వర్సిటీల సమస్యలపై పోరాడాలి
ఎస్ఎఫ్ఐ విద్యార్థుల సమ్మేళనంలో ఎమ్మెల్సీ రాము
బాలాజీచెరువు (కాకినాడ):
రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలలో నెలకొన్న సమస్యలతో పాటు అధ్యాపకుల సమస్యలపైనా ఎస్ఎఫ్ఐ పోరాడాలని ఉభయ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యుడు రాము సూర్యారావు పేర్కొన్నారు. జేఎన్టీయూకేలో శనివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన ఆల్ యూనివర్సిటీ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ అధ్యాపకుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించకపోతే విద్యావ్యవస్థకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్నారు. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టులు భర్తీ చేసి విద్యారంగాన్ని కాపాడాలన్నారు. ‘పోరాడు, సా«ధించు’ నినాదంతో ఎస్ఎఫ్ఐ పని చేస్తుందని, అదే సిద్ధాంతంతో సమాజాన్ని సక్రమమైన మార్గంలో నడిపే విద్యాలయాలపై ప్రభుత్వం దృష్టి సారించేలా ఆ సంస్థ పోరాడాలని అన్నారు.
సర్కారు తీరును చాటిన ఆర్థికమంత్రి
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు వై.రామం మాట్లాడుతూ యూనివర్సిటీల అభివృద్ధికి పైసా కూడా కేటాయించమని, వాటి అభివృద్ధికి వర్సిటీలే వనరులు సమకూర్చుకోవాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఉపకులపతుల సమావేశంలో చెప్పడంతోనే విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వం అవలంబిస్తున్న ధోరణి అర్థమౌతుందన్నారు. జేఎన్టీయూకే చీఫ్ లైబ్రేరియన్ వి.దొరస్వామినాయక్ మాట్లాడుతూ సమాజంలో కీలకపాత్ర పోషించే యూనివర్సిటీల అభివృద్ధికి సహకారమివ్వక పోవడంపై చాలా దురదృష్టకరమని, దీనిపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని అన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి వంటి పథకాలకు కోట్లకు కోట్లు ఖర్చుచేసి, యూనివర్సిటీలను గాలికొదిలేయడం బాధాకరమన్నారు. ఆ పథకాలకు వర్సిటీ అధ్యాపకులను భాగస్వామ్యం చేయాలన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ పోరాడితే సాధించలేనిది ఏమీ లేదన్నారు. విద్యారంగ సమస్యలపై పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక సభ్యులు చలసాని శ్రీనివాస్, రెడ్డి, ఎస్ఎఫ్ఐ సభ్యులు పాల్గొన్నారు.