నైజీరియాలో తెలుగు వ్యక్తి కిడ్నాప్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి అయిదు రోజుల క్రితం నైజీరియాలో కిడ్నాప్ అయ్యారు. ఇంతవరకు అతని జాడ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు విన్నవించుకుంటున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన అయిశెట్టి వెంకట పవన్ కుమార్ ఆగ్రాలో ఎమ్మెస్సీ హార్టికల్చర్ పూర్తిచేశారు. అనంతరం పలు ప్రముఖ కంపెనీల్లో పని చేశారు. ప్రస్తుతం నైజీరియాలో పామ్ ఆయిల్ ఉత్పత్తికి సంబంధించిన ఓ భారతీయ కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్నారు.
అయితే ఏమైందో ఏమో ఫిబ్రవరి 20వ తేదీన కుటుంబసభ్యులకు ఫోన్ చేసిన పవన్.. తాను ఇబ్బందుల్లో ఉన్నానని, రెండు రోజుల్లో తన నుంచి ఫోన్ కాల్ రాకపోతే మెయిల్ లో ఉన్న కంపెనీ నెంబరుని సంప్రదించాల్సిందిగా చెప్పారు. రెండు రోజులుగా పవన్ నుంచి ఎటువంటి సమాచారం లేకపోవటంతో కంగారుపడిన కుటుంబసభ్యులు అతని మెయిల్ ఓపెన్ చేసి అందులో ఉన్న కంపెనీ నెంబరుకు ఫోన్ చేశారు. అటు నుంచి సరైన స్పందన లేకపోవడంతో మెయిల్లో ఉన్న ఇతర వివరాల సాయంతో నైజీరియాలో ఉంటున్న మరికొందరు తెలుగువాళ్లను సంప్రదించారు.
వారు స్థానికులను విచారించి వెంకట పవన్ కిడ్నాప్ అయినట్లు కుటుంబీకులకు తెలిపారు. ఆయుధాలతో వచ్చిన కొందరు నైజీరియా గిరిజనులు వెంకట పవన్ ను కిడ్నాప్ చేసినట్లు తెలిసిందన్నారు. వెంటనే నైజీరియాలో ఉన్న ఇండియన్ ఎంబసీకి విషయాన్ని చేరవేశారు. అయితే రోజులు గడుస్తున్నా తమ కుమారుడి ఆచూకీ తెలియడం లేదంటూ శుక్రవారం పవన్ బాబాయి మీడియాకు వెల్లడించారు.
ఇప్పటి వరకు ఇండియన్ ఎంబసీ నుంచి నిన్న ఒకే ఒక్క ఫోన్ కాల్ వచ్చిందని, కంపెనీ అధికారులను విచారిస్తున్నట్లు వారు చెప్పారని పవన్ బాబాయి తెలిపారు. పవన్ కిడ్నాప్ విషయంలో ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా వెంకట పవన్ కు మూడేళ్ల క్రితమే వివాహమయ్యింది. ఏడాదిన్నర వయసున్న పాప, 9 నెలల బాబు ఉన్నారు. వచ్చే నెలలో తాను పిల్లలతో కలిసి నైజీరియా వెళ్లేందుకు పాస్‌పోర్టులు కూడా సిద్ధం చేసుకున్నానని, ఈలోగా ఈ ఘటన జరిగిందని పవన్‌కుమార్ భార్య లక్ష్మీఅన్నపూర్ణ వాపోయింది.