టిక్.. టిక్..
ఎంపీపీల ఎన్నిక నేడు
* జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రేపు
* కొనసాగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీల శిబిరాలు
* టీడీపీ ప్రలోభాలపర్వంపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
* విప్ జారీ చేసిన వైఎస్సార్ సీపీ
సాక్షి, ఒంగోలు : జిల్లాలో పరిషత్ పోరు ఊపందుకుంది. మండల అధ్యక్షుల (ఎంపీపీలు) ఎన్నిక శుక్రవారం జరగనుంది. ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ మధ్యే పోటీ నెలకొంది. గెలిచిన ఎంపీటీసీ సభ్యుల బలబలాలపై ఆయా పార్టీల నాయకులు ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న టీడీపీ.. మండల స్థాయిలోనూ హవా కొనసాగించేందుకు అడ్డదారులు తొక్కుతోంది.
మెజార్టీ లేనిచోట్ల ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని ప్రలోభపెట్టి తమ వైపునకు తిప్పుకునేందుకు నానాతంటాలు పడుతోంది. తెలుగు తమ్ముళ్ల చర్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్య విలువలను మంటగలిపి అత్యధిక ఎంపీపీ స్థానాలు కై వసం చేసుకోవాలన్న టీడీపీ ఎత్తులకు వైఎస్సార్ సీపీ పైఎత్తులు వేస్తోంది. విప్ జారీ చేసిన సంగతి ఆ పార్టీ తమ సభ్యులకు తెలియజేసింది. ఎంపీపీలను ఎన్నుకునే ముందు తొలుత ఎంపీటీసీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి వారితో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
అత్యధిక స్థానాలు వైఎస్సార్ సీపీవే
ఈ ఏడాది ఏప్రిల్ 6, 11 తేదీల్లో జిల్లాలోని 56 మండలాల్లో 790 మండల ప్రాదేశిక స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో అత్యధికంగా 409 స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. టీడీపీ బలం 345 స్థానాలకే పరిమితమైంది. స్వతంత్ర అభ్యర్థులు 15 చోట్ల గెలవగా చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గం ఆటో గుర్తుపై పోటీ చేసి 14 చోట్ల విజయం సాధించింది. బీఎస్పీ ఒక ఎంపీటీసీ స్థానాన్ని గెలుచుకుంది. మండలాల వారీగా చూస్తే వైఎస్సార్ సీపీ 29 ఎంపీపీ పీఠాలు, టీడీపీ 19 స్థానాలు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో 8 మండలాల్లో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ లేనందున ఇక్కడ స్వతంత్రుల మద్దతు కూడగట్టేందుకు ఆ రెండు పార్టీలూ దృష్టిపెట్టాయి.
అందిరి చూపూ జెడ్పీ పీఠం వైపే
జిల్లా పరిషత్ పగ్గాలు చేపట్టేందుకు అవసరమైన జెడ్పీటీసీ సభ్యుల బలం వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఉంది. జిల్లాలో 56 జెడ్పీటీసీలకుగాను ఆ పార్టీ 31 స్థానాల్లో గెలుపొందింది. టీడీపీ తరఫున 25 మంది సభ్యులు మాత్రమే విజయం సాధించారు. టీడీపీ ఎలాగైనా జెడ్పీ పగ్గాలు చేపట్టాలనే వ్యూహంతో రకరకాల కుయుక్తులకు పాల్పడుతోంది. కసరత్తులో భాగంగా తొలుత అత్యధిక ఎంపీపీ స్థానాల కైవసం చేసుకునేందుకు ఇతర పార్టీల ఎంపీటీసీ సభ్యులను కొనుగోలు చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది.
నేతల సమావేశాల్లో కొనుగోళ్ల వ్యవహారంపై బహిరంగంగానే కార్యకర్తలకు పిలుపునివ్వడం.. కొన్నిచోట్ల ఎంపీటీసీల బంధువులతో బేరాలకు దిగి బరితెగించిందనే ఆరోపణలు టీడీపీ మూటగట్టుకుంటోంది. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు మాత్రం తాము పార్టీ నిబంధనలకు కట్టుబడే ఉన్నామని, ప్రత్యర్థులు పనిగట్టుకుని దుష్ర్పచారం చేస్తున్నారని పలు సందర్భాల్లో బహిరంగంగానే వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. విప్‌ను ధిక్కరిస్తే అనర్హత వేటుకు గురికాక తప్పదన్న రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్యలపై జిల్లాలో సర్వత్రా చర్చ జరుగుతోంది.