వెంగళాయపాలెంలో దొంగల హల్‌చల్!
వెంగళాయపాలెంలో దొంగల హల్‌చల్!
Published Thu, Oct 20 2016 10:09 PM | Last Updated on Sat, Aug 11 2018 6:04 PM
* ప్రజల అప్రమత్తతతో పరారు
* ఒకేరోజు గ్రామంలో నాలుగు చోట్ల చోరీ యత్నం
* దుండగుల ఆటోను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గుంటూరు రూరల్: పోలీసుల రాత్రి గస్తీలు అంతంత మాత్రంగా ఉండడంతో చోరులు తెగబడుతున్నారు. అందిన కాడికి దోచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదమరిచి ఉంటే అంతే సంగతులు అన్నట్టుంది గ్రామాల్లో ప్రజల పరిస్థితి. మండలంలోని వెంగళాయపాలెం గ్రామంలో బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చి గ్రామంలోని విశ్వం దుకాణం సమీపంలో తాళాలు వేసిన ఇంట్లోకి ప్రవేశించారు. ఎవరూ లేని ఇంట్లో లైట్లు వెలగడంతో స్థానికులు ఎవరని కేకలు వేయడంతో దుండగులు ఆటోలో పరారయ్యారు. అనంతరం 10 గంటల ప్రాంతంలో గ్రామంలోని కోళ్ల ఫారాల సెంటర్‌లో మూసేసిన దుకాణం షట్టర్లు వంచేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. అనంతరం 11 గంటలప్రాంతంలో గ్రామ శివారులో ఒక పూరింట్లో చోరీకి ప్రయత్నించగా, వృద్ధురాలు అప్రమత్తమవడంతో పారిపోయారు.
అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో సాయిబాబా ఆలయం సమీపంలో వెంకటరావు దుకాణంలో చోరీకి ప్రయత్నిస్తూ దుకాణం షట్టర్లు పలుగులతో వంచేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికుడు గమనించి కేకలు వేశాడు. దీంతో దుండగులు వారి వద్దనున్న రెండు పదునైన పలుగులు, మూడు షట్టర్లు, తాళాలు పగులగొట్టేందుకు వినియోగించే వస్తువులను వారితోపాటుగా తెచ్చుకున్న ఆటోను అక్కడే వదిలి పరారయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు అక్కడికి చేరుకుని దుండగులు వినియోగించిన పలుగులు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో ఒకే రోజు నాలుగు చోట్ల చోరీయత్నం జరగడంతో గురువారం మొత్తం గ్రామంలో ఇదే విషయం చర్చనీయాంశమైంది. పోలీసుల గస్తీలు సక్రమంగా లేకపోవడంతోనే దుండగులు తెగబడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు గ్రామాల్లో గస్తీలు పెంచాలని కోరుతున్నారు.
Advertisement