వెంటిలేటర్ వినియోగంపై అవగాహన పెరగాలి
వెంటిలేటర్ వినియోగంపై అవగాహన పెరగాలి
Published Fri, Sep 16 2016 9:41 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
కర్నూలు(హాస్పిటల్): రోగులకు కృత్రిమ శ్వాసను అందించే వెంటిలేటర్ వినియోగంపై ప్రతి ఒక్క వైద్యుడు అవగాహన పెంచుకోవాలని ఇండియన్ సొసైటీ ఆఫ్ అనెస్తీషియాలజిస్ట్స్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఏఎస్ కామేశ్వరరావు చెప్పారు. మత్తు మందు వైద్యుల రాష్ట్రసదస్సును పురస్కరించుకుని శుక్రవారం కర్నూలు మెడికల్ కాలేజిలో పలు వర్క్‌షాప్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా మెకానికల్ వెంటిలేషన్ అంశంపై డాక్టర్ ఏఎస్ కామేశ్వరరావు మాట్లాడుతూ పాయిజన్, గుండెపోటు, నరాల జబ్బుల్లో గాలిపీల్చుకోలేని స్థితిలో రోగి ఉన్నప్పుడు వెంటిలేటర్లు ఎలా వాడాలనే అంశంపై వివరించారు. గుండె ఆగిపోయినప్పుడు రీస్టార్ట్ చేసే పద్ధతుల గురించి వైద్యులు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. పీజీ విద్యార్థులు ఇలాంటి వర్క్‌షాప్‌లను సద్వినియోగం చేసుకుని సబ్జక్టులు నేర్చుకుని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రాంప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె. వీరాస్వామి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి అనెస్తీషియా వైద్యుల సదస్సు కర్నూలులో జరగడం గర్వకారణమన్నారు. వర్క్‌షాప్‌లు పీజీ విద్యార్థులు, అనెస్తెటిస్ట్‌లకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. కార్యక్రమంలో కర్ణాటక మాజీ డీఎంఈ డాక్టర్ హర్సూర్, ఇండియన్ సొసైటీ ఆఫ్ అనెస్తీషియాలజిస్ట్స్ జాతీయ మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఎస్‌ఎస్‌సి చక్రారావు, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కైలాష్‌నాథ్‌రెడ్డి, కార్యక్రమ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఎం.ఉమామహేశ్వర్, కార్యదర్శి డాక్టర్ శాంతిరాజు, కోశాధికారి డాక్టర్ డివి రామశివనాయక్, సైంటిఫిక్ చైర్మన్ డాక్టర్ దమామ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement