venkaiahnayudu
-
మాతృభాషలోనే ప్రాథమిక విద్య సాగాలి
సాక్షి, హైదరాబాద్: ప్రాథమికవిద్య మాతృభాషలోనే జరగాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఉద్ఘాటించారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఏవీ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్లాటినం జూబ్లీ ప్రారంభ వేడుకలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డితో కలసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏవీ డిజిటల్ లైబ్రరీ, ఏవీ యూట్యూబ్ చానల్‌ను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ‘మన విద్యావ్యవస్థ ఇంకా పరాయిపాలన నుంచి పూర్తిగా బయటపడలేదు. చిన్నప్పటి నుంచే ఆంగ్ల మాధ్యమం మోజులో పడి అమ్మభాషను మర్చిపోతున్నారు. ఈ ధోరణి పూర్తిగా మారాల్సిన అవసరం ఉంది. అందుకు సరైన మందు ప్రాథమిక విద్యను మాతృభాషలో అమలు చేయడమే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేయాలి. భావవ్యక్తీకరణ, విషయ పరిజ్ఞానం పెరగడం, సామాజిక స్థితిగతులను తెలుసుకోవడంలో మాతృభాష దోహదపడుతుంది’అని అన్నారు. మాతృభాష కంటిచూపు వంటిదని, పరాయి భాష కళ్లద్దాల వంటిదని, కంటిచూపు లేకుంటే కళ్లద్దాలు ఉన్నా లాభం లేదని చమత్కరించారు. విద్య కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాకుం డా విజ్ఞానం సంపాదించుకోవడం, దేశానికి సేవను అందించడం కోసం ఉండాలన్నారు. విద్యాబోధన ఒక మిషన్లా ఉండాలి... సమాజం అభివృద్ధి చెందాలంటే సరైన విద్య అందించాలని గుర్తించిన పలువురు మేధావులు విద్యాసంస్థలను స్థాపించారని, అందులో భాగంగా ఏవీ ఎడ్యుకేషనల్ సొసైటీ తనవంతు పాత్ర నిర్వర్తిస్తోందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. విద్యాబోధన ఒక మిషన్లా సాగాలే కానీ, అది కమీషన్ కోసం సాగితే పలు అనర్థాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం విద్యాసంస్థల్లో ఎక్కడా సరైన మైదానాలు ఉండడంలేదన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం యువత వ్యాయామం, యోగాకు సమయం కేటాయించాలన్నారు. తల్లి దండ్రులు, జన్మభూమి, మాతృభాష, గురువు కు గౌరవమివ్వాలని యువతకు సూచించారు. విద్యావిధానంలో మార్పులు అవసరం... మన విద్యావిధానంలో మరిన్ని సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ మం త్రి జి.జగదీశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతమున్న విద్యావిధానం పాత పద్ధతిలో ఉందని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆధునీకరించాలన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు స్థానం ఉండేది కాదని, కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో సంస్కరణలు జరిగాయన్నారు. సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాలని, జీవనం, ఉపాధికి సంబంధించిన అంశాలను జోడించి మార్పులు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఏవీ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు కె. ప్రతాప్‌రెడ్డి, సెక్రటరీ కొండా రామచంద్రారెడ్డి, కమిటీ సభ్యులు రామకృష్ణారెడ్డి, రఘువీర్ రెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమాజ సేవ ప్రతి ఒక్కరి బాధ్యత
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సమాజ సేవను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని పనిచేయాలని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. మన ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన సమాజానికి తిరిగి సేవ చేయాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని సూచించారు. తద్వారా సమాజంలోని పేద విద్యార్థులకు, ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. చెన్నై నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నెల్లూరు నగరంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న రామ్‌నాథ్ కోవింద్, సవితా కోవింద్ దంపతులకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ స్వాగతం పలికారు. గవర్నర్‌తోపాటు రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అమర్నాథ్రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఉన్నారు. ఆనంతరం అక్కడి నుంచి రాష్ట్రపతి దంపతులు నగరంలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడి నివాసానికి చేరుకున్నారు. అక్కడ అల్పాహారం ముగించిన తర్వాత వెంకటాచలం మండలంలోని అక్షర స్కూల్‌కు చేరుకున్నారు. అక్కడ ఎర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్కూల్‌ను పరిశీలించారు. అక్కడి నుంచి స్వర్ణభారత్ ట్రస్ట్‌కు చేరుకొని అక్కడ మొక్క నాటారు. ట్రస్ట్ 18వ వార్షికోత్సవ వేడుకల్లో రామ్‌నాథ్ కోవింద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ట్రస్ట్ ఎండీ, వెంకయ్య నాయుడి కుమార్తె దీపా వెంకట్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ప్రధానంగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో శిక్షణ, ఉపాధి కార్యక్రమాలను అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలుగు సంస్కృతి గురించి బాగా చెప్పే వ్యక్తి వెంకయ్య సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వెంకయ్య నాయుడు అజాత శత్రువు, రాజ్యసభ చైర్మన్‌గా ఏంతో సమర్థవంతంగా సభను నిర్వహిస్తున్నారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొనియాడారు. తనకు ఢిల్లీలో వెంకయ్య నాయుడు ఆంధ్రా వంటకాలను రుచి చూపించారని, అలాగే తెలుగు సంస్కృతి గురించి ఢిల్లీలో బాగా చెప్పే వ్యక్తి అని అన్నారు. వెంకయ్యకు సేవా కార్యక్రమాల్లో స్ఫూర్తి అయిన భారతరత్న నానాజీ దేశ్‌ముఖ్ ట్రస్ట్‌ను గత నెలలోనే తాను సందర్శించానని, మళ్లీ ఇప్పుడు అలాంటి ట్రస్ట్ అయిన స్వర్ణభారత్‌ను సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... ఢిల్లీలో మినహా మిగిలిన దేశంలో ఎక్కడా భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి దంపతులు కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొనలేదని, అలాంటి అరుదైన అవకాశం స్వర్ణభారత్ ట్రస్ట్‌కు దక్కిందని చెప్పారు. ట్రస్ట్‌ను ఆశీర్వదించడానికి వచ్చిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు సేవ చేయడం తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. అందుకే స్నేహితుల సహకారంతో 18 ఏళ్ల క్రితం మొదలైన ట్రస్ట్ నేడు నెల్లూరుతోపాటు అమరావతి, హైదరాబాద్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తోందన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం ట్రస్ట్ కృషి చేస్తోందని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ వారివారి ప్రాంతాల్లో స్వర్ణభారత్ ట్రస్ట్ తరహాలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సతీమణి ఉషా నాయుడు, రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అమర్నాథ్రెడ్డి, ట్రస్ట్ చైర్మన్ కె.విష్ణురాజు తదితరులు పాల్గొన్నారు. -
చెప్పినా బెగ్గింగ్ అన్న కేంద్ర మంత్రి, వద్దన్న వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభలో ఇకపై బెగ్గింగ్ అనే పదం వాడొద్దని చెప్పినా ఓ మంత్రి ఉపయోగించారు. దాంతో ఆ మంత్రి ప్రసంగం ప్రారంభిస్తుండగానే దయచేసి ఆ పదాన్ని ఉపయోగించకండి అని రాజ్యసభ ఉపాధ్యక్షుడు వెంకయ్యనాయుడు సూచించారు. సాధారణంగా రాజ్యసభలో ఏదైనా బిల్లును ప్రవేశపెట్టే సమయంలో 'ఐ బెగ్ టూ'(నేను వేడుకుంటున్నాను) అని అంటుంటారు. అయితే, ఈ పార్లమెంటు సమావేశాల ప్రారంభ సమయంలోనే ఐ బెగ్ టూ అనే పదం వలసవాదానికి నిదర్శనం అని, ఇప్పుడు అందరం స్వతంత్ర్య భారతంలో జీవిస్తున్నామని, ఆంగ్లేయులు విడిచి వెళ్లిన ఆపదాన్ని విడిచి 'నేను లేవనెత్తుతున్నాను' అనే పదం ఉపయోగించాలని వెంకయ్యనాయుడు చెప్పారు. అయితే, శుక్రవారంనాటి సమావేశంలో కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి పీపీ చౌదరీ 'ఐ బెగ్ టూ' అనే పదం ఉపయోగించారు. దీనికి వెంటనే స్పందించిన వెంకయ్య ఆ పదం ఉపయోగించొద్దన్నారు. బహుషా తొలిరోజు సమావేశాల సమయంలో చౌదరీ లేకపోయి ఉండొచ్చని, అందుకే మళ్లీ గుర్తు చేస్తున్నానని, ఎంపీలు ఎవరూ ఆ పదం ఉపయోగించవద్దని పునరుద్ఘాటించారు. వాస్తవానికి వెంకయ్యనాయుడు చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎంపీ కూడా ఆ పదం ఉపయోగించలేదు. -
ప్రవేశికలో జోక్యం చేసుకోం..
తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని బీజేపీ నేత వెంకయ్యనాయుడు అన్నారు. రైతులకు వ్యతిరేకంగా తాము ఎలాంటి చర్యలకు దిగడం లేదని చెప్పారు. ఈ సందర్భంగా రాజ్యాంగ ప్రవేశిక ప్రతిని లోక్‌సభలో ప్రదర్శిస్తూ దానిపై కొద్ది సేపు చర్చించారు. ఈ సవరణతో ప్రవేశికకు ఎలాంటి భంగపాటు జరగదని, ప్రవేశిక జోలికి తాము వెళ్లబోమని చెప్పారు. మంగళవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు లోక్‌సభలో గందరగోళానికి దారి తీశాయి. లోక్‌సభలో పలు ఆర్డినెన్స్‌పై జరిగిన ప్రశ్నోత్తరాల్లో విపక్షాలు ప్రశ్నలతో విరుచుకుపడ్డారు. భూసేకరణ సవరణ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. దీంతో వెంకయ్యనాయుడు జోక్యం చేసుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేత జ్యోతిరాధిత్య సింథియా, వెంకయ్యమధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే, సవాళ్లు ప్రతిసవాళ్లు వద్దని, సమస్య పరిష్కారం వైపుగా సాగుదామని వెంకయ్యనాయుడు సూచించారు. రాజ్యాంగ ప్రవేశికలో జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు.