Venkata Subba Rao
-
స్వయంకృషి
శిఖరాన్ని అధిరోహించేటప్పుడుఒక్క తప్పటడుగు వేసినా పాతాళంలో పడేస్తుంది!జీవితం కూడా అంతే!! ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయకపోతే.. దాని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయిముందున్నది ముళ్లబాటైనా..తెలివిగా దాటిన వారే విజేతలుగా నిలుస్తారుజీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారుకుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడుదొడ్డక వెంకట సుబ్బారావు స్వయం కృషిని నమ్ముకున్నారు నేడు పది మందికీ ఉపాధి చూపుతున్నారు. ఒంగోలు సబర్బన్: గుంటూరు జిల్లా కాకుమాను మండలం వళ్లూరు గ్రామానికి చెందిన దొడ్డక వెంకట సుబ్బారావు సామాన్య రైతు కూలీ కుటుంబంలో జన్మించాడు. 1987లో పదో తరగతి పాసైన కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు మానేయాల్సి వచ్చింది. కుటుంబ పోషణ కోసం తండ్రి ఒక్కరే కష్టపడుతుండటం చూసి సొంతూరులోనే కాకా హోటల్లో పనిలో చేరాడు. ఆ తర్వాత కొంతకాలానికి సొంతగా కాకా హోటల్ ప్రారంభించాడు. ఈ క్రమంలోనే కుటుంబ బాధ్యతలు పెరగడం, ఆదాయం సరిపోకపోవడంతో హోటల్‌ను వేరే వాళ్లకు ఇచ్చారు. 2002లో ఒంగోలు పట్టణానికి చేరుకున్నారు. తన స్నేహితుని సాయంతో ఇక్కడి కర్నూలు రోడ్డులోని వీఐపీ బ్యాగుల దుకాణంలో గుమాస్తాగా చేరారు. కొంతకాలానికి వ్యాపారంలో మెళకువలు నేర్చుకుని తాను పనిచేస్తున్న దుకాణాన్నే లీజుకు తీసుకున్నారు. వీఐపీ బ్యాగుల షాపును నిర్వహిస్తూనే నలుగురికి ఉపాధి కల్పిస్తూ వచ్చారు. బ్యాగులు కొనేందుకు దుకాణానికి వచ్చే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇనుప మంచాలు, స్టడీ చైర్లు, చెప్పుల స్టాండ్లు అడగడం ప్రారంభించారు. దీంతో సుబ్బారావు ఆలోచన వాటి తయారీ వైపు మళ్లింది. అనుకున్నదే తడవుగా పరిశ్రమ స్థాపనకు అవసరమైన వనరులను సమకూర్చుకున్నారు. 2009లో ఒంగోలు దక్షిణ బైపాస్‌లో ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకుని షెడ్లు నిర్మించి ఇంజినీరింగ్ వర్క్స్ పరిశ్రమను స్థాపించారు. తొలుత ఐదుగురు కార్మికులతో మొదలుపెట్టిన పరిశ్రమ దినిదినాభివృద్ధి చెందింది. 110 మందికి పైగా ఉపాధి సుబ్బారావు నెలకొల్పిన ఇంజినీరింగ్ వర్క్స్ పరిశ్రమలో ప్రస్తుతం 110 మందికి పైగా కార్మికులు పరిచేస్తున్నారు. స్కిల్డ్ వర్కర్స్, రోజువారీ కార్మికులతోపాటు ఇంకా ఎవరైనా పనికోసం వస్తే లేదనేదే ఉండదు. ఈ క్రమంలోనే పరిశ్రమలో అధునాతన యంత్ర పరికరాలు ఏర్పాటు చేశారు. ఎలక్ట్రో స్ట్రాటిక్ మిషన్లు, పౌడర్ కోటింగ్ ఎక్విప్మెంట్, హీటింగ్ మిషన్లు, వెల్డింగ్, కటింగ్ మిషన్లతోపాటు వివిధ రకాల యంత్ర పరికరాల సాయంతో పనిచేయిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ వైద్యశాలలు, పాఠశాలలు, కళాశాలల్లో హాస్టళ్లకు అవసరమైన ఇనుప మంచాలు, నవారు మంచాలు, లాడ్జిలకు ఉపయోగపడే మంచాలు, పడక కుర్చీలు, స్టడీ చైర్లు, ఆఫీస్ టేబుల్స్, చెప్పుల స్టాండ్లు ఇలా ఒకటేమిటి ఇంజినీరింగ్ వర్క్స్‌కు సంబంధించి టోకుగా ఎలాంటి ఆర్డర్ ఇచ్చినా తయారు చేసి ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకటించిన ఈ–టెండర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలకు ఐరన్ షీట్‌తో కూడిన ఇనుప మంచాలను సరఫరా చేసే అవకాశం దక్కించుకున్నారు. ఏటా వేలాది మంచాలు తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నారు. ఇక్కడ తయారు చేసే సామగ్రిని తీసుకెళ్లి, నగదును నెలవారీ వాయిదాల రూపంలో చెల్లిస్తూ 50 మంది వరకు ఉపాధి పొందుతున్నారు. పది మందికీ ఉపాధిచూపడంలో సంతృప్తి ఒక్కరమే జీవించడం కాదు.. పది మందికీ జీవనోపాధి కల్పించాలనేదే నా లక్ష్యం. మా తండ్రి పొలం పనికి వెళ్తూ మరో పది మందిని ముఠా కట్టి తీసుకెళ్లేవారు. పది మంది ఒక పొలంలో పనికెళ్తే వారందరికీ ఉపాధి దొరికినట్టే. నేను స్థాపించిన పరిశ్రమలో కూడా అలాగే ఉపాధి కల్పించాలని భావించా. 2002లో ఒంగోలు వచ్చి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నా. ఇందుకోసం దాదాపు 10 సంవత్సరాలు కష్టపడ్డా. పదుల సంఖ్యలో కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నానన్న సంతృప్తి సంతోషాన్నిస్తోంది. – దొడ్డక వెంకట సుబ్బారావు -
ఏసీబీ వలలో అవినీతి చేప
రూ.10వేలు లంచం తీసుకుంటూ చిక్కిన దేవాదాయ శాఖ ఉద్యోగి జీతం బకాయిల కోసం ఉద్యోగినికి వేధింపులు విజయవాడ సిటీ : దేవాదాయ శాఖలో లంచం రుచిమరిగిన తిమింగలాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. విజయవాడలోని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఇ.వెంకట సుబ్బారావు శనివారం రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు. అతని వద్ద నుంచి లంచం మొత్తం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఏసీబీ డీఎస్పీ ఆర్.విజయపాల్ కథనం ప్రకారం.. కృష్ణలంక ఫైర్‌స్టేషన్ సమీపంలోని అభయాంజనేయ స్వామి దేవాలయం గ్రేడ్-2 కార్యనిర్వహణాధికారిగా పని చేస్తున్న వి.నాగజ్యోతికి గత మార్చిలో పదోన్నతి లభించింది. ఆమెకు రూ.1,70,500 జీతం బకాయిలు రావాల్సి ఉంది. వాటి కోసం పలుమార్లు కార్యాలయానికి తిరిగినా దేవాదాయశాఖ అధికారులు పట్టించుకోలేదు. జీతం బకాయి బిల్లును తయారు చేసి ఖజానాకు పంపాలంటే.. బిల్లు మొత్తంలో 10శాతం లంచం ఇవ్వాలని కార్యాలయం సూపరింటెండెంట్ వెంకట సుబ్బారావు డిమాండ్ చేశారు. ఆమె పలుమార్లు ప్రాధేయపడగా రూ.10 వేలు ఇస్తే సర్దుకుంటానని చెప్పారు. దీంతో నాగజ్యోతి అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. దొరికిందిలా... నాగజ్యోతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ముందుగా సూపరింటెండెంట్ వెంకట సుబ్బారావు వ్యవహారశైలిపై ఇన్స్పెక్టర్ ఎస్ఎస్వీ నాగరాజుతో విచారణ జరిపించారు. విచారణలో తేలిన అంశాల ఆధారంగా సూపరింటెండెంట్‌పై కేసు నమోదు చేశారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో నాగజ్యోతి పోలీసు కంట్రోల్ రూమ్ సమీపంలోని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయంలోని మొదటి అంతస్తుకు వెళ్లి రూ.10 వేలను సూపరింటెండెంట్‌కు అందజేశారు. ఆ మొత్తాన్ని తీసుకున్న సుబ్బారావు తన టేబుల్ డ్రాయర్ సొరుగులో పెట్టారు. ఆమె కిందకు వచ్చి ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. రసాయన పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టు వచ్చిందని డీఎస్పీ తెలిపారు. విద్యుత్ శాఖ ఏడీఈ మధ్యవర్తిగా పంచనామా జరిపి వెంకట సుబ్బారావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు డీఎస్పీ చెప్పారు. అతని ఇంటిపై కూడా మరో బృందంతో దాడి చేశామని, అక్కడ ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు వెల్లడైతే మరో కేసు నమోదు చేస్తామని తెలిపారు. దాడుల్లో ఇన్స్పెక్టర్లు ఎం.శ్రీనివాస్, ఎస్ఎస్వీ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. డబ్బు ఇవ్వకుంటే బిల్లు పంపనన్నాడు జీతం బకాయిల కోసం ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదు. ముందు 10 శాతం ఇవ్వమన్నాడు. కాదంటే రూ.10 వేలు ఇస్తేనే బిల్లు చేసి పంపుతానన్నాడు. న్యాయంగా రావాల్సిన బకాయిలకు లంచం ఎందుకు ఇవ్వాలని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాను. అధికారులు స్పందించి పట్టుకున్నారు. ఇలాంటి వారికి తగిన శిక్ష పడాల్సిందే. వి.నాగజ్యోతి, గ్రేడ్-2 ఈవో, అభయాంజనేయస్వామి దేవస్థానం. -
నిర్లక్ష్యం ఖరీదు రెండు నిండు ప్రాణాలు
ఆటోడోర్ తాడు తెగిపోయి... మరికొద్ది రోజుల్లో ఒకరింట శుభకార్యం పరారీలో డ్రైవర్ జీలగలగండి(ఘంటసాల),న్యూస్‌లైన్ : ఆటోడ్త్రెవర్ నిర్లక్ష్యం రెండు నిండుప్రాణాలను బలితీసుకుంది. ఆటోలో వెనుక వైపు కూర్చుని వెళుతున్న ఇద్దరు డోరుకు కట్టిన తాడు ఊడిపోవడంతో మృత్యువాత పడ్డారు. వీరిలో పూషడం గ్రామానికి చెందిన అంకం వెంకట సుబ్బారావు(55) ఇంట్లో మరికొద్ది రోజుల్లో శుభకార్యం జరగనుండగా, చోటుచేసుకున్న ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం పూషడంకు చెందిన అంకం వెంకటసుబ్బారావు, మచిలీపట్నం మండలంలోని భోగిరెడ్డిపల్లికి చెందిన పడమటి సముద్రాలు(55) కలసి చల్లపల్లి మండలం మాజేరు బడ్డీల వద్ద చల్లపల్లి నుంచి మచిలీపట్నం వెళుతున్న ఆటోలో ఎక్కారు. లోపల ఖాళీ లేకపోవడంతో వెంకటసుబ్బారావు మినుముల మూటను వెనుకవైపు డోరులో ఉంచి... పడిపోతుందేమోననే ఆందోళనతో అతనూ వెనుకవైపుఉన్న డోర్లో ఎక్కాడు. వెంకటసుబ్బారావుతో పాటు ఖాళీగా ఉందని సముద్రాలూ కూర్చున్నాడు. అక్కడ నుంచి సుమారు 6కి.మీ దూరంలో ఉన్న జీలగలగండి శివారు దెయ్యపుడౌన్ వద్దకు రాగానే ఆటోడోర్కు ఉన్న తాడు ఊడిపోవడంతో వెనుక కూర్చున్న ఇద్దరూ రహదారిపై పడిపోయారు. ఇద్దరి తలకు బలమైన గాయాలవ్వడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఇది గమనించిన ఆటో డ్త్రెవర్ ఆటోను అక్కడ వదిలేసి పరారయ్యాడు. డోరుకు కట్టిన తాడు గట్టిగా ఉందో లేదో చూసుకోకుండా డ్త్రెవర్ ఈ ఇద్దరినీ ఎక్కించడం వల్లే చనిపోయారని బంధువులు ఆరోపిస్తున్నారు. కుమార్తె వివాహం చూడకుండానే... వెంకటసుబ్బారావు చిన్నకుమార్తె వివాహం మే ఒకటో తేదీన జరగాల్సి ఉంది. వివాహం కోసం వచ్చే బంధువులకు పిండి వంటలు చేసేందుకు మినుములు పట్టించాలని మచిలీపట్నం వెళుతుండగా ఈ ఘటన జరిగింది. కుటుంబానికి పెద్దదిక్కయిన వెంకటసుబ్బారావును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే చల్లపల్లి సీఐ దుర్గారావు, ఘంటసాల ఎస్ఐ టీవీ వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు.