Vempalle Sharif
-
కథ: నీలం రంగు రాయి ఉంగరం.. ఇది ఇప్పుడు నాదే!
నా ఈ స్థితికి యేడాది. కారు ముందుకెళ్తోంది. రాత్రి ఏడవుతోంది కదా ట్రాఫిక్ అంతకంతకూ పెరుగుతోంది. మైండ్ ఏం బాగా లేదు. ఏ పనీ చేయబుద్ధి కావడం లేదు. జీవితానికి అర్థమేంటో తెలియడం లేదు. అది అంత సులభంగా అర్థం కాదు. అర్థమైతే అది జీవితం కాదు. అతని కోసం వెతికాను. అలసిపోయాను. నాకు తెలియకుండానే నా పై జేబును తడుముకున్నాను. భద్రంగా ప్లాస్టిక్ ప్యాకెట్లో ఉంచిన నీలం రంగు రాయి ఉంగరం చేతికి తగిలింది. నా ఈ దరిద్రాలన్నింటికీ ఈ ఉంగరమే కారణం. అలా అని ఈ ఉంగరం అంటే నాకు కోపం లేదు. ప్రేమ ఉంది. ఆ ప్రేమ సుజీ మీద. ఈ ఉంగరం సుజీకి ఎంతో ఇష్టం. నాకు సుజీ అంటే ఇష్టం. ఇప్పుడామె లేదు. ఈ ఉంగరం ఉంది. ఆమె మీద ప్రేమే ఇప్పుడు ఈ ఉంగరం మీదికి మళ్లింది. అయితే ఈ ఉంగరం నేనిచ్చింది కాదు. తనకు ఇంకెవరో ఇచ్చారు. అతని పేరేంటో నాకు తెలియదు. నేను సుజీని అడగలేదు. ఆమె చెప్పలేదు. ఒకసారి మాత్రం చర్చ వచ్చింది. మా ఊరి నుంచి దూరపు బంధువు ఒకతను ఇంటికొచ్చాడు. అతను బంగారు పని చేస్తాడు. నేను కుశల ప్రశ్నలన్నీ వేసి, అతిథి మర్యాదలన్నీ అయ్యాక అతను బయల్దేర డానికి రెడీ అయ్యాడు. నేను ఒక్క నిమిషం ఆగమని చెప్పి ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఆభరణాలన్నింటినీ తెచ్చి అతని చేతిలో పెట్టాను. కరిగించి అవసరమైతే ఇంకొంత బంగారం వేసి పాపకు గాజులు చేయమని చెప్పాను. వాటిల్లో విరిగిన కమ్మలు, ముక్కెరలు, పాపకు చిన్నప్పుడు బంధువులు పెట్టిన చిన్న చిన్న నగలు, తెగి పాడైపోయిన నా చైను ఇలా ఏవేవో ఉన్నాయి. వాటితోపాటు ఆ ఉంగరం కూడా ఉంది. నేను గమనించలేదు. సుజీ ఎప్పుడు చూసిందో నేరుగా వచ్చి ఆ ఉంగరం అడిగి వెనక్కి తీసుకుంది. మిగతావన్నీ తీసుకెళ్లండి అంది. అప్పుడడిగాను ఆమెను ‘ఏంటి ఆ ఉంగరం స్పెషల్’ అని. ఆమె కొంటెగా ముఖం పెట్టి ఊరిస్తూ ‘ఒక స్పెషల్ పర్సన్ ఇచ్చాడు.. వెరీ స్పెషల్..’ అంది. గతుక్కుమన్నాను. నిజమే. పెళ్లప్పుడు వాళ్లమ్మా వాళ్లు పెట్టిన నగల్లో కూడా ఇది లేదు. ఇది సమ్‌థింగ్ స్పెషలే. ఏమాత్రం దాపరికం లేకుండా అలా చెప్పడం నాకు నచ్చింది. అయితే ఎంతైనా మగ మనసు కదా కొంత ఇబ్బంది పడ్డాను. పైకి అదేమీ కనిపించకుండా ‘ఓహో.. అలాగా..’ అని కవర్ చేశాను. ఆ తర్వాత ఎప్పుడూ దాని ప్రస్తావన మా మధ్య రాలేదు. ఆ అవసరమూ కలగలేదు. భౌతికంగా, మానసికంగా ఏ లోటూ లేకుండా నన్నూ, పాపను చూసుకుంటోంది సుజీ. అలాంటప్పుడు ఆమె గతంతో నాకేం పని. మళ్లీ ఒకసారి పై జేబును తడుముకున్నాను. భద్రంగా ప్లాస్టిక్ ప్యాకెట్లో ఉంచిన నీలం రంగు రాయి ఉంగరం చేతికి తగిలింది. కారు ముందుకెళ్తోంది. నిజానికి నేను ఈపాటికి ఈ పరిసరాలు వదిలేసి పారిపోవాల్సిన వాణ్ని. పాడు రోగం కరోనా సుజీని తీసుకెళ్లిపోయాక నాకు జీవితం మీద కోరిక చచ్చిపోయింది. నిత్యం ఏవో ఆలోచనలు. దిగులుగా గడపడం చూసి అత్తామామలు ఎటైనా కొద్దిరోజులు వెళ్లేసి రమ్మన్నారు. నేనూ తయారయ్యాను. ఎనిమిదో తరగతి చదువుతున్న పాప బాధ్యత వాళ్లకే వదిలేశాను. వద్దు వద్దు అంటున్నా వినకుండా నా లాకర్ చాబీ వాళ్ల పేరుతో మార్పించాను. ఆస్తుల కాగితాలు చేతుల్లో పెట్టాను. లక్షరూపాయల వరకు బ్యాంకు బ్యాలెన్సు ఉన్న ఏటీఎమ్ కార్డు ఒక్కటే నాకు తోడుగా పెట్టుకున్నాను. బీరువాలోని బట్టలన్నీ తీసి సర్దుకుంటుంటే.. అప్పుడు కనబడింది ఉంగరం. దాన్ని చూసి దుఃఖ పడ్డాను. పెళ్లయిన కొత్తలో అది ఎప్పుడూ సుజీ చేతికే ఉండేది. ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత వేలికి పట్టడం లేదేమో తీసి బీరువాలో పెట్టేసింది. సర్దుతున్న బ్యాగును అక్కడే వదిలేసి వచ్చి హాల్లో కూర్చున్నాను. చేతిలో ఉంగరాన్నే చూస్తూ కుంగిపోయాను. అది పదే పదే సుజీని గుర్తు చేస్తోంది. అదే సమయంలో అది సుజీకి ఇచ్చిన వ్యక్తినీ గుర్తు చేస్తోంది. ఇప్పుడేం చేయాలి దీన్ని? ఎక్కడ పాతిపెట్టాలి? ఇలా వదిలేసి వెళ్తే తర్వాత ఏమవుతుంది ఇది? దీని వెనుక ఒక సున్నితమైన నా సుజీ హృదయం ఉందని ఎవరు గుర్తిస్తారు? అసలు ఎవరైనా ఎందుకు గుర్తించాలి? దీని రూపం ఇకముందు కూడా ఇలాగే ఉంటుందని గ్యారంటీ ఏంటి? ఉంగరానికి ముందు ఈ లోహం రూపం ఏంటి? అంతకుముందు కూడా ఎవరైనా దీన్ని ఒక బహుమతిగా ఇచ్చి ఉంటారా? అసలు ఈ భూమ్మీద ఒకర్నొకరు బహుమతులుగా ఇచ్చుకున్న వస్తువులన్నీ వారి మరణానంతరం ఏమవుతున్నాయి? ఒక తాజ్‌మహల్‌ని గుర్తించినట్టు ప్రతి వస్తువునూ గుర్తించడం అందరికీ సాధ్యం కాదు కదా. ఈ భూమి కూడా ఇంకెవరికైనా బహుమతిగా ఇచ్చి ఉంటే ఏర్పడిందా? అసలు బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం అనేది మార్కెట్ సంస్కృతి అంటారు కదా కమ్యూనిస్టులు. ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం? రకరకాల పిచ్చి ఆలోచనలు కాల్చుకు తింటుంటే చిక్కి సగమైపోయాను. ఎప్పుడో కానీ ముట్టని మందుకు పూర్తిగా అలవాటయ్యాను. ఇంటికే తెచ్చుకుని తాగుతూ గడుపుతున్నాను. అసలు నా బాధేంటో నాకే తెలియడం లేదు. జీవితంలోని ఒక అస్పష్టత ఏదో నన్ను వెంటాడుతోంది. అస్పష్టత కూడా ఒక బాధే అని ఇప్పుడే అర్థమవుతోంది. ఇవన్నీ కాదు.. ముందు ఈ ఉంగరానికి ఒక సమాధానం వెతకాలి. ఆ సమాధానం నాకు సంతృప్తినివ్వాలి. బాగా మథనపడ్డాక ఒక ఆలోచన తట్టింది. అసలు సుజీకి ఇది ఇచ్చిన వ్యక్తి ఎవరు? అతన్ని కలిస్తే ఎలా ఉంటుంది? బావుంటుంది... తప్పకుండా ఈ ఉంగరాన్ని అతనికిచ్చేయాలి. అతని సొమ్మును అతని దగ్గరికి చేర్చాలి. నువ్వు గుర్తుగా ఇచ్చిన ఈ ఉంగరంగల అమ్మాయి ఇప్పుడు ఈ భూమ్మీద లేదని చెప్పాలి. అప్పుడు వాడి కళ్లలో ఏమాత్రం బాధ మిగిలిందో నేను చూడాలి. అప్పుడది ఒక పిచ్చి ఆలోచన అని నాకు తెలియదు. అదే పరిష్కారం అని నమ్మాను. ఉంగరాన్ని జేబులో పెట్టుకున్నాను.అతని కోసం తిరగడం మొదలుపెట్టాను. ఎక్కడెక్కడో వెతికాను. నేరుగా సుజీ తల్లిదండ్రుల దగ్గరికెళ్లి అడిగాను. వాళ్లు నా వైపు అనుమానంగా చూశారు కానీ ఏ హింటూ ఇవ్వలేదు. లాభం లేదని వచ్చేశాను. సుజీ చిన్ననాటి స్నేహితులను కలిశాను. వాళ్లూ ఏమీ చెప్పలేదు. సుజీ సెల్‌ఫోన్ డేటా అంతా తీశాను. లాభం లేదు. ఫేస్బుక్ అకౌంటు ఉంది. కానీ దాన్ని ఆమె ఏరోజూ వాడలేదు. కనీసం అప్పుడప్పుడు కూడా ఆమె ఆ స్పెషల్ పర్సన్‌తో టచ్‌లో లేదని అర్థమైంది. అసలు టచ్‌లోనే లేకుండా పోయిన వ్యక్తితో ఇప్పుడు నాకేం పని? అతని భావోద్వేగాలతో నాకేంటి ఉపయోగం? అంతా గందరగోళం. మరింత అస్పష్టతలోకి కూరుకుపోయాను. అసలు అతను బతికే ఉంటాడని ఏంటి నమ్మకం? మొన్నటి కరోనాలో సుజీ మాదిరే ఏ ఆస్పత్రిలోనో చనిపోయి ఉంటాడా? మరెలా పట్టుకోవడం అతణ్ని? ఇక వెతకడం మానేశాను. బోర్కొట్టేస్తోంది. ఇల్లంతా శూన్యం. శవం కుళ్లిన వాసన. ఇంట్లో ఉండలేపోతున్నాను. ఒకసారి కళ్లు తిరిగి పడిపోతే ఎప్పుడో మరుసటి రోజు ఉదయం పనిమనిషి వచ్చి చూసి మా అత్తామామలకు చెప్పింది. వాళ్లు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ‘పర్వాలేదు. ఇప్పుడే అయితే పోడు కానీ పోయినంత పని చేస్తుంటాడు. కనిపెట్టుకుని ఉండాలి’ అని డాక్టర్ సూచించాడు. మా అమ్మానాన్నలు ఎక్కడో ఊళ్లో ఉంటారు. వాళ్లకు ఏ విషయం తెలియనివ్వను కాబట్టి వాళ్లు సుఖంగానే ఉన్నారని నా నమ్మకం. వారి సుఖాన్ని భంగం చేస్తానని ఒకసారి అత్తామామలు అంటే ఇంతెత్తు ఎగిరాను. తర్వాత వాళ్లు ఆ ప్రయత్నం ఆపేశారు. ‘నన్ను వదిలేయండి. నా బిడ్డను చూసుకోండి’ అంటూ ఏడ్చాను. నన్నూ వాళ్లు ఓ బిడ్డలా చూసుకోవడానికి రెడీ అయ్యారు. ఎక్కడికైనా కొంతకాలం వెళ్లడానికి సిద్ధమైన వాణ్ని ఎందుకు ఆగిపోయానో వారికి తెలియదు. నేను మళ్లీ ఒకసారి పై జేబును తడుముకున్నాను. భద్రంగా ప్లాస్టిక్ ప్యాకెట్లో ఉంచిన నీలం రంగు రాయి ఉంగరం తగిలింది. కారు ముందుకెళ్తోంది.. చెప్పాను కదా. ఇంట్లో ఒక్కణ్నే మందు కొట్టి ఉండాలంటే రాను రాను భయంగా ఉంటోంది. అది భయం కాదు ఒంటరితనం అని తర్వాత అర్థమైంది. అందుకే ఎందుకో టక్కున నా చిన్ననాటి మిత్రుడు ప్రతాప్గాడికి ఫోన్ చేశాను. ‘అబ్బా.. కరెక్టు టైమ్‌కి చేశావురా. పంజాగుట్ట బార్లో ఉన్నాను వచ్చేయ్..’ అని లొకేషన్ షేర్ చేశాడు. ఇప్పుడు దాన్ని పట్టుకుని బయల్దేరాను. ప్రతాప్గాడితో మాట్లాడితే మనసు హాయిగా ఉంటుది. సుజీ లేకుండా పోయాక నేను బాగా డిస్టర్బ్ అయ్యానని తెలుసు వాడికి. కానీ అంతకన్నా ఎక్కువగా ఈ ఉంగరం వల్ల డిస్టర్బ్ అవుతున్నానని మాత్రం వాడికి తెలియదు. ఏదో సరదాగా నాలుగు జోకులు వేస్తాడు. నవ్విస్తాడు. వాడితో కంపెనీ లేక చాలా కాలం అయింది. అందుకే వాడ్నే ఊహించుకుంటూ నేరుగా కారును తీసుకెళ్లి పార్కింగ్‌లో పెట్టాను. బారు లోపల సందడిగా ఉంది. సిగరెట్ల పొగ నిండుకుని ఉంది. మనుషులు మసక మసగ్గా కనిపిస్తున్నారు. ఎదురుగా చూరుకు వేలాడుతున్న పెద్ద ఎల్ఈడీ టీవీలో సల్మాన్ ఖాన్ దబాంగ్ సినిమా లోగొంతుతో వస్తోంది. ప్రతాప్‌గాడి కోసం వెతికాను. వాడు ఎడమ వైపు కార్నర్ సీటులో కూర్చుని ఉన్నాడు. నన్ను చూడగానే పోల్చుకుని చేయి ఊపాడు. నేనూ ఊపాను. వాడు సోఫావైపు కూర్చుని ఉన్నాడు. పక్కకు జరిగి నాకోసం స్థలం చూపించాడు. ‘ఏం రా.. అంత బక్కగా అయ్యావ్?’ అన్నాడు నన్ను చూస్తూనే. నేను నవ్వుతూ పక్కన కూర్చున్నాను. ఎదురుగా అతని స్నేహితుడు ఎవరో కూర్చుని ఉన్నాడు. బొద్దుగా ఉన్నాడు. చామన ఛాయ. లావు బుగ్గలు. షేవ్ చేసిన గడ్డం, నుదిటికి పైన పల్చబడ్డ జుట్టు. అతన్ని పరిశీలించేంతలోనే అతను చేయి చాపి ఏదో పేరు చెప్పాడు. నేనూ పేరు చెప్పి షేక్‌హ్యాండ్ ఇచ్చాను. ఇంతలో ప్రతాప్‌గాడు బేరర్ని పిలిచి బీర్ చెప్పాడు. నాకు బ్రాండ్ పట్టింపేమీ లేదని వాడికి తెలుసు. బేరర్ అలా వెళ్లి ఇలా గ్లాసు, బీరు బాటిల్‌తో వచ్చాడు. నంచుకోవడానికి టేబుల్ మీద చుడువా లాంటిదేదో ఉంది. ఎదురుగా ఉన్నతను సిగరెట్టు పొగ వదుల్తున్నాడు. ‘నువ్వేదో నీ ఫ్రెండుతో వస్తే నేను ఫోన్ చేసి ఇబ్బంది పెట్టానేమో కదరా..’ అన్నాను మొహమాటంగా. ప్రతాప్‌గాడు నవ్వాడు. ‘భలేవాడివోయ్. నువ్వెంతో ఇతనూ అంతే నాకు. హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి పరిచయం. అలా ఎవరూ ఇబ్బంది పడరు. నువ్వూ ఇబ్బంది పడకు. ఫీల్ఫ్రీ’ అన్నాడు. బేరర్ బీర్‌ని పద్ధతిగా గ్లాసులోకి వొంపాడు. వెంటనే చీర్స్చెప్పి ఒక గుక్క సిప్ చేశాను. చల్లటి బీర్ గొంతులోకి దిగేసరికి మైండ్‌లో ఉన్న స్ట్రెస్ ఏదో తగ్గుతున్న ఫీలింగ్ కలిగింది. మౌనంగా ఉన్నాను. అప్పటికే వారి మధ్య ఏదో టాపిక్ నడుస్తున్నట్టుంది. ‘సో.. అలా అయింది. ఇదిగో వీడొచ్చినాడుగా వీడిక్కూడా తెలుసు’ అన్నాడు ప్రతాప్‌గాడు నా వైపు చేయి చూపిస్తూ. దేని గురించి చెబుతున్నాడో అర్థంకాక నేను ముఖం ముడిచాను. ‘అదేరా బావ కూతురు నా మరదలు గురించి..’ అన్నాడు వాడు. విషయం అర్థమై నేను ముఖాన్ని నార్మల్‌గా పెట్టాను. నాకు ఎక్కువ మాట్లాడాలనిపించడం లేదు. కేవలం వాళ్లేదన్నా మాట్లాడుకుంటుంటే వినాలనుంది. కానీ ఈ బావ కూతురు విషయం తీసేసరికి నా ఆలోచనలు అటు పరిగెత్తాయి. ప్రతాప్‌గాడు, నేను టెన్త్ కలిసే చదువుకున్నాం. వీడితో పాటు వీడి బావ కూతురు కూడా చదువుతూండింది. ఆ పిల్లంటే వీడికి అప్పటి నుంచే ఇష్టం. ఎప్పుడూ ఆ పిల్లకోసం ఏవేవో తినుబండారాలు తెచ్చి కంపాస్ బాక్సులో దాచుకునేవాడు. ఆ పిల్ల కూడా ఇంట్లో వండినవన్నీ తెచ్చి ‘అక్క ఇమ్మంది’ అంటూ ఇస్తుండేది. నిజానికి వాళ్లమ్మ వీడికేం సొంత అక్క కాదు. వాళ్లు రెడ్లు.. వీడూ రెడ్డే కాబట్టి ఏవేవో వాడికి వాడే వరుసలు కలుపుకుని చాలాసేపు లెక్కలు వేసి తర్వాత ఆ పిల్ల నాన్న తనకు బావ అవుతాడని చెప్పాడు ఒక రోజు. ఇక ఆ పొద్దునుంచి వాణ్ని మేము విపరీతంగా ఏడిపించడం మొదలుపెట్టాం. ‘ఓహో.. నీ బావ కూతురేది?’ అంటుండేవాళ్లం. అవసరమున్నా లేకపోయినా మాటకు ముందు.. మాటకు తర్వాత ‘బావ కూతురు.. బావ కూతురు’ అంటూ ఏడిపిస్తూ ఉండేవాళ్లం. వాడు చెబుతున్నదాన్ని బట్టి వీళ్దిద్దరి మధ్య ఏదో ప్రేమ టాపిక్ నడుస్తోందని అనుకున్నాను. అదే నిజమైంది. అతను కాల్చేసిన సిగరెట్టును యాష్‌ట్రేలో పడేసి ‘ఏం బాస్.. నీకు లేవా ప్రేమ కథలూ..’ అన్నాడు చిర్నవ్వు చిందిస్తూ. నేను తేరుకుని ‘అబ్బే లేవు’ అంటుంటే ప్రతాప్‌గాడు ఊరుకోలేదు. నాకు తెలుసు వాడు ఊరుకోడని. అదే క్లాసులో ఈడిగోళ్ల పిల్ల లక్ష్మీ ప్రియ ఉండేది. ఆ పిల్ల వెంటే ఊరికే తిరిగే వాణ్ని. అందరికీ గాళ్‌ఫ్రెండ్స్ ఉంటే నాకూ ఉండాలి కదా అని తిరిగేవాణ్ని. అందులో ఏమీ స్పెషాల్టీ లేదు. ఎంత చెప్పినా ప్రతాప్‌గాడి బ్యాచ్‌కి ఎక్కి చావదు. ఈ విషయంలో వాడికీ నాకూ ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. ఇప్పుడు కూడా వాడు అదేదో పెద్ద విషయం అన్నట్టు గుర్తు చేస్తుండేసరికి చిరాగ్గా చూశాను. వాడికి అర్థమైంది నా మూడ్ బాగాలేదని. ‘వాడేదో టెన్షన్ లో ఉన్నాడు.. నీ సంగతి తేల్చు’ అన్నాడు అతని వైపు చూస్తూ. బంతి అతని కోర్టులో పడేసరికి నేను ఊపిరి పీల్చుకున్నాను. అతను చెప్పడం మొదలుపెట్టాడు. ‘నేను, సుజాత ఇంటర్మీడియెట్‌లో ఉండగా కలిశాం.’ మొదటి మాటతోనే అటెన్షన్ లోకి వెళ్లాను. ‘ఇంటర్ తర్వాత సుజాత నర్సింగ్ కోసం హైదరాబాద్ చేరింది. హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉండేది. నన్ను మా నాన్న కడపలో డిగ్రీలో చేర్చాడు. నాకు అక్కడ డిగ్రీ నచ్చడం లేదు. చదువుకోవడం ఇష్టం లేదని ఉద్యోగం చేస్తానని చెప్పి ఆ కొద్ది పాటి క్వాలిఫికేషన్ తోనే హైదరాబాద్ వచ్చేశాను. షాపూర్లో మా అత్తామామలుంటే చదువుకుంటూ రోజూ సుజాతను కలిసేవాణ్ని’. నాకు కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. బీర్ పట్టుకున్న చేయి వణుకుతోంది. బీర్‌గ్లాస్ కింద పెట్టేశాను. జ్వరం కాస్తోంది. ఒళ్లు కాలుతున్న సంగతి నాకు తెలుస్తోంది. చెమట్లు పడుతున్నాయి. అతను చెబుతున్నదంతా సుజీ గురించే... అవును నా సుజీ గురించే. సుజీ నర్సింగ్ చేసింది. ఇంకా అతనేం చెబుతాడో అని బీర్ సంగతి మర్చిపోయి అతని ముఖం వైపే చూస్తున్నాను. ‘హాస్టల్లో ఆమెకు చాలా స్ట్రిక్ట్‌గా ఉండేది. ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వదిలేవాళ్లు కాదు. బయటికెళ్తే లోపలికి అనుమతించేవాళ్లు కాదు. అనేక సంజాయిషీలు ఇవ్వాల్సి వచ్చేది. తర్వాత ఆమె నన్ను చూడకుండా ఉండలేకపోయేది. హాస్టల్లో అనేక గొడవలు. వాళ్లు సుజాత అమ్మానాన్నలకు ఫోన్ చేసి చెప్పారు. వాళ్లకు విషయమంతా తెలిసిపోయింది. ఇంటర్మీడియెట్‌లో ఉండగానే నాకు వాళ్లు ఒకసారి వార్నింగ్ ఇచ్చారు. వాళ్లు అనుమానంతో మా ఇంటి దగ్గర విచారిస్తే పిల్లోడు హైదరాబాద్‌లో ఉన్నారని చెప్పారట. వాళ్ల అనుమానం బలపడింది. అంతే సుజాతను నర్సింగ్ మాన్పించి ఇంటికి తీసుకెళ్లిపోయారు. అయితే ఒకటే సంతృప్తి. నేను సుజాతకు గుర్తుగా ఉంగరాన్ని ఇచ్చాను. ఆమె అప్పట్లోనే తాను దాచుకున్న డబ్బులతో ఇక్కడే పంజగుట్టలో నాకు ఒక టైటాన్ వాచీ ఇప్పించింది. అది మొన్నటి దాక నా దగ్గరే ఉండేది. తర్వాత పాడైపోతే పక్కన పడేశాను.’ అతను ఇంకా ఏదో చెబుతున్నాడు. నాకేమీ వినపడలేదు. సీట్లోంచి టక్కున లేచాను. సరాసరి అక్కడ్నుంచి వచ్చేశాను. వెనుక నుంచి ప్రతాప్‌గాడు ‘ఒరేయ్..ఒరేయ్’ అని అరుస్తున్నాడు. నేను బార్ బయటికొచ్చి కారు తీసి రయ్యిన టాంక్బండ్ వైపు ఉరికించాను. అక్కడ సైడుకు ఆపి సిమెంటు బెంచిపై కూర్చున్నాను. వాన పడేట్టుంది. మట్టివాసన ముక్కులకు తాకుతోంది. వాతావరణంలోని మార్పు నా మనోభారాన్ని ఏమాత్రం తగ్గించేలా లేదు. నా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఎంత మోసం? ఈ అత్తా మామలది ఎంత దుర్మార్గం? అంతా తెలిసి కూడా ఒక్క మాట నాకు చెప్పలేదు. కనీసం మొన్న అడిగినప్పుడు కూడా ఉలకలేదు పలకలేదు. వాళ్లను నమ్మి నా ఆస్తులు అప్పగించాను. నా బిడ్డను అప్పగించాను. సుజీ కళ్లలో తిరిగింది. గుండెల్లో ఇంత వ్యథను పెట్టుకుని కూడా సుజీ నన్నంతలా ఎలా ప్రేమించగలిగింది! ఇది ఒక్క తనకే సాధ్యమా? లేక ఆడవాళ్లంతా అంతేనా? ‘సుజీ ఐ లవ్యూ, నువ్వు నాకు పెళ్లానివి కాదు అమ్మవి..’ ఆలోచనలతో కళ్లు వరదలవుతుంటే చెంపలు తడిసిపోతున్నాయి. కాసేపటికి స్థిమితపడి ఇంటికి బయల్దేరడానికి లేచాను. రోడ్డుమీద ఎవరో ఎర్రగౌను పాప.. ట్రాఫిక్‌లో నాన్న నడుపుతున్న స్కూటీపై వెనక కూర్చుని ‘గాజుపెట్టెలోని తాజ్‌మహల్ బొమ్మ’ను జాగ్రత్తగా గుండెలకు హత్తుకుని ఉంది. నేను నాకు తెలియకుండానే ఒకసారి పై జేబును తడుముకున్నాను. చిన్న ప్లాస్టిక్ ప్యాకెట్లో భద్రంగా ఉంచిన నీలం రంగు రాయి ఉంగరం చేతికి తగిలింది. ఇప్పుడు పెద్దగా ఆలోచన లేకుండానే నాకు సమాధానం తట్టింది. ఇప్పుడు ఈ ఉంగరం నాది. అవును అతనెవరో తన ప్రియురాలికి ఇది గుర్తుగా ఇచ్చి ఉండొచ్చు.. కానీ ఇప్పుడు నా భార్య తనకెంతో ఇష్టమైన దీన్ని నాకు గుర్తుగా వదిలి వెళ్లింది. ఇప్పుడిది నాదే. ఎవరొచ్చినా ఇచ్చేది లేదు. ఇది నాదే. నా మనసు తీర్మానించుకుంది. మబ్బు వీడినట్టుంది దూరంగా ఆకాశంలో ఏదో తార తొంగిచూస్తోంది. కారు తీసి ఇంటి వైపు మళ్లించాను. కారు ముందుకు ఉరుకుతోంది. - వేంపల్లె షరీఫ్ -
దహనం
కథ - వేంపల్లె షరీఫ్ కథారచయిత పులిరాజును ఆ మాయాగోవు వదలడం లేదు. ఎక్కడికెళ్తే అక్కడికి హచ్ కుక్కలా వస్తోంది. తన కథ రాయమని పోరుతోంది. పులిరాజుకు చిరాకొచ్చేసింది. ‘‘నీ కథ నేనెందుకు రాయాలి? నాకేం పని లేదా?’’ అన్నాడోరోజు. గోవు దీనంగా బతిమాలింది. తన కథ రాయకపోతే చచ్చిపోతానంది. పులిరాజు కరగలేదు. ‘‘నువ్వేమైపోయినా పర్వాలేదు. నేను అనుకున్నదే రాస్తాను. ఇలా మధ్యలో ఎవరు పడితే వాళ్లొచ్చి డిస్టర్బ్ చేస్తే కరిగిపోయి వేరేవాళ్ల కథలు రాసే రకం కాదు నేను. నాకొక పంథా ఉంది. వాదం ఉంది, వాదన ఉంది. నాకు కొంతమంది పాఠకులు ఉన్నారు. నేను వాళ్ల గురించే రాస్తాను. వాళ్ల కోసమే రాస్తాను. అసలు మనుషులే సవాలక్ష సమస్యలతో చచ్చీ చెడుతుంటే వాళ్ల గురించి వదిలేసి తగుదునమ్మా అని నీవంటి గోవు గురించి రాయడానికి నాకేమైనా పిచ్చా’’ అన్నాడు పుల్లవిరుపుగా. గోవు నొచ్చుకుంది. అక్కడ్నుంచి మాయమైంది. పులిరాజుకు తెలుసు. అది మళ్లీ వస్తుంది. ఇలాగే దేబరిస్తుంది. అది ఎన్నిసార్లు వచ్చినా తాను మాత్రం కరగకూడదనుకున్నాడు. తాను అనుకున్న కథ రాశాకే అప్పుడు కూడా తనకు బుద్ధి పుడితేనే గోవు కథ రాసేది. బలవంతంగా రాయమని అడగటానికి గోవు ఎవరు? తన ఇష్టాన్ని అడ్డుకునే హక్కు దానికేముంది? టైం చూశాడు. అర్ధరాత్రి పన్నెండు అవుతోంది. కలం కాగితం బల్లమీద పెట్టి లైట్ ఆఫ్ చేసి మంచమ్మీద పడుకున్నాడు. రాత్రంతా గోవుకు సంబంధించిన కలే. ‘‘అరరే... బాగైపోయిందే దీని పీడ...’’ తిట్టుకుంటూనే నిద్ర లేచాడు. కడుపు ఉబ్బరంగా ఉంది. రాత్రి పెళ్లాం వద్దు వద్దంటున్నా వినకుండా బేకరి నుంచి తెచ్చుకుని తిన్న పిజ్జా, బర్గర్ గుర్తుకువచ్చింది. అర్జంటుగా బాత్రూంలోకి దూరాడు. ఎంత వేగంగా వెళ్లాడో... అంతే వేగంగా వెనక్కి వచ్చాడు. బాత్రూం నిండా గోవు... తెల్లటి గోవు. దేదీప్యమానంగా వెలుగుతున్న గోవు... అడ్డంగా పడుకుని చూస్తోంది... తోక ఊపుతూ. ‘‘ఛ... ఇక్కడ కూడా దాపురించావూ...’’ తిట్టుకుంటూనే మరో గదిలోని బాత్రూమ్లోకి దూరాడు. కడుపు ఖాళీ చేసుకుని హాయిగా బయటికొచ్చాడు. తర్వాత పళ్లు తోముకున్నాడు. ఇందాక లెట్రిన్కెళ్లిన బాత్రూమ్లోనే స్నానమూ కానిచ్చాడు. చక్కగా డ్రస్ వేసుకుని ఆఫీసుకు బయల్దేరుతుంటే దారికి అడ్డంగా నిలబడింది గోవు. ‘‘ఎందుకిలా నా ప్రాణం తీస్తావు...’’ అన్నాడు పులిరాజు. గోవు మౌనంగా ఉంది. ఏ పాపమూ ఎరుగని పసిపాపలా ఉంది. దానిమీద ఎంత విపరీతమైన కోపమొస్తుందో అంత ప్రేమ, జాలి కూడా కలుగుతున్నాయి అతనికి. కానీ అదేమి బయటకు కనిపించకుండా... ‘‘దారికి అడ్డం జరుగుతావా... లేక కారును నేరుగా నీమీదికే తోలమంటావా?’’ అన్నాడు కఠినంగా. అది కదల్లేదు. కారు గేరు మార్చి ముందుకు ఉరికించాడు. గోవు మాయమైంది. వచ్చి ఆఫీస్‌లో పడ్డాడు. ఆ ఆఫీస్ అతనిదే. అతనికి ఒకరి కింద పనిచేయాల్సిన అవసరం లేదు. అసలే జమిందారీ వంశం. పూర్వీకులంతా బక్క జీవుల్ని కొట్టి బతికినవాళ్లే. ఇతనొక్కడే కాస్త సాహిత్యం, జనం అంటూ తిరుగుతున్నాడు. ఆఫీసుకెళ్లి సంతకాల పనులన్నీ చూశాడు. ఎంత రచయితైనా ఆఫీసులో మాత్రం బాసే కదా... అందుకే ‘ఉద్యోగులంతా సక్రమంగా పనిచేస్తున్నారా, లేదా’ అని ఒక కన్నేశాడు. సాయంత్రంగా సరాసరి ఇంటికొచ్చేశాడు. కారు పార్కింగ్‌లో పెట్టి... ‘‘ఎక్కడా గోవు లేదు కదా’’ అని అనుమానిస్తూనే ఇంట్లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతానికి దాని జాడ కనపడకపోయేసరికి ‘హమ్మయ్యా’ అనుకున్నాడు. పెళ్లాం తెచ్చిచ్చిన వేడి వేడి కాఫీ తాగి కథ రాద్దామని కలం కాగితం అందుకున్నాడో లేదో... అంతలోకే వచ్చేసింది మళ్లీ గోవు... ‘‘నా మీద కథ రాయవూ’’ అంటూ. పులిరాజుకు మండింది. ‘‘నీకెన్ని సార్లు చెప్పాలి. నీకు కాసింతైనా సిగ్గూ, శరం లేవా? అసలు నీవు మనిషి జన్మ ఎత్తావా? గోవు జన్మ ఎత్తావా?’’ గోవుకు కోపమొచ్చింది. ‘‘నువ్వు నన్ను ఏమైనా అను. కానీ మనిషితో మాత్రం పోల్చొద్దు. మనిషి స్వార్థపరుడు. ఎప్పుడూ తన కోసమే ఆలోచిస్తాడు నీలాగ. ఆ వాదం ఈ వాదం అంటూ ఉన్మాదంలో కొట్టుకుపోతాడు. ఈ భూమ్మీద తనతో పాటు సకల జీవరాశులూ ఉన్నాయని ఎప్పుడూ గుర్తెరగడు. తన ఉనికికి అడ్డమొస్తే దేన్నయినా అంతమొందిస్తాడు’’ ‘‘ఇంకేం, బాగానే తెలుసుకున్నావే... జాగ్రత్తగా ఉండు మరి. నా జోలికి రాకు’’ గోవు వినలేదు. అక్కడే నిలబడి ఉంది. ‘‘నిలబడితే నిలబడు... నేను మాత్రం కరగను. నాకు తోచింది నేను రాసుకుపోతాను’’ అంటూ కాగితమ్మీద గబగబా రెండు ముక్కలు రాశాడు. తర్వాత కలం ముందుకు కదలడం లేదు. ‘‘నువ్విక్కడ దెయ్యం మాదిరుంటే నేను కథ రాయలేను. దయచేసి వెళ్లిపో...’’ పిచ్చిపట్టినట్టుగా అరిచాడు. అది మాత్రం అలాగే నిలబడింది ఉలుకుపలుకు లేకుండా. తల పట్టుకున్నాడు పులిరాజు. విసుగొచ్చి పెన్ను కాగితం దాని మొహమ్మీదికి విసిరికొట్టాడు. అది మాయమైంది. వెంటనే సోఫాలో వెనక్కి కూలబడి ఆలోచనలో పడ్డాడు. పులిరాజు అసలు పేరు సందివేముల రాజబాబు. ఆ తర్వాత ఏదో ఒక తోక. ఆ తోకతో మనకు పనిలేదు కాబట్టి చెప్పడం లేదు. అసలే జమిందారు వంశం కదా. రాజబాబుకు ఒక రోజు మెళ్లో పులిగోరు వేసుకోవాలని కోరిక కలిగింది. కొంతకాలం కథలు రాసేపని పక్కనపెట్టి పులిగోరు కోసం వెతికాడు. అక్కడ ఇక్కడా తిరిగాడు. సింహరాశిలో పుట్టిన తనకు పులిగోరు వేసుకుంటే ఇంకాస్త రాజసం వస్తుందని ఎవరో ఒక పెద్దమనిషి సలహా ఇచ్చాడు. దీంతో అతనిలో ఆ కోరిక రెండింతలైంది. వాస్తవానికి రాజబాబు అన్నీ సెంటిమెంట్లకు వ్యతిరేకమైన కథలు రాస్తాడు. కానీ నిజజీవితంలో ఒకలాగ, రచనల్లో ఒకలాగ ఉండే రచయితల సంప్రదాయానికి అతను భంగం కలిగించదల్చుకోలేదు. అందుకే పులిగోరు మీద విపరీతమైన వ్యామోహం పెంచుకున్నాడు. దానికి తగ్గట్టే అన్వేషణ మొదలుపెట్టాడు. రకరకాల వ్యక్తుల్ని కలిశాడు. చాలా చోట్ల అతనికి పులిగోర్లు కనబడ్డప్పటికీ అవెందుకో అతనికి నచ్చలేదు. చివరికి పడమటి పట్నంలో ఒక చోట ఒక శ్రీమంతుడి దగ్గర బంగారు వర్ణంలో మెరిసే పులిగోరు ఉందని తెలిసింది. ఆగమేఘాల మీద అక్కడికి చేరుకున్నాడు. ఆ శ్రీమంతుడు అంపశయ్య మీదున్నాడు. రేపో మాపో చనిపోతాడని అతని కొడుకులు చెప్పారు. అతని వైద్యం కోసం ఎంతో ఖర్చుచేశామని, చివరికి డబ్బుకోసం పులిగోరు అమ్మేస్తున్నామని చెప్పారు. తన పంట పండిందనుకున్న పులిరాజు అడిగినంత చెక్కు రాసిచ్చి పులిగోరుతో ఇల్లు చేరాడు. తెల్లవారుజామున ఓ మంచి ముహూర్తాన తలస్నానం చేసి తన ఇష్టదైవం కృష్ణుడ్ని మొక్కి మెళ్లో పులిగోరు వేసుకున్నాడు. ఇక అక్కడ్నుంచి అతని ఆనందానికి అంతులేదు. అయినవాళ్లింటికి, కానివాళ్లింటికి అవసరమున్నా లేకున్నా తిరిగాడు. తోటి రచయితల్ని కలిశాడు. అడిగినా, అడక్కపోయినా పులిగోరు గురించి, దాని ధర గురించి, అది సాధించడానికి పడ్డ కష్టం గురించి కథలు కథలుగా చెప్పాడు. అదంతా విన్న తోటి రచయితలు ‘‘నువ్వు కథల్లో పులిరాజు’’వని అతన్ని అమితంగా పొగిడారు. అతను పోయించిన మందు తాగి ఒకట్రెండు పత్రికల్లో వ్యాసాలు కూడా రాశారు. దీంతో అతని పేరు ‘పులిరాజు’గా స్థిరపడిపోయింది. ఆ పేరు అతనిక్కూడా బాగా నచ్చింది. దీంతో అతను ఆ పేరుతోనే కథలు రాయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అతనికి పులిగోరు మీద కూడా కథ రాయాలనిపించింది. ఇలా అందరినీ వ్యక్తిగతంగా కలసి పులిగోరు గురించి చెప్పడం కన్నా కథ రాసి అచ్చెయ్యడమే ఉత్తమంగా తోచింది. తోచిందే తడవుగా పులిగోరుకు సంబంధించిన అదనపు సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డాడు. చుట్టుపక్కల ఉన్న కొండజాతి మనుషులందరినీ కలిశాడు. గూగుల్‌లో సెర్చ్ కొట్టాడు. లైబ్రరీలో పుస్తకాలన్నీ తిరగేశాడు. ఎలాగోలాగ అక్కడింత ఇక్కడింత సమాచారాన్నంతా రాబట్టాడు. ఈలోపు విషయం పత్రికల వాళ్లకు లీకైంది. వాళ్లు ఇతని ‘కథానిబద్ధత’ గురించి గొప్పగా రాశారు. దీంతో పులిగోరు కథ మీద పాఠకుల్లో ఒక తెలియని ఆసక్తి ఏర్పడిపోయింది. ఇప్పుడెలాగైనా ఆ కథ రాసి మంచి పేరు సంపాదించాలనేది అతని కోరిక. గోవు ముందు ‘వాదం...నాదం...’ అని ఏదో డబ్బా కొట్టాడు తప్పితే అతని మనసంతా ఇప్పుడు ‘పులిగోరు రాజసం’ అనే కథ రాయడం మీదే ఉంది. ఆ రోజు కూడా ఇదిగో ఇలాగే ఓ సాయంత్రం చక్కగా సోఫాలో కూర్చుని కథ రాస్తుంటే ఎక్కడి నుంచి వచ్చిందో గోవు అచ్చం ఇప్పుడొచ్చినట్టే వచ్చి తగులుకుంది. ఇక వదలకుండా సాధించుకుని తింటోంది. ఎలాగైనా దాన్నుంచి విరుగుడు పొందాలనుకున్నాడు పులిరాజు. మరుసటి రోజు ఉదయానే లేచి దగ్గర్లోని ఓ మంత్రగాడిని కలిశాడు. అతనికి చిరాకొచ్చింది. ‘‘గోవు కనిపిస్తే మంచిదే కదా. దానికి మంత్రమెందుకు... తంత్రమెందుకు? అదేమైనా నిన్ను పొడవటానికొస్తోందా, చంపడానికి వస్తోందా? కథే కదా రాయరాదూ. పోయిపోయి గోవుతో పెట్టుకోవడం ఎందుకు? సూటిగా నీకో మాట చెప్పనా? మనిషి తనకు తాను కొన్ని తేడాలు పెట్టుకున్నట్టే జంతువుల్లో కూడా తేడాలు పెట్టాడు. కొన్నింటిని చంపితే పుణ్యం. మరికొన్నింటిని చంపితే పాపం. అర్థమైంది కదా, అందుకే గోవు జోలికి వెళ్లకు.’’ పులిరాజు కంగుతిన్నాడు. ‘‘నీకేమైనా మెంటలా? గోవుకు విరుగుడు చెప్పమంటే వేదాంతం చెబుతున్నావ్’’ అంటూ కసిరాడు. మంత్రగాడు ‘‘నేను మందివ్వలేను పో’’ అన్నాడు. పులిరాజు ఆలోచించాడు. చివరికి పత్రికలో ఒక ప్రకటన ఇచ్చాడు. తనకిలా మాయాగోవు కనబడుతోందని... దానికి విరుగుడు చెప్పిన వాళ్లకి పదివేల రూపాయల బహుమానమని ప్రకటించాడు. ఆ ప్రకటన అచ్చయిన మరుసటి రోజు ఓ మనిషి తన ఇంటికి వెతుక్కుంటూ వచ్చాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు పులిరాజు. ‘‘నువ్వా...’’ అన్నాడు. ‘‘అవును నేనే...’’ ‘‘నువ్వింకా చచ్చిపోలేదా...?’’ ‘‘లేదు... భేషుగ్గా ఉన్నాను. నీకు పులిగోరు అమ్మేశాక సుఖంగా ఉన్నాను’’ ‘‘అంటే...’’ ‘‘అర్థం కాలేదా? పులిగోరు నా దగ్గర ఉన్నంతవరకు ఆ గోవు నన్ను కూడా ‘కథరాయవూ...’ అని వెంటాడింది. నాకెక్కడ కథలు రాయడం వస్తుంది... నా బొంద. నేను చెప్పినా అది వినలేదు. ఎక్కడికెళ్తే అక్కడ కనబడింది. ఓ రోజు కారు స్పీడుగా డ్రైవ్ చేస్తుంటే అడ్డంగా వచ్చి నింపాదిగా నిలబడింది. నిజమైన గోవేమో అనుకుని సడన్‌గా బ్రేక్ వేశాను. ఇంకేముంది కారు గాల్లోకి ఎగిరి ముప్పై రెండు పల్టీలు కొట్టి కిందపడింది. చూసుకుంటే ఏముంది, నా ముప్పై రెండు పళ్లూ రాలిపోయాయి. అంతేనా... ఒంట్లో అక్కడక్కడా పుల్లలిరిగినట్టు ఎముకలు పుటుక్కుమన్నాయి. మంచం ఎక్కాను. ఆరోగ్యం బాగవడం కోసం ఉన్న ఆస్తులన్నీ కరిగించాను. ఇదేం విచిత్రమో కానీ ఎప్పుడైతే నేను నీకు పులిగోరు అమ్మేశానో... అప్పటి నుంచి సుఖంగా ఉన్నాను. ఒంట్లో తిరిగి సత్తువ వచ్చి ఇప్పుడిప్పుడే మెల్లగా తిరగ్గలుగుతున్నాను. నీ మంచి కోరి చెబుతున్నా... ఆ మెళ్లోని పులిగోరు తీసేయ్... ఆ గోవు తర్వాత నీకు కనబడదు. హాయిగా నీకు నచ్చిన కథ రాసుకో...’’ పులిరాజు ఆలోచనలో పడ్డాడు. దాని వెనుక ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉన్నందుకు ఒకింత ఆశ్చర్యపోయాడు. ఏమైతేనేమి మళ్లీ ఈ పడమటి పట్నం శ్రీమంతుడి రూపంలోనే సమాధానం దొరికినందుకు సంతోషపడ్డాడు. చెప్పిన మాట ప్రకారం పదివేల బహుమానం ఇవ్వబోతుంటే వద్దని సున్నితంగా తిరస్కరించి, వచ్చిన దారిపట్టి వెళ్లిపోయాడు. ఇక పులిరాజు ఆనందం పట్టలేక వికటాట్టహాసం అంటారే అది చేశాడు. అర్జంటుగా గోవును పిలిచి వెక్కిరించాలనుకున్నాడు. కలం కాగితం తీసుకోగానే గోవొచ్చింది. ‘‘నాకు తెలుసు. నీవు వస్తావని. ఇదే నీకు చివరి చూపు. నీ విరుగుడు నాకు తెలిసిపోయింది. ఇప్పుడు నేను నిన్ను శాశ్వతంగా దూరం చేసి నాకు నచ్చిన కథ రాయబోతున్నాను’’ అన్నాడు. గోవు భయపడిపోయింది. కాళ్లు పట్టుకుని తనను దూరం చేయొద్దని బతిమాలింది. పులిరాజు వినలేదు. దాని కళ్లముందే మెళ్లోని పులిగోరు తెంపి గూట్లోకి విసిరికొట్టాడు. అంతే... ఇక మాయాగోవు కనబడలేదు. ఇక హాయిగా పులిరాజు కథ రాయడంలో మునిగిపోయాడు. రాశాడు. రెండు రోజులు ఏకధాటిగా రాశాడు. సరిగ్గా అన్నం, నీళ్లు కూడా తీసుకోలేదు. తన అభిమానులను తల్చుకుని... తల్చుకుని... రాశాడు. కథ అద్భుతంగా వచ్చింది. పులిగోరు ప్రాశస్త్యం గురించి అది ధరిస్తే కలిగే ఆనందం, అందం గురించి శాస్త్రీయంగా సాధించి, శోధించిన విషయాన్నంతా రాశాడు. రాశాక తనలో తానే విజయగర్వంతో నవ్వుకున్నాడు. ఈ కథ అచ్చయ్యాక తనకొచ్చే ప్రశంసలను తల్చుకుని మురిసిపోయాడు. అంతలోనే అతనికి మళ్లీ ఓసారి గోవు గుర్తుకొచ్చింది. తాను అనుకున్న కథ రాసేసిన ఆనందాన్ని దాంతో పంచుకోవాలనిపించింది. వెంటనే గూట్లోంచి పులిగోరు తీసి మెళ్లో వేసుకున్నాడు. గోవు ప్రత్యక్షమైంది. ‘‘నా గురించి కథ రాయవూ’’ అంటూ. పకపకా నవ్వాడు పులిరాజు. ‘‘చూశావా... నేను నిన్ను గెలిచాను. ఇక నువ్వు ఎంత మొత్తుకున్నా లాభం లేదు. నేను అనుకున్న కథ రాసేశాను. ఇప్పటికైనా నా సత్తా తెలుసుకో. పదే పదే వచ్చి డిస్ట్రబ్ చేసినంత మాత్రాన నేను నీ దారికి వస్తానని అనుకోకు. అందరు రచయితలూ ఒకేలా ఉండరు...’’ ఇలా నోటికొచ్చింది చెప్పుకుంటూ వెళ్లాడు. బొటబొటా కన్నీళ్లు కార్చింది గోవు. ‘‘సరే... ఏడవద్దు.. నీ కథ కూడా రాస్తాన్లే...! కానీ ఒక మాట - అది నాకు నచ్చితేనే రాస్తాను. లేకుంటే లేదు. తర్వాత నన్నాడిపోసుకోవద్దు. కథ నచ్చకుండా ఏది పడితే అది రాసే రకం కాదు నేను. నాక్కొన్ని విలువలున్నాయి’’ అన్నాడు. గోవు ‘‘సరే’’ అంది. ‘‘అయితే చెప్పు’’ అన్నాడతను. గోవు చెప్పుకుంటూ పోతోంది. ‘‘నీకు ‘ఆవు-పులి’ కథ తెలుసుకదా’’ ‘‘తెలుసు’’ ‘‘అచ్చం అలాంటిదే నా కథ కూడా. రోజులాగే మేతకెళ్లి ఓ రోజు అడవిలో పులి కంటపడ్డాను. పులి తినేస్తానంది. ఇంటి దగ్గర దూడ ఉందని... పాలిచ్చి వస్తానని దీనంగా చెప్పాను. పులి కరిగిపోయింది. ఇంటికెళ్లి రావడానికి అనుమతినిచ్చింది. అంతటి ఆకలిలోనూ పులి చూపిన కరుణలో నాకు దైవం కనబడింది. సృష్టిలోని జీవులన్నింటికన్నా పులిగొప్పదిలా తోచింది. వీలైనంత తొందరగా తిరిగి రావాలని ఇంటికెళ్లాను. బిడ్డకు కడుపారా పాలిచ్చాను. ఇరుగుపొరుగువారితో ఎలా నడచుకోవాలో బుద్ధులు చెప్పాను. తిరిగి ఆదరబాదరగా అడవికొచ్చాను. కానీ అడవిలో పులి లేదు. దాని కళేబరం ఉంది. బాగా చూస్తే దాని కాళ్లకు గోళ్లు లేవు. ఇదే నా కథ’’ అని కన్నీళ్లతో చెప్పి గోవు మాయమైంది. పులిరాజుకు ఏడుపొచ్చేసింది. వెంటనే మెళ్లోని పులిగోరును తెంపి తాను కథరాసిన కాగితాల్లో వేసి నిప్పంటించాడు. నిప్పు దగద్ధాయమానంగా వెలుగుతోంది. అది ఈ లోకంలోని జనారణ్యాలన్నింటినీ దహించేస్తున్నట్టుగా ఉంది. ఆ పేరు అతనిక్కూడా బాగా నచ్చింది. దీంతో అతను ఆ పేరుతోనే కథలు రాయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అతనికి పులిగోరు మీద కూడా కథ రాయాలనిపించింది. నీ మంచి కోరి చెబుతున్నా... ఆ మెళ్లోని పులిగోరు తీసేయ్... ఆ గోవు తర్వాత నీకు కనబడదు. హాయిగా నీకు నచ్చిన కథ రాసుకో...