viakarabad
-
కమలంలో ముసలం.. పార్టీలో గ్రూపు రాజకీయాలు
సాక్షి, వికారాబాద్: బీజేపీలో గ్రూపు రాజకీయాలకు తెరలేచింది. జిల్లా నాయకత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ నేతల నుంచి తరచూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. సదానంద్‌రెడ్డి పార్టీ జిల్లా పగ్గాలు చేపట్టి ఏడాదిన్నర పూర్తయినా.. ఇప్పటికీ క్యాడర్‌పై పట్టు సాధించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్య సఖ్యత కొరవడింది. ఈక్రమంలో జిల్లా అధ్యక్షుడినే మార్చాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ విషయాన్ని కొంతమంది నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. బీజేపీకి వెన్నెముక అయిన సంఘ్ పరివార్.. ప్రస్తుత అధ్యక్షుడి పనితీరుపై అసంతృప్తిగా తెలుస్తోంది. ఆయన స్థానంలో తాండూరుకు చెందిన ఓ నాయకుడికి అవకాశం ఇస్తారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. చదవండి: సీఎం భగవంత్ మాన్ మరొకటి.. చండీగఢ్ పంజాబ్‌కే సొంతం కార్యకర్తల్లో అసంతృప్తి బీజేపీ జిల్లా నేతల పనితీరుపై కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్నట్లు కనిపిస్తోంది. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో యువ నాయకత్వం, ఏబీవీపీ, కిందిస్థాయి నాయకులు చురుగ్గా పాల్గొంటుండగా, ముఖ్య నేతలుగా చెప్పుకొంటున్న వారు మాత్రం ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వికారాబాద్ మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా ఉన్న సదానంద్‌రెడ్డి సతీమణి.. ఇప్పటి వరకు అధికార పార్టీ పనితీరును ఎండగడుతూ బీజేపీ పక్షాన వాయిస్ వినిపించలేకపోతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో జరుగుతున్న పార్టీ కార్యకర్తల సమావేశాలకు జిల్లా ముఖ్య నేతలు మొహం చాటేయటం కూడా విమర్శలకు తావిస్తోంది. పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి జనార్దన్‌రెడ్డి సైతం కొంత కాలంగా జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అతనికి జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేతతో పొసగకపోవటమే ఇందుకు కారణమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. చదవండి: హైడ్రామా.. కాంగ్రెస్ కొంప ముంచిన ఎమ్మెల్యేలు జిల్లా నేతలు విఫలం ఇటీవలే నాలుగు రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ మంచి ఊపుమీద కనిపిస్తోంది. రాష్ట్ర నాయకత్వం కూడా ఈ స్పీడ్‌ను కొనసాగించాలని భావిస్తోంది. దక్షణాదిలో సైతం పట్టుసాధించాలంటే తెలంగాణపై ఫోకస్ పెట్టాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. ఇందుకోసం క్షేత్రస్థాయి నుంచి బీజేపీ బలోపేతానికి కంకణం కట్టుకుంది. దుబ్బాక ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్పై బీజేపీ గెలుపు.. ఆ వెంటనే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నలభైకిపైగా కార్పొరేట్ స్థానాల కైవసం, ఆ తర్వాత కొద్ది రోజులకే హుజూరాబాద్‌లో ఈటల విజయం, ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలను రాబట్టిన పార్టీ మంచి ఊపుమీదుంది. మంత్రిగా, సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన ఎ.చంద్రశేఖర్ బీజేపీలో కొనసాగుతుండటం స్థానిక నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఆయన పార్టీకి పెద్ద దిక్కుగా మారుతారని అంతా భావించారు. కానీ పార్టీ కార్యక్రమాల్లో ఏసీఆర్ పెద్దగా పాల్గొనకపోవడం కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. -
రెవెన్యూలో ఫోర్జరీ కలకలం
వికారాబాద్: ఓ ఫోర్జరీ కేసు రెవెన్యూ శాఖలో కలకలం రేపుతోంది. వికారాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఈ ఘటన బుధవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. బూర్గుపల్లి వద్ద సర్వే నంబర్ 18లో హైదరాబాద్‌కు చెందిన ఇంతియాజ్‌కు 7.12 ఎకరాల పొలం ఉంది. ఈ భూమిని ఆయన ఖలీల్ అనే వ్యక్తికి విక్రయించినట్లు కొందరు రియల్టర్లు, బ్రోకర్లు ఆర్డర్ కాపీ తయారు చేయించారు. గతంలో వికారాబాద్‌లో పనిచేసి వెళ్లిన తహసీల్దార్ అప్పలనాయుడు ఈ ఆర్డర్ ఇచ్చినట్లు ఫోర్జరీ కాపీ సృష్టించారు. తహసీల్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తించే మజ్జు అనే ఉద్యోగికి వారు ఈ కాపీ అందజేశారు. ఆరు నెలల క్రితం తహసీల్దార్ రవీందర్ కళ్లుగప్పి ధరణి వెబ్సైట్లో అప్లోడ్ చేయించారు. బాధితుడి ఫిర్యాదుతో.. ఆధార్ సీడింగ్‌లో తన పేరు మారడాన్ని గమనించిన బాధితుడు ఇంతియాజ్, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ విషయంలో విచారణ చేపట్టాలని కలెక్టర్, తహసీల్దార్ రవీందర్‌ను ఆదేశించటంతో ఆయన పాత ఫైళ్లను పరిశీలించారు. అందులో గత తహసీల్దార్ ఆర్డర్ జారీ చేసినట్లు లేకపోవడంతో ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. తన కళ్లుగప్పి కంప్యూటర్ ఆపరేటర్లు భూమిని వేరే వ్యక్తుల పేర్లమీదకు మార్చారని తహశీల్దార్ రవీందర్ నిర్ధారణకు వచ్చారు. నెలరోజుల క్రితం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన వికారాబాద్ పోలీసులు ఈ వ్యవహారంలో కంప్యూటర్ ఆపరేటర్లు మజ్జు, పరశురాం, రెవెన్యూ కార్యాలయ ఉద్యోగి రవి, బ్రోకర్ రాజు ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. గత శనివారం మజ్జు, రవి, పరశురాంలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ భూమి విలువ రూ.4 కోట్ల వరకు ఉంటుందని, అక్రమ రిజి్రస్టేషన్ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారాయని తెలుస్తోంది. గతంలో కూడా వికారాబాద్‌లో తహసీల్దార్‌కు తెలియకుండా ఆర్డర్ కాపీ అప్లోడ్ చేసిన విషయంపై మరో కేసు నమోదైనట్లు సమాచారం. ఈ విషయంపై ఆర్డీఓ వెంకట ఉపేందర్‌రెడ్డిని వివరణ కోరగా తహసీల్దార్‌కు తెలియకుండా పట్టామారి్పడి జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పోలీసుల విచారణలో కూడా కంప్యూటర్ ఆపరేటర్లు తప్పు చేసినట్లుగా తేలటంతో వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించామని తెలిపారు. కాగా, బ్రోకర్ రాజు పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకుంటే దీనివెనక ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. -
తెలంగాణలో సుగ్న మెటల్స్ రెండో ప్లాంట్ ఏర్పాటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉక్కు తయారీ కంపెనీ సుగ్న మెటల్స్ తెలంగాణ వికారాబాద్‌లోని పరిగిలో రెండో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. మార్చి నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే ప్రాంతంలో సుగ్న 2008లో తొలి ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. టర్బో టీఎంటీ రాడ్లతో పాటూ ఉక్కు తయారీలో వినియోగించే బిల్లెట్లు, స్పాంజ్ ఐరన్ వంటివి కూడా ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నారు. ఉక్కు తయారీ, పటిష్టతను వివరించేందుకు వివిధ విభాగాల్లోని ఇంజనీర్లతో కలిసి సుగ్న మెటల్స్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) నితిన్ జైన్, ప్లాంట్ ఇంచార్జీ అజయ్ కుమార్ తదితరులు ప్లాంట్‌ను సందర్శించారు. -
వికారాబాద్‌లో పత్తిరైతు ఆత్మహత్య
-
పత్తిరైతు ఆత్మహత్య
వికారాబాద్: అప్పుల బాధ తాళలేక పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ జిల్లా సీలారం గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన నర్సింహులు(38) తనకున్న ఎకరాన్నర భూమితో పాటు మరో ఆరెకరాలు కౌలుకు తీసుకొని పత్తిపంట సాగుచేస్తున్నాడు. ఈక్రమంలో గత రెండేళ్లుగా పంట దిగుబడి సరిగ్గా లేకపోవడంతో.. అప్పుల బాధ పెరిగిపోయి గురువారం రాత్రి కుటుంబ సభ్యులంతా నిద్రిస్తున్న సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఖజానాకు గండి
20 ఏళ్లుగా అవే అద్దెలు మూడేళ్లకోసారి పెంచాలన్న నిబంధనలు బుట్టదాఖలు పట్టించుకోని పాలకవర్గం, అధికార యంత్రాంగం రూ.లక్షల్లో పేరుకుపోయిన బకాయిలు వికారాబాద్ మున్సిపాలిటీలో మారని తీరు ప్రైవేట్ భవనాలను అద్దెకిచ్చినప్పుడు సదరు యజమాని ఏటా ఎంతో కొంత అద్దెను పెంచడం షరా మామూలే. ప్రభుత్వ భవనాల విషయానికి వస్తే మాత్రం ఏళ్ల తరబడి పాత అద్దెలతోనే కొనసాగుతున్నాయి. అడిగేవారు లేకపోవడం, ప్రభుత్వ ఆస్తి కదా అన్న నిర్లిప్త వైఖరితో మున్సిపల్ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. వికారాబాద్ మున్సిపల్ ఖజానాకు కోట్లలో రావాల్సి ఉండగా లక్షల్లో కూడా రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వికారాబాద్ : వికారాబాద్ మున్సిపల్ కాంప్లెక్స్ దుకాణాలను విడతల వారిగా 1996లో అప్పుడు మున్సిపల్ చైర్మన్ గా ఉన్న ఇప్పటి ఎమ్మెల్యే సంజీవరావు హయాంలో నిర్మించారు. పురపాలక సంఘానికి సంబంధించి పట్టణంలో మొత్తం 103 దుకాణాల వరకు ఉన్నాయి. డీసీఎంఎస్ ఎదురుగా బస్టాండ్‌కు వెళ్లే దారిలో 44 ఉండగా కూరగాయల మార్కెట్ స్థలంలో మిగతా దుకాణాలున్నాయి. వీటి అద్దెలను అప్పట్లో రూ.600 నుంచి రూ.2,848 వరకు నిర్ణయించారు. మున్సిపల్ అధికారులు కొన్ని దుకాణాలకు మాత్రమే రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు అడ్వాన్స్ గా తీసుకున్నారు. మున్సిపల్ గెజిట్‌లో ప్రతి మూడేళ్లకోసారి అద్దెలను పెంచాలన్న నిబంధన ఉన్నా యంత్రాంగం అమలు చేసిన దాఖలాలు లేవు. అప్పట్లో నిర్ణయించిన అద్దెలనే నేటికీ కొనసాగిస్తున్నారు. పెండింగ్‌లో అద్దెలు.. పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయానికి సంబంధించిన దుకాణాల అద్దెలు ఒక్కో దానికి రూ.10 వేల నుంచి రూ.23 వేల వరకు ఉంటే మున్సిపల్‌కు చెందిన దుకణాల అద్దెలు మాత్రం రూ.3వేలు మించడం లేదు. ఈ అద్దెను సైతం మున్సిపల్ అధికారులు నెలనెలా సక్రమంగా వసూలు చేయకపోవడంతో సుమారు రూ.18 లక్షల వరకు మున్సిపల్ కార్యాలయానికి రావాల్సిన అద్దెలు పెండింగ్‌లో పడిపోయాయి. ఈ విషయంలో ఇటు పాలకపక్షం కాని, అటు అధికారయంత్రాంగం కానీ స్పందించకపోవడంపై స్థానికంగా విమర్శలు ఉన్నాయి. ఒక్కో దుకాణానికి కనీసం రూ.6 వేలు అద్దె నిర్ణయించినా 103 దుకాణాలకు సంబంధించి నెలకు సుమారు రూ.6లక్షలకు పైగా మున్సిపల్‌కు రాబడి వచ్చేది. ఏడాదికి రూ.74లక్షల పైచిలుకు ఖజానాకు చేరేదని అంటున్నారు. మంజీరా వాటర్, కరెంట్ బిల్లులు చెల్లించడానికే నానా అవస్థలు పడుతున్న పాలకపక్షం, అధికారయంత్రాంగం ఈ విషయంలో ఎందుకు దృష్టి సారించడం లేదోనని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా స్పందించి వెంటనే ప్రభుత్వ దుకాణాల అద్దెను నిర్ణయించి బహిరంగ వేలం (ఓపెన్ యాక్షన్) ద్వారా కేటాయించాలని కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం: ఎంకేఐ అలీ, మున్సిపల్ కమిషనర్ కొంతమంది దుకాణాల నిర్వాహకులు కొన్నేళ్లుగా అద్దె చెల్లించడం లేదనే విషయం మా దృష్టికి కూడా వచ్చింది. సాధ్యమైనంత త్వరగా పాత అద్దెలను రద్దు చేసి బహిరంగ వేలం నిర్వహించి అద్దెలను సవరిస్తాం. బకాయి పడ్డ అద్దెలను సంబంధిత దుకాణాల నిర్వాహకుల నుంచి వసూలు చేయడానికి త్వరలో నోటీసులు జారీ చేస్తాం. చెల్లించకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.