ప్రాణంతో చెలగాటం!
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ప్రాణవాయువు అందక రోగులు విలవిల్లాడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటిలేటర్ కావాలంటే ఒకరిది తీసి..మరొకరికి అమర్చాల్సి వస్తోంది. వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి రక్తమోడుతూ ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, నిమ్స్ ఆస్పత్రుల్లోని అత్యవసర విభాగానికి చేరుకున్న క్షతగాత్రులకు కృత్రిమశ్వాస అందించే వెంటిలేటర్లు దొరకడం లేదు. వెంటిలేటర్లు ఖాళీ లేకపోవడంతో అత్యవసర విభాగంలోని వైద్యులు ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులకు తరలించాల్సి వస్తోంది. ప్రతిష్టాత్మక ఈ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న హృద్రోగులు, శ్వాస సంబంధిత జబ్బులతో బాధపడుతున్న రోగులకు ఎండోట్రెకియల్ ఇంటుబేషన్ పద్ధతిలో అంబూ బ్యాగు ద్వారా ప్రాణవాయువును అందిస్తున్నారు. బెలూన్ను చేత్తో ఒత్తడం వల్ల ఒకసారి తక్కువ, మరొకసారి ఎక్కువ గాలి పంపింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ హెచ్చుతగ్గుల వల్ల రోగులు మత్యువాతపడే ప్రమాదం లేకపోలేదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మూలకు చేరిన సగానికిపైగా వెంటిలేటర్లు
⇔ 1,012 పడకల సామర్థ్యం గల గాంధీ ఆస్పత్రిలో అనధికారికంగా రెండు వేల పడకలు ఉన్నాయి. ఇక్కడ నిత్యం రెండు వేల మంది రోగులు చికిత్స పొందుతుంటారు. వీరికోసం ఆస్పత్రిలో ఖరీదైన ఎంఆర్ఐ, సీటీ సహా మొత్తం 2400 వైద్య పరికరాలను ఏర్పాటు చేశారు. వీటిలో 525కు పైగా వైద్య పరికరాలు పనిచేయకపోవడం గమనార్హం. 86 వెంటిలేటర్లు ఉండగా, వీటిలో 20పైగా మూలకు చేరాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన క్షతగాత్రులకు వెంటిలేటర్ అవసరమైతే..అప్పటికే వెంటిలేటర్‌పై ఉన్న వారిది తొలగించి, కొత్తగా వచ్చిన వారికి అమర్చాల్సిన దుస్థితి.
⇔ ఇక ఉస్మానియా ఆస్పత్రిలో అధికారికంగా 1,168 పడకలు ఉండగా, అనధికారికంగా 1385 పడకలు ఉన్నాయి. నిత్యం 1400 మంది రోగులు చికిత్స పొందుతుంటారు. అత్యవసర విభాగానికి రోజుకు 250 మంది వస్తుండగా, వీరిలో అత్యధికులు ప్రమాదాల్లో గాయపడిన వారు, పాయిజన్, పాము కాటు బాధితులు, సెప్టిసీమియా, న్యూరో సంబంధిత బాధితులే. వీరిలో చాలా మందికి వెంటిలేటర్ అవసరం ఉంటుంది. ఆస్పత్రిలో అన్ని విభాగాల్లో 80 పైగా వెంటిలేటర్లు ఉండగా, వీటిలో ప్రస్తుతం 40కిపైగా పని చేయడం లేదు.
⇔ ప్రతిష్టాత్మక నిమ్స్‌లో పరిస్థితి మరోలా ఉంది. ఆస్పత్రి అత్యవసర విభాగాన్ని 96 పడకలకు విస్తరించారు. ఒక్కో పడకకు ఒక వెంటిలేటర్ సమకూర్చారు. ఆస్పత్రిలో రోగులకు సరిపడు వెంటిలేటర్లు ఉన్నప్పటికీ...స్వయంగా ఈఎండీ అధికారే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. నిత్యం ఏడెనిమిది వెంటిలేటర్లను బ్లాక్‌లో పెడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగులకు వెంటిలేటర్లు ఖాళీ లేవని చెప్పి...తమకు కమిషన్లు ఇచ్చే పంజగుట్ట, కూకటపల్లిలోని ఆస్పత్రులకు రోగులను తరలిస్తున్నారు. బంధువులు, తెలిసినవారి కోసం ఇతరులకు అమర్చిన వెంటిలేటర్లను తొలగించి తమవారికి అమర్చుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై ఇటీవల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో ఈ అంశంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ఆ సంస్థ పట్టించుకోదు..
నిర్వహణ లోపానికి తోడు ఆస్పత్రిలో పని చేస్తున్నకొంత మంది ఉద్దేశపూర్వకంగా వైద్యపరికరాలను ధ్వంసం చేయడం వల్ల కొనుగోలు చేసిన కొద్ది రోజులకే సాంకేతిక లోపాలతో అనేక వైద్యపరికరాలు మూలకు చేరుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయో మెడికల్ ఇంజినీర్లు లేకపోవడంతో తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ చెన్నైకి చెందిన ’ఫైబర్ సింధూరి’ సంస్థకు ఆయా వైద్యపరికరాల వార్షిక మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కట్టబెట్టింది. వైద్య పరికరం వాస్తవ ధరపై 7 శాతం వార్షిక మెయింటెనెన్స్ చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఆస్పత్రులకు సరఫరా చేస్తున్న వైద్య పరికరాల్లో ఒక్కో పరికరం ఒక్కో కంపెనీ నుంచి కొనుగోలు చేయడం, ఆయా కంపెనీల ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానంపై ఫైబర్ సింధూరి ఇంజనీరింగ్ టెక్నాలజీ సంస్థకు అవగాహన లేక పోవడంతో రోగులు ఇబ్బంది పడాల్సి వస్తుంది.