నగరంలో భూమి కొనుగోలు చేస్తున్నారా ?
వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ : వరంగల్ అర్బన్ పరిధిలోని భూములకు డిమాండ్ పెరగడంతో వాటి రేట్లు అధికమయ్యాయి. విలువతోపాటు వివాదాలు కొనుగోలుదారులను వెంటాడుతున్నాయి. కొంతమంది భూకబ్జాదారులు భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లోని లోపాలను తమకు అనుకూలంగా మార్చుకుని తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి వాటి ద్వారా అసలు భూయజమానులను భయపెడుతున్నారు.
తద్వారా నగరంలో భూసమస్యలు అధికమవుతుండడంతో భూములు, ఇంటి స్థలాలు కొనుగోలు చే సే ప్రజలకు అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వర్రావు పలుసూచనలు చేశారు. సాధారణంగా ప్రజలు భూమి కొనుగోలు విషయంలో నకిలీ డాక్యుమెంట్లు, భూములను తనఖా పెట్టడం, ఒకే భూమిని ఇద్దరు లేక ముగ్గురికి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వడం, అనుమతి లేని లేఅవుట్స్ స్థలాలను కొనుగోలు చేయడం, ఒకే భూమిని ఇద్దరు, ముగ్గురు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయడం, ఆక్రమణలకు లాంటి మోసాలకు గురవుతున్నారు. భూములు, ఇంటి స్థలాల కొనుగోలు చేసే ప్రజలు ముందుగా పరిశీలించవలసిన పత్రాల వివరాలను తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. ముఖ్యంగా ప్రజలు పరిశీలించాల్సిన పత్రాలు
ఒరిజనల్ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలి.
ఆ భూమి, ప్లాట్ యాజమాన్య హక్కులు ఎవరి పేరు మీద ఉన్నాయో స్థానిక తహసీల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయం ద్వారా యాజమాన్య హక్కు పత్రాలు పొందాలి.
తాము కొనుగోలు చేసే భూములు ప్రభుత్వానికి చెందినదా, బూదాన్, వ్యవసాయ భూములా అనే విషయాన్ని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ధ్రువీకరించుకోవాలి.
తహసీల్దార్ కార్యాలయం నుంచి పహణీ కాపీలు(1956 నుంచి), కాసార కాపీలు, పట్టా పాస్‌బుక్, టైటిల్ వివరాల కాపీలను పొందాలి.
కొనుగోలు చేసే భూములు ఆక్రమణకు గురయ్యాయా, తనఖా పెట్టారా, ఏమైనా కోర్టు కేసులు ఉన్నాయో తెలుసుకోవాలి.
భూమికి సంబంధించి కొనుగోలు సమయంలో సరైన స్టాంప్ డ్యూటీ చెల్లించాలి.
కొనుగోలు చేసిన భూములను వెంటనే తమ ఆధీనంలోకి తీసుకోవడంతోపాటు పాస్‌బుక్ లేదా ఒరిజనల్ డాక్యుమెంట్లను అమ్మకందారుడి నుంచి స్వాధీనం చేసుకోవాలి.
ఆ భూమికి సంబంధించి ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా అంటూ స్థానిక పత్రికల్లో ప్రకటన ఇవ్వాలి.
ఒరిజనల్ డాక్యుమెంట్లపై నల్ల సిరాతో కూడిన రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ముద్రలు అచ్చువేయబడి ఉంటాయి. బ్లూ రంగుతో కూడిన సేల్ డీడ్, స్టాంపులు చెల్లవు.
నోటరీ డాక్యుమెంట్లు చట్టప్రకారం చెల్లవు.
భూమికి సంబంధించి ట్రాన్సఫర్ రుసుం, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ దాఖలు చెల్లించినది.. లేనిది గుర్తించాలి.
సాధ్యమైనంత వరకు భూములు, ఇంటి స్థలాల అమ్మకందారుడి వివరాలను విచారించి కొనుగోలు చేయాలి. ఏమైనా మోసం జరిగినట్లు తెలిస్తే స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతోపాటు సంబంధిత పత్రాలతో కోర్టును సకాలంలో ఆశ్రయించాలి.