'మా మనసుకు చాలా బాధేసింది'
న్యూఢిల్లీ: భారత్ లో అసహనం ఎక్కువైందని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపట్ల కేంద్రమంత్రి వెంకయ్యానాయుడు స్పందించారు. ఆ వ్యాఖ్యలు తమను చాలా బాధించాయని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. దురదృష్టవశాత్తు, తెలిసో, తెలియకో ఆయన అన్న మాటలు తమ మనసులకు తీవ్ర ఇబ్బందికలిగించాయని చెప్పారు. 'కొంతమంది ప్రజలు తప్పుదోవలోకి మళ్లించబడుతున్నారు. కొంతమంది తప్పుదోవడపడుతున్నారు. ఈ కేటగిరిలోకి వచ్చినవారిని నేరుగా ప్రస్తావించను. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను ఇతర ఏ దేశాల్లో లేని చక్కటి పరిస్థితులు మాత్రం భారత్లో ఉన్నాయి.
భారత్లో సహనం ఎక్కువ. భారత ప్రజలు సహనపరులు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మతపరమైన ఘర్షణలు తగ్గుతూ వచ్చాయి. అమాయక ప్రజలను మావోయిస్టుల చంపేసే ఘటనలు తగ్గిపోయాయి. వేధింపులు కూడా తగ్గుముఖం పట్టాయి' అని ఆయన చెప్పారు. అమిర్ ఖాన్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమర్ధించడంపట్ల కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచ నేతగా ఎదుగుతున్న క్రమాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతుందని అన్నారు.
ఈ సందర్భంగా తాము పరిపాలనలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన సంఘటనలను ఒక్కొక్కటిగా వివరించారు. అవి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే సంభవించాయని చెప్పారు. మోదీ ప్రభుత్వం కేవలం అభివృద్ధిపైనే దృష్టి పెట్టింది తప్ప ఒకరిపై ఒత్తిడి తీసుకురావడం, మరికొందరిపై ఆంక్షలు విధించడం, పరిమితులు విధించడంలాంటి చర్యలేమి చేయడం లేదని అన్నారు. దేశంలో ఆరు నెలలుగా అభద్రతా పరిస్థితులు నెలకొన్నాయని, తమ పిల్లల విషయంలో తన భార్య కిరణ్ ఆందోళన చెందుతోందని, దేశం వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్లాలని కూడా ఆలోచించిందని అమీర్ ఖాన్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు పెను ధుమారం రేపాయి.