శుభ స్వప్నోదయం
గుండె గుండెనా ఉద్వేగం... ఊరూ వాడా ఉద్విగ్నం.. అణువణువూ పులకరింత... స్వరాష్ట్ర కాంక్షతో జ్వలించిన హృదయం... ‘నవజాత తెలంగాణ’ను గుండెకు హత్తుకున్న సందర్భం... అర్ధరాత్రి నవోదయాన్ని స్వప్నిస్తూ... కోటి ఆశలతో కొత్త రాష్ట్రంలో అడుగిడుతూ... పాలమూరు పరవశించింది... ఉద్యమ ప్రస్థానాన్ని నెమరువేసుకుంటూ... బలిదానాలతో అమరులైనవారికి గీతాలాపన చేసి స్మరించుకుంటూ... ‘మన రాష్ట్రం... మన పాలన’లో... బంగారు భవిష్యత్తును కాంక్షిస్తూ.. ఉప్పొంగిపోయింది. - సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన వేళ మహబూబ్‌నగర్ జిల్లాలో వేడుకలు అంబరాన్నంటాయి. ఆదివారం ఉదయం నుంచే జిల్లా అంతటా పండుగ వాతావరణం కనిపించింది. జిల్లాలోని ప్రభుత్వ భవనాలు, ముఖ్య కూడళ్లు, చారిత్రక ప్రదేశాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా టీఆర్‌ఎస్ పార్టీ పతాకాలతో అలంకరించడంతో వీధులు, ముఖ్య కూడళ్లు గులాబీమయమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్య కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి.
టీఆర్‌ఎస్, తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో పలు చోట్ల ‘ధూం.. ధాం’ నిర్వహించారు. కళాకారులు తెలంగాణ ఆట పాటలతో తెల్లవారు ఝాము వరకూ హోరెత్తించారు. జిల్లా కేంద్రం మహబూబ్‌నగర్‌లోని జిల్లా పరిషత్ మైదానంలో తెలంగాణ ఆవిర్భావ సంబురాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సెలవులో ఉండటంతో ఇంచార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న జేసీ శర్మన్ సంబురాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు టీజేఏసీ భాగస్వామ్య సంఘాలు, జన సామాన్యం సంబురాల్లో పాల్గొంది. జిల్లా వ్యాప్తంగా అర్దరాత్రి దాటిన వెంటనే అమర వీరుల స్థూపాలకు నివాళి అర్పిస్తూ, బాణసంచా పేల్చి సంబురాలకు శ్రీకారం చుట్టారు. పార్టీలు, సంఘాలకు అతీతంగా వీధుల్లోకి వచ్చి జాతీయ పతాకాలతో సందడి చేశారు.
టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో పలు చోట్ల రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రం మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్లాక్‌టవర్ వద్ద బాణసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఉద్యమ ప్రస్తానంలో తమ పాత్రను నెమరు వేసుకుంటూ సంబురాల్లో మునిగి తేలారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా సెల్‌ఫోన్లలో శుభాకాంక్షలతో కూడిన సందేశాలు వెల్లువెత్తాయి. కలెక్టరేట్‌తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుద్దీప కాంతుల్లో మెరిసిపోయాయి. కార్యాలయాల బోర్డులను కూడా కొత్త ప్రభుత్వం పేరిట ఏర్పాటు చేశారు.
నేడు అవతరణ దినోత్సవం
రాష్ట్ర అవతరణ సందర్భంగా కలెక్టర్ గిరిజా శంకర్ సోమవారం ఉదయం 8.45కు పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. పతాకావిష్కరణకు ముందే అమరవీరుల స్తూపానికి నివాళి అర్పిస్తారు. అవతరణ వేడుకల సందర్భంగా కలెక్టర్ సందేశంతో పాటు, వివిధ పథకాల కింద ఎంపిక చేసిన లబ్దిదారులకు ఆస్తులు పంపిణీ చేస్తారు. అధికార పార్టీగా ఆవిర్భవిస్తున్న టీఆర్‌ఎస్ సోమవారం సాయంత్రం ఆరు గంటలకు మహబూబ్‌నగర్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఎంపీ జితేందర్‌రెడ్డితో పాటు పార్టీకి చెందిన ఏడుగురు శాసనసభ్యులు, ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బీజేపీ, వైఎస్సార్‌సీపీ ఇతర రాజకీయ పార్టీలు కూడా సోమవారం ఉదయం తమ పార్టీ కార్యాలయాల వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నాయి. తెలంగాణ సంబురాల్లో భాగస్వాములు కావాలంటూ అన్ని రాజకీయ పక్షాలు పిలుపునిచ్చాయి.