వందలాది వయాగ్రా టాబ్లెట్లు కొన్న కొరియా అధ్యక్ష భవనం!
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్గ్వెన్హ్వే కార్యాలయం ఇటీవల 360 వయాగ్రా టాబ్లెట్లు కొనటం వివాదాస్పదంగా మారింది. వయాగ్రా కొనుగోలు విషయాన్ని ప్రతిపక్షానికి చెందిన ఒక ఎంపీ బయటపెట్టడంతో అధ్యక్ష కార్యాలయం అది నిజమేనని తాజాగా అంగీకరించింది.
డిసెంబర్లో ఈ టాబ్లెట్లను కొనుగోలు చేశామని చెప్పింది. ఎందుకంటే.. అధ్యక్షురాలు వచ్చే మే నెలలో ఇథియోపియా, ఉగాండా, కెన్యా పర్యటనలకు వెళ్తున్నారని.. ఆ ప్రాంతాలు సముద్ర మట్టంకన్నా ఒకటి, రెండు కిలోమీటర్ల ఎత్తులో ఉన్నందున అధ్యక్షురాలి సహాయక సిబ్బందికి ఎత్తుకు సంబంధించిన రుగ్మత (ఆల్టిట్యూడ్సిక్నెస్) తలెత్తితే దానిని నివారించటం కోసం కొనుగోలు చేసినట్లు వివరించింది. ఈ టాబ్లెట్లలో ఒక్కటీ కూడా వాడలేదని అధ్యక్ష భవనం బ్లూ హౌస్పేర్కొంది.
వయాగ్రా తరహా టాబ్లెట్లు ఆల్టిట్యూడ్సిక్నెస్ను నివారిస్తాయని నమ్ముతుండటం వల్ల.. పర్వతారోహకుల కోసం దక్షిణ కొరియా వైద్యులు వీటిని సిఫారసు చేస్తుంటారు. ఇదిలావుంటే.. అధ్యక్షురాలు పార్క్స్నేహితురాలు ఒకరు ప్రభుత్వ వ్యవహారాల్లో తలదూర్చి అక్రమంగా కోట్ల డాలర్ల ఆస్తులు సముపార్జించారన్న ఆరోపణలతో ఆమెపై అభిశంసనకు ప్రతిపక్షంతో పాటు సొంత పార్టీ సభ్యులు కూడా కొందరు సిద్ధమవుతున్నారు.