసరించి, సమాన భావమున్న వారి పదాలను ఎంపిక చేసి ఒకదానితో నొకటి సమాంతరంగా పోల్చి చూపవచ్చు. భావాలు ఆలోచనలలో సామ్యం ఉండటమే కాకుండా అవే పదాలు ఉండటం ఆసక్తి కలిగించే అంశం. పదముతో, పాదముతో, విషయముతో అన్నిటా అనుకరణము నుండుననుటకు దృష్టాంతాలే యీ అవే పదాలు. దీనినే యిద్దరి కవుల భావ సంవాదమన్నారు పెద్దలు. ‘తలమేల కులమేల తపమే కారణము/ యెలమి హరిదాసులు యే జాతియైన నేమి’ అని అన్నమయ్య కీర్తన మొదలవుతుంది. ‘ఏది కులము నీకు ? ఏది స్థలంబురా/ పాదుకొనుము మదిని పక్వమెరిగి/ యాదరించు దాని నవలీల ముట్టరా/ విశ్వదాభిరామ వినుర వేమ!’ అని వేమన్న పద్యం.
ఇందులో- ‘తలమేల కులమేల తపమే కారణము’ ‘ఏది కులము నీకు ? ఏది స్థలంబురా’ అవే పదాలు! అలాగే- ‘నీతితో నడచి తేను నెగులే లేదు/ జాతి దప్పకుండి తేను చలమే ఫలము’ అని అన్నమయ్య కీర్తన. నీతితో నడుచుకొంటె కష్టాలు బాధలుండవు. ఒప్పును ఒప్పుగా తప్పకుండా అంగీకరించితే మంచి ఫలితముంటుందని దీని భావం. నీతి అనే దీపం లేకుంటె అజ్ఞానాంధకారం నశించదు. అది లేకున్న బ్రహ్మస్వరూపం గోచరించదు. ధనం వున్నంత మాత్రాన ప్రయోజనం లేదు అన్న భావంతో వేమన్న ‘నీతి జ్యోతి లేక నిర్మలంబగునేది/ ఎట్లు కలుగు బరమదెంతయైన’ అన్న పద్యం చెప్పాడు. ఇందులో- ‘నీతితో నడచి తేను నెగులే లేదు’ ‘నీతి జ్యోతి లేక నిర్మలంబగునేది’ వాక్యాలను అవే పదాలుగా చూపవచ్చు.
ఇంకా కొన్ని ఉదాహరణలు:
‘శ్రీపతి దాసులు చెడరెన్నడును’ (అన్నమయ్య). ‘ఎరిగిన శివపూజ ఎన్నడు చెడిపోదు’ (వేమన్న).
‘పరుల పీడించి తేని పసిడొక్కటి సుఖము(అ). ‘పరుల మోసపుచ్చి పరధన మార్జించి - కాని పద్దు(వే).
‘తన శాంతమాత్మలో దగిలినపుడు గదా! ఫలియించుట’(అ). ‘శాంతమె జనులను జయము నొందించును’(వే).
‘మోహంబుచే వెనక ముందెఱుగ లేక’(అ). ‘ముప్ప త్రిప్పలబడి మోహంబు విడువడు’(వే).
‘పతిదయ గలిగిన పడతి దీ భాగ్యము’(అ). ‘తరుణి పుణ్యవతిగ నరుని బట్టియైయగు’(వే).
‘మగువల మాటలు మంచి చక్కెర తీపులు’(అ). ‘చెరుకు రసము కన్న చెలుల మాటలె తీపి’(వే).
‘వనితకు బతిమీది వలపే మూలధనము’(అ). ‘సతికి బతికినైన సంపదే సంపద’(వే).
‘తప్పలెంచే పనులైతే తాజేయనేల’(అ). ‘తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు’(వే).
‘వాకులొక్కటే భాషల వరుసే వేరు(అ). ‘భాష లెన్నిటిలో నైన భావమొకటె’(వే).
ఈ విధంగా పదాలను ఉదహరిస్తూ పోతే అన్నమయ్యకూ వేమనకూ ఎంత దగ్గరి సామ్యం ఉందో స్పష్టంగా తెలుస్తుంది. దీనిని బట్టి అన్నమయ్య ప్రభావం వేమన మీద చాలా గాఢంగా ఉన్నట్లు తెలుస్తుంది. పండితులు, పరిశోధకులు దీని మీద దృష్టి సారించి తులనాత్మక అధ్యయనం జరిపితే మరిన్ని విశేషాలు వెలుగులోకి వస్తాయి. అయితే, ఆశుకవిగా పేరొందిన సహజ ప్రతిభా సంపన్నుడైన వేమన్నకు ఈ అనుకరణ తప్పు కాదు. యిద్దరి పదాల సారూప్యానికి వారి భావైక్యమే కారణమని మాత్రం గమనించాల్సి వుంది.
(వ్యాసకర్త, ‘అవే పదాలు’ పేరిట అన్నమయ్య, వేమన్న పదాల్లోని సామ్యాన్ని విశ్లేషిస్తూ పుస్తకం వెలువరించారు. ఫోన్: 9701857260)
యానాద్రి