నాస్కామ్ చైర్మన్ గా గుర్నానీ..
♦ వైస్ చైర్మన్‌గా రమణ్ రాయ్
♦ ఈసారి ఐటీలో 14% వృద్ధి అంచనా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2016-17) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల సమాఖ్య నాస్కామ్ కొత్త చైర్మన్‌గా టెక్ మహీంద్రా ఎండీ సీపీ గుర్నానీ, వైస్ చైర్మన్‌గా బీపీవో గురు.. క్వాత్రో గ్లోబల్ సర్వీసెస్ సీఎండీ రమణ్ రాయ్ నియమితులయ్యారు. ఇప్పటిదాకా చైర్మన్‌గా ఐటీ ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయంట్ వ్యవస్థాపకుడు బీవీ మోహన్ రెడ్డి ఉన్నారు. బుధవారమిక్కడ విలేకరులతో గుర్నానీ మాట్లాడుతూ ప్రస్తుతం ఐటీ ఎగుమతులు 108 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయన్నారు. ‘‘ఈ సారి ఐటీ రంగ వృద్ధి 12-14 శాతం మేర ఉండగలదని అంచనా వేస్తున్నాం. 2.5 లక్షల పైచిలుకు నియామకాలు ఉండే అవకాశముంది’’ అన్నారాయన.
2018 మార్చిలో వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఐటీతో కలసి నాస్కామ్ హైదరాబాద్‌లో కాన్ఫరెన్స్ నిర్వహించనుందన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాబోయే రోజుల్లో ప్రోడక్టు కంపె నీలు, స్టార్టప్‌లు, టెక్నాలజీ కంపెనీలకు నాస్కామ్ ప్రతినిధిగా మారగలదని మోహన్ రెడ్డి చెప్పారు. 2020 నాటికి ఐటీ రంగం ఆదాయాలు 250 బిలియన్ డాలర్లకు, 2025 నాటికి 350 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతాయన్నారు. ఇంకా హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో టెక్నాలజీ హబ్‌లు ఏర్పాటు చేశాం. మరిన్ని చోట్ల నెలకొల్పేందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరుగుతున్నాయి’’ అని ఆయన వివరించారు. సైబర్ సెక్యూరిటీకి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందం నివేదికను రూపొందించిందని, త్వరలోనే దీన్ని ప్రభుత్వానికిస్తామని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ తెలిపారు.