vending
-
‘ఫిష్ ఆంధ్రా’తో ఇంటి ముంగిటకే మత్స్య ఉత్పత్తులు
సాక్షి, అమరావతి: వినియోగదారుల ముంగిటకే చేపలు, రొయ్యల విక్రయ వాహనాలు (ఫిష్ వెండింగ్ వెహికల్స్) రానున్నాయి. మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం పెంచేందుకు ఫిష్ ఆంధ్రా పేరిట ఆక్వా హబ్‌లు, వాటికి అనుబంధంగా రిటైల్ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇకపై వాటిని ప్రజల ముంగిటకే చేర్చే ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా నిరుద్యోగ యువతకు 40 నుంచి 60 శాతం సబ్సిడీపై మొబైల్ త్రీ వీలర్ ఫిష్ వెండింగ్ కార్ట్స్, ఫోర్ వీలర్ మొబైల్ ఫిష్ అండ్ ఫుడ్ వెండింగ్ వెహికల్స్ అందజేస్తోంది. మూడు చక్రాల వాహనం ధర రూ.4 లక్షలు కాగా.. నాలుగు చక్రాల వాహనం ధర సైజును బట్టి రూ.12 లక్షల నుంచి రూ.23 లక్షలుగా నిర్ణయించారు. వీటిపై ఎస్సీ, ఎస్టీతోపాటు మహిళా లబ్ధిదారులకు 60 శాతం చొప్పున, ఇతరులకు 40 శాతం చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. వాహనం ధరలో 10 శాతం లబ్ధిదారులు చెల్లిస్తే.. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణంగా సమకూరుస్తారు. తొలి విడతగా 450 వాహనాలు ఈ వాహనాలను సచివాలయ స్థాయిలో ఏర్పాటు చేస్తుండగా.. తొలి విడతలో 300 త్రీ వీలర్, 150 ఫోర్ వీలర్ వాహనాలు అందించేందుకు రంగం సిద్ధం చేశారు. తొలి వాహనాన్ని మత్స్య శాఖ కమిషనర్ కార్యాలయంలో తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం త్యాజంపూడి గ్రామానికి చెందిన ఉప్పుల సుందరరావు అనే ఎస్సీ లబ్ధిదారునికి సోమవారం అందజేశారు. వాహనాల్లో ప్రత్యేకతలివే.. మూడు చక్రాల వాహనంలో 200 కేజీల మత్స్య ఉత్పత్తులను నిల్వ చేసుకోవచ్చు. 20 లీటర్ల సామర్థ్యం గల రెండు ఐస్ బాక్స్‌లు, వేయింగ్ మెషిన్, మైక్ సౌకర్యం, మత్స్య ఉత్పత్తులను డ్రెస్సింగ్ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఇందులో ఉంటాయి. నాలుగు చక్రాల వాహనంలో అయితే.. వాహన రకాన్ని బట్టి 2 నుంచి 8 టన్నుల వరకు నిల్వ ఉండేలా డిజైన్ చేశారు. అత్యాధునిక డ్రెస్సింగ్, రెడీ టూ ఈట్ కుకింగ్ చేసుకునేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించారు. వీటిద్వారా లైవ్ ఫిష్, ఫ్రెష్ ఫిష్, రొయ్యలు, మేరినేటెడ్ అండ్ కుక్డ్ ప్రొడక్టŠస్ను రిటైల్, ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా అమ్ముతారు. స్నాక్స్, ఇన్స్టెంట్ కుకింగ్ ఫుడ్స్ కూడా వీటిలో ఉంటాయి. ఇదీ చదవండి: రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం..ప్రజల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం -
వీధి వ్యాపారులకు వెండింగ్ సర్టిఫికెట్లు
సాక్షి, హైదరాబాద్: వీధి వ్యాపారుల చట్టం (స్ట్రీట్ వెండర్స్ యాక్ట్) ప్రకారం వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా వారికి త్వరలో ‘వెండింగ్ సర్టిఫికెట్లు’జారీ చేయనున్నామని హైకోర్టుకు రాష్ట్రæ ప్రభుత్వం తెలిపింది. ఎక్కడెక్కడ వ్యాపారాలు చేసుకోవాలో నిర్దేశిస్తూ వెండింగ్ జోన్లను కూడా నిర్ణయించనున్నామని వివరించింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా 67,313 మంది వీధి వ్యాపారులున్నట్లు గుర్తించామని, ఇప్పటికే 63,372 మందికి గుర్తింపు కార్డులు జారీ చేశామని తెలిపింది. హైదరాబాద్‌లో కొన్ని సర్కిళ్లు మినహా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన పట్టణ స్థానిక సంస్థల్లో చట్ట ప్రకారం ఏర్పాటు చేయాల్సిన టౌన్ వెండిం గ్ కమిటీలను ఏర్పాటు చేశామని వివరించింది. కేంద్రం తీసుకొచ్చిన వీధి వ్యాపారుల చట్టానికనుగుణంగా రాష్ట్రం రూపొందించి న స్ట్రీట్ వెండింగ్ స్కీమ్‌ను అమలు చేయడం లేదంటూ జి.గణేశ్‌సింగ్ అనే వ్యాపారి గతేడాది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయా లని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు పురపాలకశాఖ సంయుక్త కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు కౌంటర్ దాఖలు చేశారు. వీధి వ్యాపారుల చట్టాన్ని అమలు చేసేందుకు తాము తీసుకుంటున్న చర్యలను వివరించారు. తెలంగాణ స్ట్రీట్ వెండింగ్ స్కీం ప్రకారం సర్వే నిర్వహించామని, వెండింగ్ సర్టిఫికెట్లను డిజైన్ చేశామని, త్వరలో వాటిని పంపిణీ చేస్తామన్నారు. హైదరాబాద్‌లో 30 సర్కిళ్లున్న నేపథ్యంలో ఇక్కడ ఇంకా వెండింగ్ కమిటీలను వేయలేదని వివరించారు. గతంలో 18 సర్కిళ్లుండేవని, వీటికి కమిటీలు వేశామని, కొత్తగా ఏర్పడిన సర్కిళ్లకు త్వరలోనే కమిటీలను ఏర్పాటు చేస్తామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో సర్వే పూర్తయిన తరువాత స్ట్రీట్ వెండింగ్ ప్లాన్‌ను సిద్ధం చేస్తామన్నారు. దీంతో ధర్మాసనం వీధి వ్యాపారులపై దాఖలైన వ్యాజ్యాలన్నింటినీ జతచేయాలని, ప్రభుత్వం వెండింగ్ జోన్లను నిర్ణయించిన తరువాత వాటిపై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. -
చోరీకిపోయి ఇరుక్కున్నాడు
పిల్లలు అల్లరి చేస్తుంటారు. అందులోనూ ఎప్పుడూ చూడని వస్తువులు కనిపిస్తే ఇంకాస్త అత్యుత్సాహం ప్రదర్శించి చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఆస్ట్రేలియాలోని ఓ నాలుగేళ్ళ కుర్రాడి విషయంలో అదే జరిగింది. అంతకు ముందు ఎప్పుడూ చూడలేదో ఏమో కొత్తగా కనిపించిన వెండింగ్ మెషీన్ లో చేతులు పెట్టి ఇరుక్కు పోయాడు. అదృష్టం బాగుండి ఆరుగంటలు దాటాక ఎటువంటి అపాయం లేకుండా బయట పడ్డాడు. ఆస్ట్రేలియా బెల్బోర్న్ సిటీ సెంటర్ లో లియో అనే నాలుగేళ్ళ చిన్నారి బిస్కెట్లు, చాక్లెట్లు అమ్మకానికి వినియోగించే వెండింగ్ మెషీన్ లో చేతులు పెట్టేశాడు. విషయాన్ని గమనించిన అక్కడివారు వెంటనే ఫైర్ సిబ్బందికి ఇతర అధికారులకు సమాచారం అందించడంతో సహాయక చర్యలు చేపట్టారు. జరిగిన ఘటనతో చిన్నారి ఎంతో భయాందోళనలకు గురయ్యాడని, దీంతో సహాయక చర్యలు అతి సున్నితంగా నిర్వహించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే బిస్కెట్లు, చాక్లెట్లను దొంగతనంగా చేజిక్కించుకోవడంకోసం లియో వివిధ పద్ధతుల్లో ప్రయత్నాలు చేశాడని చివరికి అవి దక్కక పోగా చేతులు మెషీన్ లో ఇరుక్కుపోయాయని అధికారులు చెప్తున్నారు. ఆరు గంటలపాలు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ సమయంలో లియో పలుమార్లు ఆందోళనకర స్థితికి చేరుకున్నాడు. మెషీన్లో ఇరుక్కున్న లియో చేతులను తీసేందుకు మెషీన్ ను కట్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో లియో అరుపులను విని ఎంతో భయం వేసిందని, అతని దృష్టిని మరిపించేందుకు స్మార్ట్ ఫోన్లు వంటివి చూపించామని చుట్టుపక్కల వీధుల్లోని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం లియోకు ఎటువంటి ప్రమాదం లేదని, శరీరంపై ఎటువంటి గాయాలుకూడ కనిపించడం లేదని అధికారులు తెలిపారు. అయినప్పటికీ అతడ్ని పరిశీలించేందుకు మెల్బోర్న్ లోని రాయల్ ఛిల్డ్రన్స్ హాస్పిటల్ కు తరలించామని అన్నారు. ఇదిలా ఉంటే మా అబ్బాయి ఇంతకు ముందెప్పుడూ వెండింగ్ మిషన్ చూసినట్లు లేడని, బహుశా ఇదే మొదటిసారి కావడంతో బిస్కట్లు, చాక్లెట్లకోసం అందులో చేతులు పెట్టి ఉంటాడని నార్తరన్ టెర్రిటరీ ఆర్నెమ్ ల్యాండ్ లో నివసించే లియో తండ్రి ఆరోన్ అంటున్నాడు. ఏది ఏమైనా తమ కొడుకు సురక్షితంగా బయటపడటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.