venkayyanaidu
-
సందిగ్ధంలో పార్లమెంట్ సెషన్స్
-
‘వర్చువల్’గా పార్లమెంటు సమావేశాలు!
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలపై కరోనా ప్రభావం పడింది. గతంలో వలె.. వర్షాకాల సమావేశాల నిర్వహణ సాధ్యం కాదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులకు ఇరు సభల సెక్రటరీ జనరల్స్ స్పష్టం చేశారు. కనీసం ఒక మీటరు భౌతిక దూరం పాటిస్తూ సీట్లకు కేటాయించినా∙సమావేశ మందిరాల్లో సభ్యులందరికీ సీట్లు కేటాయించలేమన్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో, విజ్ఞానభవన్ ప్లీనరీ హాల్లో అందరు సభ్యులకు సీట్లు కేటాయించగలిగేంత స్థలం లేదన్నారు. భౌతిక దూరం పాటిస్తూ ఎంతమంది ఎంపీలకు సభలో సీట్లు కేటాయించగలమో వారికి తెలిపారు. భౌతిక దూరం పాటిస్తూ సీట్లను ఏర్పాటు చేస్తే రాజ్యసభ సమావేశ మందిరంలో 60 మందికే కూర్చునే అవకాశం లభిస్తుందని, సెంట్రల్హాల్లో 100 మందికే కూర్చునే వీలుంటుందని తెలిపారు. గ్యాలరీల్లోనూ కూర్చునేలా ఏర్పాట్లు చేసినా అందరు ఎంపీలకు అవకాశం కల్పించలేమన్నారు. దాంతో ఆన్లైన్ ద్వారా వర్చువల్ విధానంలోనో, లేదా హైబ్రిడ్ విధానంలోనో సమావేశాల నిర్వహణ సాధ్యమవుతుందా? అనే విషయాన్ని ఓం బిర్లా, వెంకయ్య పరిశీలించారు. కొందరు సభ్యులు ప్రత్యక్షంగా సమావేశాలకు హాజరైతే మిగతావారు వీడియో లింక్ ద్వారా వర్చువల్‌గా సభా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడమే హైబ్రిడ్ విధానం. రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా.. ఏ రోజు ఏ ఎంపీ భాగస్వామ్యం ప్రత్యక్షంగా అవసరమో, వారినే సభలోనికి అనుమతించి, మిగతా వారు ఆన్లైన్లో సభాకార్యక్రమాల్లో పాల్గొనేలా చేయాలనే విషయాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలను వర్చువల్‌గానో, హైబ్రిడ్ విధానంలోనో నిర్వహించడానికి సంబంధించి అన్ని సాంకేతిక అంశాలను పరిశీలించాలని సెక్రటరీ జనరల్స్‌ను ఇరు సభల అధ్యక్షులు ఆదేశించారు. -
'మా మనసుకు చాలా బాధేసింది'
న్యూఢిల్లీ: భారత్ లో అసహనం ఎక్కువైందని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపట్ల కేంద్రమంత్రి వెంకయ్యానాయుడు స్పందించారు. ఆ వ్యాఖ్యలు తమను చాలా బాధించాయని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. దురదృష్టవశాత్తు, తెలిసో, తెలియకో ఆయన అన్న మాటలు తమ మనసులకు తీవ్ర ఇబ్బందికలిగించాయని చెప్పారు. 'కొంతమంది ప్రజలు తప్పుదోవలోకి మళ్లించబడుతున్నారు. కొంతమంది తప్పుదోవడపడుతున్నారు. ఈ కేటగిరిలోకి వచ్చినవారిని నేరుగా ప్రస్తావించను. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను ఇతర ఏ దేశాల్లో లేని చక్కటి పరిస్థితులు మాత్రం భారత్‌లో ఉన్నాయి. భారత్‌లో సహనం ఎక్కువ. భారత ప్రజలు సహనపరులు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మతపరమైన ఘర్షణలు తగ్గుతూ వచ్చాయి. అమాయక ప్రజలను మావోయిస్టుల చంపేసే ఘటనలు తగ్గిపోయాయి. వేధింపులు కూడా తగ్గుముఖం పట్టాయి' అని ఆయన చెప్పారు. అమిర్ ఖాన్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమర్ధించడంపట్ల కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచ నేతగా ఎదుగుతున్న క్రమాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతుందని అన్నారు. ఈ సందర్భంగా తాము పరిపాలనలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన సంఘటనలను ఒక్కొక్కటిగా వివరించారు. అవి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే సంభవించాయని చెప్పారు. మోదీ ప్రభుత్వం కేవలం అభివృద్ధిపైనే దృష్టి పెట్టింది తప్ప ఒకరిపై ఒత్తిడి తీసుకురావడం, మరికొందరిపై ఆంక్షలు విధించడం, పరిమితులు విధించడంలాంటి చర్యలేమి చేయడం లేదని అన్నారు. దేశంలో ఆరు నెలలుగా అభద్రతా పరిస్థితులు నెలకొన్నాయని, తమ పిల్లల విషయంలో తన భార్య కిరణ్ ఆందోళన చెందుతోందని, దేశం వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్లాలని కూడా ఆలోచించిందని అమీర్ ఖాన్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు పెను ధుమారం రేపాయి. -
కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుంది
ఒంగోలు టౌన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అసంబద్ద వ్యాఖ్యలు చేస్తుంటే కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై ప్రతిపక్షంలో ఒకవిధంగా, అధికారంలోకి వచ్చిన తరువాత మరోవిధంగా మాట్లాడటాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. సోమవారం ఒంగోలు వచ్చిన సందర్భంగా స్థానిక రెవెన్యూ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఏవిధంగా అర్హత లేదనడం ఒక ఉద్యమకారులుగా ఉద్యోగులే కాదు ప్రజలను కూడా తీవ్రంగా బాధిస్తోందన్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైనప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక బాధ్యతగల వ్యక్తిగా ఇక్కడి ప్రజలు గుర్తిస్తారన్న విషయాన్ని వెంకయ్యనాయుడు గమనించాలన్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకునేందుకు ఎలాంటి ఉద్యమానికైనా తాము సిద్ధంగా ఉన్నామని బొప్పరాజు స్పష్టం చేశారు.