తెలంగాణోదయం
నిశీధిని చీల్చుతూ వెలుగులు విరజిమ్ముతున్న బాణాసంచా సాక్షిగా... అరవైఏళ్ల పోరాట స్ఫూర్తిగా... స్వరాష్ట్ర పోరాటంలో అమరులైన వీరుల ఆత్మత్యాగాలకు గుర్తుగా తెలంగాణ రాష్ట్రం సాక్షాత్కరించింది. రాష్ట్ర ఆవిర్భావానికి స్వాగతం పలుకుతూ ఊరూవాడా సంబరాల్లో మునిగిపోయింది. కాగడాల ప్రదర్శనలు, కొవ్వొత్తుల ర్యాలీలు, ధూంధాంలతో హోరెత్తింది. - సాక్షి, కరీంనగర్
సాక్షి, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం పలుకుతూ జిల్లా ప్రజలు ఆదివారం సాయంత్రం నుంచే సంబరాలు చేసుకున్నారు. రాజకీయ పార్టీలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు పోటీపడి సంబరాలు నిర్వహించాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు విద్యాసంస్థలు విద్యుత్ కాంతులతో మిరుమిట్లుగొల్పాయి. చిన్నా, పెద్దా.. పేద, ధనిక, కులమతాల తారతమ్యం లేకుండా అందరూ ఆదివారం రాత్రంతా సంబరాలతో జాగారం చేశారు.
కొత్త రాష్ట్రానికి స్వాగతం పలికారు. టపాసులు కాల్చి.. మిఠాయిలు పంచిపెట్టారు. తెలంగాణ ధూంధాంలు.. సాంస్కృతిక కార్యక్రమాలు.. కాగడాల ప్రదర్శనలు.. కొవ్వొత్తుల ర్యాలీలతో జిల్లాలో పండుగ వాతావరణం కన్పించింది. అమరవీరులకు నివాళులర్పించారు. అమరుల కుటుంబాలను సన్మానించుకున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులు సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఆటపాటలతో హోరెత్తించారు.
కలెక్టర్ ఎం. వీరబ్రహ్మయ్య, ఎంపీ వినోద్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, బొడిగె శోభ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు కరీంనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి, అమరవీరుల స్తూపానికి పూలమాలాంకరణ చేసి నివాళులర్పించారు. డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ, కాగడాల ప్రదర్శన నిర్వహించారు. బీజేపీ నగర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో నగరంలో టపాసులు కాల్చారు. సీపీఐ ఆధ్వర్యంలో మోటారుబైక్ ర్యాలీ తీసి.. అనభేరి ప్రభాకర్ విగ్రహానికి పూలమాల వేశారు. టీఎన్జీవోస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించి అమరవీరులకు నివాళులర్పించారు. టీ-జేఏసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.
పెద్దపల్లి పోలీస్‌స్టేషన్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి.. ఎస్పీ శివకుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల కుటుంబసభ్యులను సన్మానించారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
మంథనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి శ్రీధర్‌బాబు నాయకత్వంలో కార్యకర్తలు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. టీఆర్‌ఎస్ పార్టీ, మంథని ఎమ్మెల్యే పుట్ట మధు ఆధ్వర్యంలో రాత్రి 10 గంటల నుంచి 1 గంటవరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ పార్టీ ధూం ధాం నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ కాగడాల ప్రదర్శన నిర్వహించగా, అధికారులు ర్యాలీగా వెళ్లి అమరవీరులకు నివాళులర్పించారు. జమ్మికుంటలో టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ పాల్గొన్నారు.
గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధూంధాంలో పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నాయి. ఇల్లందు క్లబ్‌లో, సింగరేణి క్లబ్‌లో అధికారులు, మేడిపల్లి ఓపెన్‌కాస్టులో కార్మికులు కేక్ కట్ చేశారు. తెలంగాణ బొగ్గు గని కార్మికులు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
జగిత్యాలలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ శ్రేణులు కాగడాల ప్రదర్శన నిర్వహించి.. టపాసులు కాల్చారు. మిఠాయిలు తినిపించుకున్నారు.
దర్మపురిలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల ఆధ్వకర్యంలో టపాసులు కాల్చారు.
సిరిసిల్లలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ధూంధాం నిర్వహించారు. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో గాంధీచౌక్ వద్ద ఆటాపాటా నిర్వహించారు.
కోరుట్లలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు టపాసులు కాల్చారు.
సైదాపూర్‌లో పోలీసుల ఆధ్వర్యంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీ శ్రేణులు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.
హుస్నాబాద్‌లో టీ జేఏసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ, రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో ధూం ధాం నిర్వహించారు.