విదేశాల్లో ఆంధ్రా రొయ్య జోరు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర మత్స్య ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్ పెరుగుతోంది. వెనామీ, టైగర్ రొయ్యల లభ్యత పెరగడంతో మత్స్య ఎగుమతులు బాగా పెరిగాయి. 2012-2013లో 9,28,215 టన్నుల విలువైన రూ.18,856 కోట్ల మత్స్య ఎగుమతులు సాధించామని విశాఖలోని సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివద్ధి సంస్థ(ఎంపెడా) తెలియజేసింది. 2011-12లో ఈ పరిమాణం 8,62,021 టన్నులు కాగా వీటి విలువ రూ.16,597 కోట్లు కావటం గమనార్హం.
నిజానికి గత కొన్నేళ్లలో వెనామీ, టైగర్ రొయ్య లభ్యత బాగా పడిపోయింది. దీంతో ఎగుమతుల్లో వ్యాపార వృద్ధి అంతగా లేదు. ఇప్పుడు ఈ రెండూ దొరుకుండటంతో ఎగుమతులకు ఊపొచ్చింది. మొత్తం ఎగుమతుల్లో ఫ్రోజెన్ రొయ్యి వాటా 51%గా ఉంది. రొయ్య ఎగుమతులు గతేడాదితో పోల్చితే 20%నికి పెరిగాయని ఎంపెడా తెలిపింది. వీటి ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌దే సింహభాగం. ఏటా దేశవ్యాప్తంగా 2 లక్షల టన్నుల రొయ్య సాగు జరగ్గా, మన రాష్ట్ర వాటానే (ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, గుంటూరు, నెల్లూరు) 1.5 లక్షల టన్నులు.
పెరుగుతున్న విదేశీ మార్కెట్...
దేశీయ రొయ్యకు విదేశాల్లో డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాసియా దేశాలు వీటి దిగుమతికి పోటీపడుతున్నాయి. మొత్తం ఎగుమతుల్లో 23% ఈ దేశాలకే వెళుతున్నాయి. యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఇప్పుడిప్పుడే ఈ ఉత్పత్తులకు ప్రాధాన్యం లభిస్తోంది. వాస్తవానికి థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేషియాల్లో రొయ్యల ఉత్పత్తి అధికంగా ఉన్నప్పటికీ రుచి, నాణ్యత పరంగా మన రాష్ట్ర రొయ్యలే ముందుంటున్నాయి. అందుకే వీటికి అంత డిమాండ్.