రాజధాని అక్కడొద్దు.. బాబుకు కమిటీ షాక్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి శివరామకృష్ణన్ కమిటీ గట్టి షాకే ఇచ్చింది. ఇన్నాళ్ల పాటు విజయవాడ-గుంటూరు, తెనాలి, మంగళగిరి పరిధి సముదాయమైన వీజీటీఎం ప్రాంతంలోనే రాజధాని నగరాన్ని ఏర్పాటు చేయాలని బాబు సర్కారు భావిస్తోంది. ఇందుకు తగ్గట్లే మంత్రులతో ప్రకటనలు చేయించింది కూడా.
అయితే రాష్ట్ర రాజధాని ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఈ ప్రతిపాదనను తన నివేదికలో పూర్తిగా వ్యతిరేకించింది. రాజధాని నిర్మాణం కోసం మొత్తం 10 వేల ఎకరాలు అవసరమని సూచించింది. వీజీటీఎం పరిధిలో ప్రస్తుతమున్నది 1458 ఎకరాలే అని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న భూముల ధరల ప్రకారం భూసేకరణ కూడా చాలా ఆర్థిక భారంతో కూడుకున్న పని అని చెప్పింది. పైగా భూసేకరణకు మూడు, నాలుగేళ్ల సమయం పడుతుందని వివరించింది. ఆర్థిక, సమయభావ కారణాల వల్ల... వీజీటీఎం రాజధాని ఏర్పాటుకు అనువైంది కాదని కమిటీ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.