ఇదిగో... దీన్ని కూడా కాస్త సర్దుతావా!
భారత ఆటగాళ్లు ఎప్పుడైనా ఇలా సూట్కేసులు మోయడం చూశారా..! విమానాశ్రయమైనా, హోటల్ అయినా ఎలాంటి లగేజీ బాధ్యతలు లేకుండా వారంతా చెవులకు హెడ్ఫోన్తో దర్జాగా నడుచుకుంటూ వెళ్లిపోయే దృశ్యాలే మన కళ్ల ముందు కదులుతాయి. కానీ ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాత్రం భారత్లో దిగీ దిగగానే ఇలా సూట్కేసులు సర్దే పనిలోకి దిగిపోయారు. ఆటపరంగా అగ్రశ్రేణి జట్టు, వ్యక్తిగతంగా స్టార్ హోదా ఉన్నా సరే, వారంతా దీనిని పెద్దగా పట్టించుకోలేదు.
‘శ్రమైక జీవన సౌందర్యం’ అంటూ కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ వార్నర్ ఇలా డీసీఎం వ్యాన్లోకి తమ బ్యాగేజీ తరలించడం చూసేవారందరికీ ఆశ్చర్యం కలిగించింది. ‘ఇదేమీ మాకు నామోషీగా అనిపించడం లేదు. ఇదంతా టీమ్ వర్క్లాంటిది. ఇంకా చెప్పాలంటే ఇలా మా అంతట మేం చేసుకుంటేనే పని తొందరగా అవుతుంది’ అని ఆస్ట్రేలియా జట్టు ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.
మరో వైపు తాము కూలీలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కూడా ఆసీస్ క్రికెటర్లు తామే లగేజీ ఎత్తేందుకు ఆసక్తి చూపించారని బీసీసీఐ అధికారి ఒకరు వివరణ ఇచ్చారు. వారు ఎంత సిద్ధమైనా అతిథిగా వచ్చిన జట్టును ఇలా వదిలేయడం మాత్రం ఏ రకంగా చూసినా అభిలషణీయం కాదు. ఆటతో, మాటతో కూడా మనకు బలమైన ప్రత్యర్థే అయినా... భేషజాలు లేని ఆస్ట్రేలియా ఆటగాళ్లను అభినందించకుండా ఉండలేం!