రైతుల పక్షాన ఉద్యమం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని
మచిలీపట్నం : మండలంలోని 17 గ్రామాలు, పెడన మండలంలోని రెండు గ్రామాల్లో 30 వేల ఎకరాల భూమి సేకరించేందుకు ప్రయత్నిచండం ప్రభుత్వ భూ దాహానికి అద్దం పడుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య(నాని) విమర్శించారు. ఆయన ఆదివారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లో బందరు పోర్టు పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన పాలకులు ఆ విషయాన్ని పక్కనపెట్టి, భూసేకరణ చట్టం ఆగస్టు 31వ తేదీతో ముగియనుండటంతో హడావుడిగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రైతులెవ్వరూ భూములను వదులుకునేందుకు సిద్ధంగా లేరని, వారికి అండగా వైఎస్సార్ సీపీ నిలబడుతుందని ప్రకటించారు.
పోర్టు భూసేకరణ నోటిఫికేషన్‌కు అయ్యే ఖర్చులు ఇచ్చేందుకు ప్రభుత్వం వెనుకా, ముందు ఆలోచిస్తుంటే కలెక్టర్ బతిమలాడుకుని రూ.5 కోట్లు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. 30 వేల ఎకరాలుసేకరణ చేస్తే రైతులకు నష్టపరి హారం ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద నగదు ఉందా, ఉంటే ఎప్పటిలోగా అందజేస్తారు, రైతులు భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారో, లేదో తెలుసుకోకుండా ఏకపక్షంగా నోటిఫికేషన్ వరకు వెళ్లడం అన్యాయమన్నారు. అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానుండటంతో భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసి రైతుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు తమ ప్రభుత్వం దిగివచ్చిందని చెప్పడానికి పాలకులు ఈ కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. అనంతరం రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా ల్యాండ్ పూలింగ్ చేస్తామని చెప్పినా ఆశ్చర్యం లేదని పేర్ని నాని పేర్కొన్నారు.