సైన్స్‌పై అవగాహన పెంచేందుకు జేవీవీ కృషి
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : విద్యార్థుల్లో సైన్స్‌పై మరింత అవగాహన పెంచేందుకు జనవిజ్ఞాన వేదిక కృషి చేస్తుందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నన్నూరి వెంకటరమణారెడ్డి అన్నారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బుధవారం నల్లగొండ పట్టణంలో డైట్లో పట్టణ స్థాయి చెకుముకి టాలెంట్టెస్ట్ జరిగింది. దాదాపు 47 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ టెస్ట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఇంగ్లీషు మీడియంలో సెయింట్ ఆల్ఫోన్సస్ హైస్కూల్, తెలుగు మీడియంలో నిర్మల విద్యామందిర్ పాఠశాలల విద్యార్థులు మొదటిస్థానం సాధించి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్ధులనుద్ధేశించి వెంకటరమణారెడ్డి మాట్లాడారు. సైన్స్‌ను నిత్యజీవితానికి అన్వయించడంలో లోపం జరుగుతుందని, దీనివల్లనే సమాజంలో మూఢనమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. సైన్స్ ఫలాలు సామాన్యులకు అర్థం అయినపుడే సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి ఎస్కే. మస్తాన్, సమత జిల్లా కన్వీనర్ అమరావతి, పట్టణ అధ్యక్షుడు వర్ధెల్లి లింగయ్య పాల్గొన్నారు.