ఎత్తుకు పైఎత్తు!
పదవికాదు... నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి ఉండాలి. అది నిజమైన రాజకీయ నాయకునికి ఉండాల్సిన నిబద్ధత. పార్టీ మారిన వెంటనే పదవికి రాజీనామా చేయడం నైతిక బాధ్యత. దానిని తూచా తప్పకుండా పాటిస్తున్నారు సాలూరు మునిసిపల్ వైస్‌చైర్‌పర్సన్‌కాకి పాండురంగ. పార్టీ మారిన వెంటనే ఇబ్బంది పెట్టాలని యోచించిన అధికార పార్టీకి వైస్‌చైర్మన్ పదవికి రాజీనామా అస్త్రంతో దీటైన సమాధానం ఇస్తున్నారు.
సాక్షిప్రతినిధి, విజయనగరం: తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక పోకడలు నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు రావాలనుకుంటున్న నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇదే కోవలో ఇటీవల వైఎస్సార్సీపీలో చేరిన సాలూరు మున్సిపల్ వైస్ చైర్మన్ కాకి పాండురంగపై అవిశ్వాసం పెట్టడానికి సిద్ధపడుతున్నారు. వైఎస్సార్సీపీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరినా పదవులకు రాజీనామా చేయకుండా వేలాడుతుంటే... తాను మాత్రం పార్టీ మారాక ఆ పార్టీతో వచ్చిన పదవితో పనేంటని రాజీనామాకు సిద్ధపడుతూ వారికి తగిన బుద్ధి చెబుతున్నారు.
టీడీపీలో అవినీతి నచ్చకే...
వస్త్ర వ్యాపారంతో ప్రాచుర్యం పొందిన కాకి పాండురంగ 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. మొదటిసారి 2009లో కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2014లో తిరిగి కౌన్సిలర్‌గా గెలుపొంది వైస్ చైర్మన్ పదవి పొందారు. ప్రస్తుతం 22వ వార్డు కౌన్సిలర్‌గా నాలుగున్నరేళ్లపాటు ఉన్న ఆయన చైర్పర్సన్ గొర్లె విజయకుమారితో విభేదించేవారు. రెండేళ్ల క్రితం చైర్పర్సన్, ఆమె భర్తపైనా వ్యతిరేక కరపత్రాలు విడుదల చేశారు. ఉద్యోగాలు అమ్ముకుంటున్న వైనాన్ని, అవినీతిని నిర్భయంగా కరపత్రాల ద్వారా బట్టబయలు చేశారు. ఈ క్రమంలో టీడీపీతో ఆయనకు దూరం పెరిగింది. మరోవైపు సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొరపై అభిమానం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గత నెలలో ఎమ్మెల్యే రాజన్నదొర సారధ్యంలో వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సమక్షంలో పాండురంగ వైఎస్సార్సీపీలో చేరారు.