ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకోవాలి
టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్
ఇందూరు, న్యూస్‌లైన్ : ఈ నెల 2వ తేదీన భారత దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడనున్న తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావ వేడుకలను జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వి. గంగాధర్ గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల తరువాత సంబరాలు ప్రారంభించాలని, తాము కూడా పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయాన్నే అన్ని గ్రామాల్లో, మండలాల్లో, నియోజక వర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ, జాతీయ జెండాలను ఎగురవేయాలన్నారు. అమరవీరులను స్మరించుకోవాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వంగా కొనసాగే టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కలలను నెరవేర్చాలన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, రైతాంగానికి రుణాల మాఫీ, రూ.3లక్షలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయంంతో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఉచిత విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు అవసరమైన * 45వేల కోట్లు తెప్పించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలిపిన నేపథ్యంలో, దాని సమస్యలను పరిష్కరించి ఇరు ప్రాంతాల వారికి న్యాయం చేయాలన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షుడు రత్నాకర్‌గౌడ్, రాజమల్లు, కొత్త రాజు తదితరులున్నారు.