మెడికల్ షాపుల బంద్ విజయవంతం
35 వేల దుకాణాల్లో నిలిచిపోయిన విక్రయాలు
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో మందుల విక్రయాలకు అనుమతి ఇవ్వొద్దని, ఆ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన బంద్ రాష్ట్రంలో విజయవంతమైంది. దాదాపు 35 వేల మెడికల్ షాపులు బంద్‌లో పాల్గొన్నాయని రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధి వేణుగోపాల్‌శర్మ తెలిపారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల అనుబంధ మెడికల్ షాపులు, కొన్ని చైన్ షాపులు మాత్రం తెరిచే ఉన్నాయని చెప్పారు. బంద్ వల్ల పలుచోట్ల రోగులు అవస్థలు పడ్డారు.
కొన్నిచోట్ల మాత్రం అత్యవసర మందులను విక్రయించినట్లు దుకాణదారులు తెలిపారు. రాష్ట్రంలో మెడికల్ షాపులపై ఆధారపడి 2 లక్షల మంది దాకా జీవిస్తున్నారు. బంద్ వల్ల రాష్ట్రంలో వందల కోట్ల రూపాయల వ్యాపారానికి నష్టం వాటిల్లింది. ఆన్లైన్ విక్రయాల వల్ల యువతీ యువకులు నిద్ర మాత్రలు, మత్తు మందులను కొనుగోలు చేస్తున్నందున ఆ విధానాన్ని రద్దు చేయాలని మెడికల్ షాపుల యజమానులు డిమాండ్ చేస్తున్నారు.