ఎలుకలు.. గొర్రెలంత పెరుగుతాయ్!
లండన్: మనుషులు మూడడుగుల వెంపలి చెట్లకు సైతం నిచ్చెనలు వేసుకుని ఎక్కే రోజు వస్తుందంటూ కాలజ్ఞానాన్ని ప్రస్తావిస్తూ పెద్దలు చెబుతుంటారు. మనుషుల సంగతేమో గానీ.. ఎలుకలు మాత్రం భవిష్యత్తులో కనీసం గొర్రెలంత సైజుకు పెరగడం ఖాయమని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ శాస్త్రవేత్తలు అంటున్నారు! ఎలుకలు అంత సైజు పెరగడమేంటీ..? అనుకుంటున్నారా? అయితే శాస్త్రవేత్తలు చెబుతున్నదేంటో చూద్దాం.. ఎలుకలు రోడెంట్స్ (వాడి దంతాలు గల క్షీరదాలు) జాతికి చెందినవి. భవిష్యత్తులో పెద్ద సైజులో ఉన్న క్షీరదాలు పెద్ద సంఖ్యలో నశిస్తే గనక.. ఆవరణ వ్యవస్థలో ఒక ఖాళీ ఏర్పడుతుంది. ఆ క్షీరదాలు తీసుకోవాల్సిన ఆహారమంతా మిగిలిపోతుంది. దీంతో ఆ అవకాశాన్ని వినియోగించుకుని, వాటి ఖాళీని ఆక్రమించుకునేందుకు ఎలుకల్లో పరిణామం జరుగుతుంది.
క్రమంగా అవి గొర్రెలంత సైజుకూ పెరుగుతాయట. ఈ పరిణామ కథను న మ్మేదెలా అంటారా..? అయితే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్దాం. రాక్షసబల్లులు అంతరించకముందు ఖడ్గమృగాలు, గుర్రాల వంటి క్షీరదాలు కేవలం ఎలుకలంత సైజు మాత్రమే ఉండేవట. రాక్షసబల్లులు అంతరించాకే అవి పరిణామం చెంది భారీ సైజులకు పెరిగాయట. ఒక ఎద్దు కన్నా పెద్దగా, టన్ను బరువున్న ఓ రోడెంట్ అస్థిపంజరం గతంలో వెలుగుచూసింది. ప్రస్తుతం రోడెంట్లలో అతిపెద్దదైన కాపీబారా 80 కిలోల వరకూ పెరుగుతుంది. ఇవి ఇంకా పెరగొచ్చట. అయితే.. ఈ పరిణామం జరగడానికి వేల ఏళ్లు పడుతుంది కాబట్టి.. మనకు ఇప్పట్లో భారీ ఎలుకలు ఎదురయ్యే ప్రమాదం లేదులెండి!