Vengalayapalem
-
మితిమీరిన కారు వేగం.. తెగిపడిన యువకుడి తల
గుంటూరు రూరల్: మితిమీరిన వేగం రెండు నిండు ప్రాణాల్ని బలిగొంది. కాకుమాను మండలం రేటూరు గ్రామానికి చెందిన పఠాన్ సాదిక్ (18) గుంటూరు రూరల్ మండలంలోని వెంగళాయపాలెంలో బంధువుల ఇంట జరిగిన వివాహానికి రెండు రోజల కిందట కారులో వచ్చాడు. వివాహ అనంతరం కార్యక్రమాలు చూసుకుని ఆదివారం సాయంత్రం తిరిగి కాకుమాను వెళదామనుకున్నాడు. ఈలోగా మధ్యాహ్నం బంధువుల ఇంట్లోకి కొన్ని వస్తువులు అవసరమవ్వడంతో వాటిని తీసుకొచ్చేందుకు బేగ్ ఖాదర్ నాగుల్ బాషా (15), పఠాన్ లాలు (19)లతో కలసి కారులో బయలుదేరాడు. ఇందులో పఠాన్ లాలు కారును నడుపుతున్నాడు. మితిమీరిన వేగంతో వెళుతూ వెంగళాయపాలెంలోని జగ్జీవన్‌రామ్ సెంటర్లో రోడ్డు పక్కన ఉన్న విగ్రహం దిమ్మెను బలంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో ఖాదర్ నాగుల్ బాషా, సాదిక్‌లు అక్కడికక్కడే దుర్మరణం చెందగా లాలుకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ఓ యువకుడి తలతెగి రోడ్డుపై పడిందంటే ఎంత వేగంగా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ప్రమాదంలో మృతి చెందిన నాగుల్ బాషా తండ్రి మహమ్మద్ బేగ్. ఆయన ముగ్గురు కుమారుల్లో రెండోవాడైన బాషా 9వ తరగతి చదువుతున్నాడు. తనయుడు మృత్యువాతకు గురవ్వడం చూసి ఆయనతో పాటు కుటుంబసభ్యుల రోదన మిన్నంటింది. మృతి చెందిన సాదిక్‌ను చూసేందుకు సైతం తండ్రి మస్తాన్‌వలి తల్లడిల్లిపోయారు. ప్రమాదంలో కారును నడుపుతున్న లాలుకు గతంలో ఇటువంటి ప్రమాదం జరిగి ఒక కాలును కూడా కోల్పోయాడని సమాచారం. జైపూర్ ఫుట్‌తో కారును నడుపుతున్నాడని స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న నల్లపాడు పోలీసులు ఘటన స్థలికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతదేహాల్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. -
వెంగళాయపాలెంలో దొంగల హల్చల్!
* ప్రజల అప్రమత్తతతో పరారు * ఒకేరోజు గ్రామంలో నాలుగు చోట్ల చోరీ యత్నం * దుండగుల ఆటోను అదుపులోకి తీసుకున్న పోలీసులు గుంటూరు రూరల్: పోలీసుల రాత్రి గస్తీలు అంతంత మాత్రంగా ఉండడంతో చోరులు తెగబడుతున్నారు. అందిన కాడికి దోచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదమరిచి ఉంటే అంతే సంగతులు అన్నట్టుంది గ్రామాల్లో ప్రజల పరిస్థితి. మండలంలోని వెంగళాయపాలెం గ్రామంలో బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చి గ్రామంలోని విశ్వం దుకాణం సమీపంలో తాళాలు వేసిన ఇంట్లోకి ప్రవేశించారు. ఎవరూ లేని ఇంట్లో లైట్లు వెలగడంతో స్థానికులు ఎవరని కేకలు వేయడంతో దుండగులు ఆటోలో పరారయ్యారు. అనంతరం 10 గంటల ప్రాంతంలో గ్రామంలోని కోళ్ల ఫారాల సెంటర్లో మూసేసిన దుకాణం షట్టర్లు వంచేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. అనంతరం 11 గంటలప్రాంతంలో గ్రామ శివారులో ఒక పూరింట్లో చోరీకి ప్రయత్నించగా, వృద్ధురాలు అప్రమత్తమవడంతో పారిపోయారు. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో సాయిబాబా ఆలయం సమీపంలో వెంకటరావు దుకాణంలో చోరీకి ప్రయత్నిస్తూ దుకాణం షట్టర్లు పలుగులతో వంచేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికుడు గమనించి కేకలు వేశాడు. దీంతో దుండగులు వారి వద్దనున్న రెండు పదునైన పలుగులు, మూడు షట్టర్లు, తాళాలు పగులగొట్టేందుకు వినియోగించే వస్తువులను వారితోపాటుగా తెచ్చుకున్న ఆటోను అక్కడే వదిలి పరారయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు అక్కడికి చేరుకుని దుండగులు వినియోగించిన పలుగులు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో ఒకే రోజు నాలుగు చోట్ల చోరీయత్నం జరగడంతో గురువారం మొత్తం గ్రామంలో ఇదే విషయం చర్చనీయాంశమైంది. పోలీసుల గస్తీలు సక్రమంగా లేకపోవడంతోనే దుండగులు తెగబడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు గ్రామాల్లో గస్తీలు పెంచాలని కోరుతున్నారు. -
ముఖం చాటేసిన మంత్రివర్యులు
సమస్యలతో సహవాసం చేస్తున్న మంత్రిగారి దత్తత గ్రామస్తులు ప్రమాదాలకు నిలయంగా మారిన లో లెవెల్ చప్టా రాళ్ళు లేచి అధ్వానంగా ఉన్న ప్రధాన, అంతర్గత రహదారులు ఇదీ వెంగళాయపాలెం గ్రామం దుస్థితి గుంటూరు రూరల్ : మంత్రి గారు దత్తత తీసుకున్న గ్రామంలోనే సమస్యలు పరిష్కారానికి నోచుకోవట్లేదు. స్వయాన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు దత్తత తీసుకున్న వెంగళాయపాలెం గ్రామంలో అనేక సమస్యలు నెలకొన్నాయి. మంత్రివర్యులు దత్తత తీసుకుంటే తమ బతుకులు మారుతాయని భావించిన గ్రామస్తులకు నిరాశే ఎదురవుతోంది. నానా అవస్థలు గ్రామంలో అంతర్గత రహదారులతోపాటు ప్రధాన రోడ్డు సైతం అధ్వానంగా ఉంది. ఈ రహదారులపై ప్రయాణించాలంటే జనం నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు ప్రధాన రహదారిలో ఉన్న లో లెవెల్ చప్టా పూర్తిగా శిథిలావస్థకు చేరింది. చప్టా మధ్య భారీ సైజు రంధ్రం పడింది. ద్విచక్ర వాహనం పట్టేంత రంధ్రం పడటంతో వాహన చోదకులు ఎప్పుడు ఏం ప్రమాదం వాటిల్లుతుందోనని భయాందోళనలు చెందుతున్నారు. రాత్రివేళల్లో ప్రమాణం మరీ ఇబ్బందికరంగా మారింది. మూడు దశాబ్ధాల క్రితం నిర్మించిన ఈ చప్టా ప్రస్తుతం వాహనాల రాకపోకలను అనువుగా లేదు. ఛిద్రమైన ప్రధాన రహదారి.. ప్రధాన రహదారి పూర్తిగా రాళ్ళులేచి ఛిద్రంగా మారింది. భారీ వాహనాలు వెళ్ళేటపుడు రాళ్ళు ఎగిరి పడుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకల సమయంలో ప్రజలు భయాందోలనలు చెందుతున్నారు. ఇదిలా ఉంటే గ్రామంలో మురుగు కాల్వల వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా తయారైంది. దోమలు వ్యాపించి విషజ్వరాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మంత్రివర్యులు తమ గ్రామం వైపు దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు.