vemulavada rajanna
-
రాజన్న గుడిచెరువులో శివద్వీపం
వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి గుడిచెరువులో శివద్వీపం నిర్మించేందుకు వీటీడీఏ నిర్ణయించింది. వేములవాడ ఆలయ అభివృద్ధి అథారిటీ(వీటీడీఏ) వైస్ చైర్మన్ ఎం.పురుషోత్తంరెడ్డి అధ్యక్షతన శనివారం హైదరాబాద్‌లో నాలుగు గంటలపాటు సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ వేములవాడలో రెండు పర్యాయాలు పర్యటించి వెళ్లాక రాజన్న గుడి, నాంపల్లిగుట్ట, పట్టణ అభివృద్ధికి ప్రత్యేకంగా వీటీడీఏ ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.400 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశారు. ఓ పర్యాయం శృంగేరి పీఠాధిపతి అనుమతి తీసుకున్నారు. వీటిపై రూపొందించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను కమిటీ పరిశీలించింది. రాజన్నగుడి అభివృద్ధి కోసం 35 ఎకరాల్లో పనులు చేపట్టాలని, గుడిచెరువులోని 9 ఎకరాల్లో శివద్వీపం ఏర్పాటు చేసి శివుని భారీ విగ్రహం నెలకొల్పాలని, కట్టకింద బస్టాండ్‌ను రైల్వేస్టేషన్‌తో అనుసంధానించాలని, అక్కడి నుంచి భక్తులు నేరుగా ఆలయంలోకి వచ్చేందుకు ర్యాంపు ఏర్పాటు చేయాలని, బద్ధిపోచమ్మ ఆలయంలో రూ.20 కోట్ల వ్యయంతో బోనాల మంటపం నిర్మించాలని, సంకెపల్లి వద్ద చెక్‌డ్యాం నిర్మించి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని తీర్మానించారు. గుడిచెరువులో ఏడాదిపొడవునా గోదావరి జలాలు అందుబాటులో ఉండేలా రూ.17 కోట్ల వ్యయంతో మిడ్‌మానేరు డెడ్‌స్టోరేజీ నుంచి నీటిని పంపింగ్ చేయాలని నిర్ణయించారు. తుది నివేదికను త్వరలో సీఎం కేసీఆర్‌కు సమర్పించాలని భావిస్తున్నారు. సమావేశంలో ఎమ్మెల్యే రమేశ్‌బాబు, వీటీడీఏ సెక్రటరీ భుజంగరావు, ఈవో దూస రాజేశ్వర్, ఈఈ రాజయ్య, డీఈ రఘునందన్, ఆర్కిటెక్ నాగరాజు, ముక్తేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, నిర్వాసితుల కోసం తొలివిడత పరిహారంగా ఆదివారం రూ.6.38 కోట్లు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే రమేశ్‌బాబు తెలిపారు. -
వైభవంగా తొలి ఏకాదశి
వేములవాడ : వేములవాడ రాజన్న సన్నిధిలో శుక్రవారం ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తుల రద్దీతో ఆలయం కిటకిటలాడింది. ఏర్పాట్లను ఏఈవోలు ఉమారాణి, గౌరినాథ్, పీఆర్వో చంద్రశేఖర్ పరిశీలించారు. వేకువజామున 5 గంటల నుంచి అఖండ భజన కార్యక్రమం ప్రారంభమైంది. శనివారం ఉదయం వరకు భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటు అధికారులు తెలిపారు. కొండగట్టులో... మల్యాల : తొలి ఏకాదశిని పురస్కరించుకుని కొండగట్టు అంజన్నక్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయస్వామి, శ్రీవేంకటేశ్వరస్వామి, అమ్మవారి మూలవిరాట్టులను ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆలయ ఈవో పరాంకుశం అమరేందర్, సూపరిండెంట్ సూర్యనారయణ శర్మ, సునీల్, శ్రీనివాస్, మారుతిరావు పాల్గొన్నారు. కాళేశ్వరంలో.. కాళేశ్వరం : తొలి ఏకాదశిని పురస్కరించుకొని కాళేశ్వరం గోదావరి భక్తులతో కిటకిటలాడింది. నదిస్నానాల కోసం భక్తులు గోదావరి వద్ద ఉదయం నుంచే బారులు తీరారు. గోదావరిలో ఇంటిల్లిపాది పుణ్యస్నానాలు ఆచరించి జలాలను వెంట తీసుకెళ్ళారు. ఆలయంలో శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ధర్మపురిలో.. ధర్మపురి : ధర్మపురిలో తొలి ఏకాదశి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి గోదావరిలో స్నానాలు ఆచరించారు. గంగమ్మతల్లికి భక్తులు మొక్కులు చెల్లించారు. అనంతరం శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. మంథనిలో.. మంథని : తొలి ఏకాదశి సందర్భంగా మంథని వద్ద గోదావరి నదికి భక్తులు పోటెత్తారు. వేకువజామునుంచే భక్తుల రాక మొదలైంది. మంథనితోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలిరావడంతో గోదావరి రోడ్డు రద్దీగా మారింది. అరకిలో మీటర్ దూరంలో వాహనాలను నిలిపివేయడంతో భక్తులు కాలినడకన గోదావరికి చేరుకున్నారు.పుణ్యస్నానాల అనంతరం నదీతీరంలో ఆలయూలను దర్శించుకున్నారు. పొట్లపల్లి ఆలయంలో... హుస్నాబాద్ రూరల్: హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరస్వామి అలయంలో తొలి ఏకాదశి వేడులు శుక్రవారం ఘనంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో తర లివచ్చి స్వామివారిని దర్శించుకు ని, ప్రత్యేక పూజలు చేశారు. పూజారి రామకృష్ణశర్మ, అలయ కమిటీ నిర్వహకులు పాల్గొన్నారు. -
రాజన్న సన్నిధిలో హంపి పీఠాధిపతి
కరీంనగర్ జిల్లా వేములవాడ రాజన్నను హంపి పీఠాధిపతి గోవింద సరస్వతి స్వామీజీ ఆదివారం దర్శించుకున్నారు. కార్తిక మాసం కావడంతో.. రాజన్న దర్శనానికి భక్తులు బారులుతీరారు. ఈ రోజు ఆలయంలో లక్ష దీపోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.