నూతనంగా తెచ్చిన రంగుల మిక్సింగ్ యంత్రాన్ని పరిశీలిస్తున్న యజమాని సుబ్బారావు
శిఖరాన్ని అధిరోహించేటప్పుడుఒక్క తప్పటడుగు వేసినా పాతాళంలో పడేస్తుంది!జీవితం కూడా అంతే!! ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయకపోతే.. దాని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయిముందున్నది ముళ్లబాటైనా..తెలివిగా దాటిన వారే విజేతలుగా నిలుస్తారుజీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారుకుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడుదొడ్డక వెంకట సుబ్బారావు స్వయం కృషిని నమ్ముకున్నారు నేడు పది మందికీ ఉపాధి చూపుతున్నారు.
ఒంగోలు సబర్బన్: గుంటూరు జిల్లా కాకుమాను మండలం వళ్లూరు గ్రామానికి చెందిన దొడ్డక వెంకట సుబ్బారావు సామాన్య రైతు కూలీ కుటుంబంలో జన్మించాడు. 1987లో పదో తరగతి పాసైన కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు మానేయాల్సి వచ్చింది. కుటుంబ పోషణ కోసం తండ్రి ఒక్కరే కష్టపడుతుండటం చూసి సొంతూరులోనే కాకా హోటల్లో పనిలో చేరాడు. ఆ తర్వాత కొంతకాలానికి సొంతగా కాకా హోటల్ ప్రారంభించాడు. ఈ క్రమంలోనే కుటుంబ బాధ్యతలు పెరగడం, ఆదాయం సరిపోకపోవడంతో హోటల్‌ను వేరే వాళ్లకు ఇచ్చారు. 2002లో ఒంగోలు పట్టణానికి చేరుకున్నారు. తన స్నేహితుని సాయంతో ఇక్కడి కర్నూలు రోడ్డులోని వీఐపీ బ్యాగుల దుకాణంలో గుమాస్తాగా చేరారు. కొంతకాలానికి వ్యాపారంలో మెళకువలు నేర్చుకుని తాను పనిచేస్తున్న దుకాణాన్నే లీజుకు తీసుకున్నారు. వీఐపీ బ్యాగుల షాపును నిర్వహిస్తూనే నలుగురికి ఉపాధి కల్పిస్తూ వచ్చారు. బ్యాగులు కొనేందుకు దుకాణానికి వచ్చే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇనుప మంచాలు, స్టడీ చైర్లు, చెప్పుల స్టాండ్లు అడగడం ప్రారంభించారు. దీంతో సుబ్బారావు ఆలోచన వాటి తయారీ వైపు మళ్లింది. అనుకున్నదే తడవుగా పరిశ్రమ స్థాపనకు అవసరమైన వనరులను సమకూర్చుకున్నారు. 2009లో ఒంగోలు దక్షిణ బైపాస్‌లో ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకుని షెడ్లు నిర్మించి ఇంజినీరింగ్ వర్క్స్ పరిశ్రమను స్థాపించారు. తొలుత ఐదుగురు కార్మికులతో మొదలుపెట్టిన పరిశ్రమ దినిదినాభివృద్ధి చెందింది.
110 మందికి పైగా ఉపాధి
సుబ్బారావు నెలకొల్పిన ఇంజినీరింగ్ వర్క్స్ పరిశ్రమలో ప్రస్తుతం 110 మందికి పైగా కార్మికులు పరిచేస్తున్నారు. స్కిల్డ్ వర్కర్స్, రోజువారీ కార్మికులతోపాటు ఇంకా ఎవరైనా పనికోసం వస్తే లేదనేదే ఉండదు. ఈ క్రమంలోనే పరిశ్రమలో అధునాతన యంత్ర పరికరాలు ఏర్పాటు చేశారు. ఎలక్ట్రో స్ట్రాటిక్ మిషన్లు, పౌడర్ కోటింగ్ ఎక్విప్‌మెంట్, హీటింగ్ మిషన్లు, వెల్డింగ్, కటింగ్ మిషన్లతోపాటు వివిధ రకాల యంత్ర పరికరాల సాయంతో పనిచేయిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ వైద్యశాలలు, పాఠశాలలు, కళాశాలల్లో హాస్టళ్లకు అవసరమైన ఇనుప మంచాలు, నవారు మంచాలు, లాడ్జిలకు ఉపయోగపడే మంచాలు, పడక కుర్చీలు, స్టడీ చైర్లు, ఆఫీస్ టేబుల్స్, చెప్పుల స్టాండ్లు ఇలా ఒకటేమిటి ఇంజినీరింగ్ వర్క్స్‌కు సంబంధించి టోకుగా ఎలాంటి ఆర్డర్ ఇచ్చినా తయారు చేసి ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రకటించిన ఈ–టెండర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలకు ఐరన్ షీట్‌తో కూడిన ఇనుప మంచాలను సరఫరా చేసే అవకాశం దక్కించుకున్నారు. ఏటా వేలాది మంచాలు తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నారు. ఇక్కడ తయారు చేసే సామగ్రిని తీసుకెళ్లి, నగదును నెలవారీ వాయిదాల రూపంలో చెల్లిస్తూ 50 మంది వరకు ఉపాధి పొందుతున్నారు.
పది మందికీ ఉపాధిచూపడంలో సంతృప్తి
ఒక్కరమే జీవించడం కాదు.. పది మందికీ జీవనోపాధి కల్పించాలనేదే నా లక్ష్యం. మా తండ్రి పొలం పనికి వెళ్తూ మరో పది మందిని ముఠా కట్టి తీసుకెళ్లేవారు. పది మంది ఒక పొలంలో పనికెళ్తే వారందరికీ ఉపాధి దొరికినట్టే. నేను స్థాపించిన పరిశ్రమలో కూడా అలాగే ఉపాధి కల్పించాలని భావించా. 2002లో ఒంగోలు వచ్చి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నా. ఇందుకోసం దాదాపు 10 సంవత్సరాలు కష్టపడ్డా. పదుల సంఖ్యలో కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నానన్న సంతృప్తి సంతోషాన్నిస్తోంది. – దొడ్డక వెంకట సుబ్బారావు
Comments
Please login to add a commentAdd a comment