Venu Gopala Chari
-
‘కిషన్ రెడ్డి వ్యాఖ్యలు బాధాకరం’
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లిలోని తెలంగాణ భవన్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్రుడు, మందాజగన్నాదం, తెలంగాణ భవన్ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి జెండా ఎగురవేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తుందన్నారు. కిషన్ రెడ్డి హైదరాబాద్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులకు హైదరాబాద్ అడ్డాగా మారిందన్న వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. గత ఐదేళ్లలో ఒక్క మత కలహాల ఘటన జరగలేదని గుర్తు చేశారు. కిషన్ రెడ్డి ఇలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. మతసామరస్యాన్ని కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని కేంద్రమంత్రి అయిన కిషన్ రెడ్డి బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు. తెలంగాణ ప్రజలను బాధపెట్టే ఇలాంటి ప్రకటనలు చేయకూడదని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న పధకాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రత్యేక ప్రతినిధులు సందర్శించారు. -
బ్రిక్స్ సదస్సులో తెలంగాణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
ఢిల్లీ: బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సదస్సుకు దాదాపు 20 దేశాలల నుంచి ప్రతినిథులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, పారిశ్రిమిక రంగంలో తీసుకువచ్చిన టీఎస్ ఐపాస్, రైతు బంధు పథకం గురించి ప్రత్యేక ప్రతినిథి వేణుగోపాలచారి వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరామని, 24 గంటల విద్యుత్, నీరు, మౌళిక సదుపాయాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న కృషిని వారు స్వాగతించారని తెలిపారు. బ్రిక్స్ సమావేశంలో దాదాపు 45 నిమిషాల పాటు తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వేణుగోపాల చారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ప్రభుత్య సిబ్బంది, ఉద్యోగులకు ప్రత్యేకంగా క్రీడలను నిర్వహిస్తున్నామని, తెలంగాణ బజారును ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ ఆట, పాట ప్రత్యేక ఆకర్షణగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. -
ఏపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది
విద్యుత్ అంశంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు విద్యుత్‌తోపాటు హైకోర్టు విభజన, ఐటీ హబ్‌పై కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు సాక్షి, న్యూఢిల్లీ: పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రకారం తమకు రావాల్సిన విద్యుత్ కేటాయింపుల విషయంలో... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రభుత్వం మరోమారు కేంద్రం దృష్టికి తెచ్చింది. దీనిపై ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ వివాదాలపై పరిష్కారానికి నియమించిన నీరజా మాథుర్ కమిటీకి సైతం త్వరగా నివేదికను సమర్పించాలని విజ్ఞప్తి చేసింది. మంగళవారం ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు డా.వేణుగోపాలాచారి, తేజావత్ రామచంద్రు, టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ తదితరులు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ, ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌తో పాటు కేంద్ర విద్యుత్‌శాఖ కార్యదర్శి, నీరజా మాథుర్ కమిటీతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి అంశాల వారీగా వినతిపత్రాలు సమర్పించారు. అనంతరం తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో పంటలు ఎండిపోతున్నా విభజన చట్టంలో పేర్కొన్న వాటా ప్రకారం విద్యుత్ పంపిణీ చేయకుండా.. ఏపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి ఎస్కే సిన్హాకు ఫిర్యాదు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. పీపీఏలను రద్దు చేయడంతోపాటు కృష్ణపట్నం ప్లాంట్ నుంచి తెలంగాణకు విద్యుత్ రాకుండా ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుకుంటున్నారని, తెలంగాణ రైతులకు కేసీఆర్‌పై వ్యతిరే కత తెచ్చేందుకే ఇలా చేస్తున్నారని ఆయన దృష్టికి తెచ్చామని వారు పేర్కొన్నారు. తర్వాత నీరజా మాథుర్‌ను కలసి త్వరగా నివేదిక ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. ఈ నివేదిక వస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రతి అంశంలో ఏదోఒకటి అడ్డు చెబుతూ మాథుర్ కమిటీ నివేదిక రాకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని ప్రభుత్వ ప్రతినిధి తేజావత్ రామచంద్రు ఆరోపించారు. నివేదిక ఇవ్వడానికి డిసెంబర్ 30 వరకు సమయం ఉందని, త్వరలోనే రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని నీరజామాథుర్ చెప్పినట్టు వెల్లడించారు. అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు అంశాన్ని త్వరగా తేల్చాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడకు విజ్ఞప్తి చేసినట్టు ఎంపీ వినోద్‌కుమార్ తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడతానని.. పది రోజుల్లో చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. ఇక హైదరాబాద్ పరిసరాల్లో ఎలక్ట్రానిక్ క్లస్టర్ల ఏర్పాటు అంశాలను కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ దృష్టికి తెచ్చామని తెలిపారు.