v.gangadhar goud
-
సమగ్ర కుటుంబ సర్వేపై ప్రజల్లో ఆందోళన
డిచ్పల్లి : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వే పై ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయని, సర్వేను కేవలం ఒక రోజే నిర్వహించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయని ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వి.గంగాధర్‌గౌడ్ (వీజీగౌడ్) అన్నారు. బుధవారం డిచ్‌పల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సర్వేపై ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో వేలాది మంది తెలంగాణ ప్రజలు బతుకు దెరువు కోసం వలస వెళ్లారని, వారంతా ఇప్పుడు రాష్ట్రానికి రావడానికి ఇబ్బం దులు పడుతున్నారని అన్నారు. సర్వే ఫార్మాట్లో 96 కాలమ్స్ ఉన్నాయని ఇవన్నీ పూర్తి చేయాలంటే కనీసం 45 నిమిషాలు పడుతుందన్నారు. అలాగే గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి వివరాలు సర్వేలో తీసుకోవద్దని సూచించడం సమంజసం కాదన్నారు. గల్ఫ్ బాధితుల అంశం చేర్చాలని కోరారు. ప్రజల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని సర్వేను వారం రోజుల పాటు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో సుమారు 600 గిరిజన తండాలు ఉన్నాయని, జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని అన్నారు. గతంలో డి చ్‌పల్లి మండలం ఇందల్వాయి వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిపై ట్రామా కేర్ సెంటర్ మంజూరు కాగా దానిని జిల్లా కేంద్రానికి తరలించారని అన్నారు. జాతీయ రహదారిపై ప్రయాణికులు తరచూ ప్రమాదాలకు గురువుతుంటారని వెంటనే ఇందల్వాయి వద్ద ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో విండో చైర్మన్ పూర్యానాయక్, టీడీపీ మండల అధ్యక్షుడు నందుబాబు, నాయకులు పూర్యానాయక్, కుంట నర్సారెడ్డి, విఠల్ రాథోడ్, అబ్బులు తదితరులు పాల్గొన్నారు. -
ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకోవాలి
టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్ ఇందూరు, న్యూస్‌లైన్ : ఈ నెల 2వ తేదీన భారత దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడనున్న తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావ వేడుకలను జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వి. గంగాధర్ గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల తరువాత సంబరాలు ప్రారంభించాలని, తాము కూడా పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయాన్నే అన్ని గ్రామాల్లో, మండలాల్లో, నియోజక వర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ, జాతీయ జెండాలను ఎగురవేయాలన్నారు. అమరవీరులను స్మరించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వంగా కొనసాగే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కలలను నెరవేర్చాలన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, రైతాంగానికి రుణాల మాఫీ, రూ.3లక్షలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయంంతో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఉచిత విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు అవసరమైన * 45వేల కోట్లు తెప్పించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలిపిన నేపథ్యంలో, దాని సమస్యలను పరిష్కరించి ఇరు ప్రాంతాల వారికి న్యాయం చేయాలన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షుడు రత్నాకర్‌గౌడ్, రాజమల్లు, కొత్త రాజు తదితరులున్నారు. -
2019లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం
కామారెడ్డిటౌన్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రంలో 2019లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్ జోస్యం చెప్పారు. మంగళవారం పట్టణంలోని అయ్యప్ప కల్యాణ మండపంలో నిర్వహించిన డివిజన్ విసృ్తతస్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ ఓడిపోవడం బాధకరమైన విషయమన్నారు. ప్రజాభిప్రాయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కేవలం తెలంగాణ నినాదం, ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మాత్రమే టీఆర్ఎస్కు ప్రజలు పట్టం కట్టారని అ న్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కూడా చిత్తుగా ఓడించారని అన్నారు. టీడీపీపై ప్రజలకు వ్యతిరేకత లేదని ఇంకా అభిమానిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఇచ్చి న హామీలు నెరవేరిస్తే తాము స్వాగతిస్తామని అన్నారు. పదవి లేకున్నా ప్రజా సమస్యలపై పోరాడుతాం పదవులు లేకున్నా ప్రజా సమస్యలపై పోరాడతామని జహీరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి మదన్మోహన్రావు అన్నారు. ప్రజలందరూ ఒక్కసారి అవకాశమివ్వాలని, టీఆర్ఎస్ను గెలిపించుకున్నారని, ఇందుకోసం గుర్తుతెలియని వ్యక్తిని కూడా నిలబెడితే జహీరాబాద్ ఎంపీగా గెలుపొందిన వ్యక్తి నిదర్శమని అన్నారు. కేసీఆర్ వాగ్దానాలేమిటో రెండేళ్లలో తెలుస్తుందన్నారు. జూన్ 2 తర్వాత కరెంటు కష్టాలు మొదలవుతాయని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు, నరేంద్రమోడీ సహకారంతో జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పించడమే తన లక్ష్యమని ఆయన అన్నారు. 23న పార్టీ జిల్లా సర్వసభ్య సమావేశం డిచ్పల్లి : టీడీపీ జిల్లా సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 23న జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు వీజీగౌడ్ తెలిపారు. మంగళవారం డిచ్పల్లి మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వసభ్య సమావేశానికి జిల్లా కార్యవర్గ సభ్యులు, నగర, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, జడ్పీటీసీ మాజీ సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ ఎంపీపీ అధ్యక్షులు తదితరులు హాజరు కావాలని సూచించారు. ఈ నెల 27, 28వ తేదీల్లో నిర్వహించనున్న మహానాడులో చర్చించాల్సిన అంశాలు, ఇటీవల ముగిసిన స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై విశ్లేషించ నున్నట్లు తెలిపారు. 28న ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు వీజీగౌడ్ సూచించారు.