vice principal
-
చదువుకోవాలా..? బాత్రూంలు క్లీన్ చేయాలా?
ఉట్నూర్‌రూరల్: ‘మేము చదువుకోవాలా..? లేక బాత్రూంలు క్లీన్ చేయాలా’’అంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని కేబీ ప్రాంగణంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం చోటు చేసుకుంది. వైస్‌ప్రిన్సిపాల్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఆగస్టు15వ తేదీన ఐటీడీఏ పీఓకు వినతిపత్రం అందించినా, ఎలాంటి మార్పు రాలేదంటూ గేటు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు.పోలీసులు, వైస్ ప్రిన్సిపాల్ భూలక్ష్మి విద్యార్థినులను ఎంత బతిమిలాడినా వారు వినిపించుకోకుండా ఆందోళన కొనసాగించారు. విషయం తెలుసుకున్న గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ గంగాధర్ అక్కడకు చేరుకున్నారు. విద్యార్థినులను సముదాయించే ప్రయత్నం చేశారు. చివరకు వారు కళాశాల ప్రాంగణంలోకి వచ్చి ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ, వైస్ ప్రిన్సిపాల్ భూలక్ష్మి తమతో బాత్రూంలు శుభ్రం చేయిస్తుందని, స్నానపు గదులకు తలుపులు లేకపోవడంతో తలుపులు బిగించాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. మంచినీరు అందుబాటులో లేదని, అనారోగ్యానికి గురైతే సిక్‌రూం ఏర్పాటు చేయడం లేదని ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం ఓ విద్యార్థిని తీవ్ర అనారోగ్యం పాలైనా చూసేవారు లేక ఇబ్బందులు పడ్డామని ఆరోపించారు. రీజినల్ కోఆర్డినేటర్ స్పందిస్తూ తక్షణమే పీఓ దృష్టికి తీసుకువెళ్లి వైస్ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వైస్ ప్రిన్సిపాల్‌ను ట్రాన్స్ఫర్ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని గంగాధర్ చెప్పడంతో వారు శాంతించారు. ఈ విషయమై వైస్ ప్రిన్సిపాల్ భూ లక్ష్మిని వివరణ కోరగా.. తనపై కావాలని ఆరోపణలు చేస్తున్నారని ఎవరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు. -
విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం
కాచిగూడ: విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ డి.రాధిక యాదవ్ అన్నారు. కాచిగూడలోని ఎంఎస్ఎస్ లా కాలేజీలో ప్రొఫెసర్ డాక్టర్ విష్ణుప్రియ అధ్యక్షతన లా విద్యార్థులకు ఇండక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజంలో న్యాయ విద్య ఒక ఉన్నతమైన వృత్తి అన్నారు. ప్రస్తుత సామాజిక మార్పులతో విద్యార్థులు చర్చలకు హాజరు కావడం, భాషపై పట్టు సాధించడం, ఆన్లైన్లో చట్టపరమైన వనరులను సద్వినియోగం చేసుకొని నైపుణ్యాలు, జ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఎస్ఎస్ లా కాలేజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ డీవీజీ కృష్ణ, కార్యదర్శి ఎస్.బి.కాబ్రా, అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఓ దంత దేవతా! పన్ను మిస్సింగ్ ఇక్కడ
క్రిస్మస్ తాత కానుకలతో సర్ప్రైజ్ చేస్తాడు. ఈస్టర్ బన్నీ ఇన్నిన్ని బొమ్మలు తెచ్చిస్తుంది. పాశ్చాత్య దేశాల్లో పిల్లల కోసం..పెద్దలు సృష్టించిన ఫీల్ గుడ్ భావనలివి. అలాంటిదే మరొకటి.. టూత్ ఫెయిరీ. పిల్లల పాల పళ్లు ఊడిపోతే పరిహారంగా.. ధనాన్ని ఇచ్చిపోతుంది ‘టూత్ ఫెయిరీ’. అంటే.. దంత దేవత. కెనడాలోని ఓ స్కూల్లో పన్నూడిన పిల్లాడికి..గోల్డ్ కాయిన్ ఇచ్చి వెళ్లింది టూత్ ఫెయిరీ. ఆ దేవత ‘శాండీ’ అని లోకానికి తెలుసు. ఆ పిల్లాడికి పెరిగి పెద్దయ్యాక తెలుస్తుంది. హార్ట్ ఐలాండ్స్ ఎలిమెంటరీ స్కూల్. ప్రిన్స్ జార్జ్ టౌన్. కెనడా. ఆ స్కూలు వైస్–ప్రిన్సిపాల్ శాండీ వైట్‌హెడ్. ప్రిన్సిపాల్ ఉన్నారు కానీ, వైస్ ప్రిన్సిపాల్‌గా శాండీనే పిల్లల చదువుల్ని, వారి లైంచ్ టైమ్‌ని పర్యవేక్షిస్తుంటారు. ఆ రోజు లంచ్ బెల్ మోగిన కొద్దిసేపటికి శాండీ దగ్గరకు ఒక ముఖ్యమైన వర్తమానం చేరింది. ఐదేళ్ల గవిన్ పాల పన్ను ఊడిపోయింది. ఊడి, ఎక్కడ పడిందో ఎవరికీ కనిపించడం లేదు. గవిన్ని ఆఫీస్ రూమ్‌కి పిలిపించలేదు శాండీ. గవిన్ దిగాలుగా కూర్చొని ఉన్న లంచ్ రూమ్‌లోకి తనే స్వయంగా వెళ్లారు. ‘ఏదీ.. నోరు తెరువు’ అన్నారు. గవిన్ నోరు తెరిచాడు. ఆ పలు వరుసలో ఒక పన్ను మిస్సింగ్! అప్పుడే ఊడిపడిపోయినట్లుగా పచ్చిగా ఉంది ఆ ఖాళీ స్థలం. ‘‘అంతా వెతికాం మేమ్. గవిన్ పన్ను కనిపించలేదు’’ అని చెప్పారు గవిన్ క్లాస్మేట్స్ శాండీ చుట్టూ చేరి. ‘ఏం చేద్దాం?’ అన్నట్లు దీర్ఘాలోచనగా ముఖం పెట్టారు కొందరు చిన్నారులు. ‘‘గవిన్ పన్ను ఇక ఎప్పటికీ దొరకదా?’’ అని నిరామయంగా చూస్తున్నారు మిగతా చిన్నారులు. గవిన్ మౌనంగా ఉన్నాడు. ‘‘ఏమాలోచిస్తున్నావ్ గవిన్?’’ అని అడిగారు శాండీ. ‘‘మా మమ్మీ డాడీ ఏమంటారోనని..’’ అన్నాడు గవిన్ మెల్లిగా. వాడికి ఏడుపు రాబోతోంది. పన్నును తనే పడేసుకున్నట్లు ఫీల్ అవుతున్నాడు. ‘‘ఏం కాదులే. మమ్మీ డాడీకి నేను చెప్తాను’’అన్నారు శాండీ. ‘‘మరి.. పన్ను పోయినందుకు టూత్ ఫెయిరీ నాకు మనీ ఇస్తుందా?’’ అని అడిగాడు గవిన్. ‘‘నిజమే. టూత్ ఫెయిరీ ఉంది కదా. అడుగుతాం. తప్పక ఇస్తుంది’’ అని గవిన్ బుగ్గ పుణికి పిల్లలందర్నీ లంచ్ రూమ్‌కి పంపించారు శాండీ. ∙∙ గవిన్ పన్ను ఊడింది జనవరి 12 మధ్యాహ్నం. ఆ మధ్యాహ్నమే శాండీ ‘టూత్ ఫెయిరీ’కి లెటర్ రాసి నోటీస్ బోర్డులో పెట్టారు! ఆ లెటర్ కూడా మామూలు కాగితం మీద కాదు. స్కూల్ లెటర్‌హెడ్ మీద!! ౖటైప్ చేసిన ఆ లెటర్ కింద శాండీ తన సంతకం కూడా పెట్టారు. ఆ లెటర్లో ఇలా ఉంది: ‘‘డియర్ టూత్ ఫెయిరీ, ఈరోజు గవిన్ లంచ్ చేయడం కోసం రెడీ అవుతుండగా ఆ చిన్నారి పాల పన్ను ఒకటి ఊyì పోయింది. అది క్లాస్ రూమ్‌లోనే ఎక్కడో పడింది కానీ, ఎంత వెతికినా ఎవరికీ కనిపించలేదు. ఎంతో సాహసోపేతమైన మా చిన్నారి టీమ్ మొత్తం నిర్భయంగా ఆ పన్ను కోసం గాలించింది. అయినప్పటికీ పన్ను ఎవరి కంటా పడలేదు. నేను సుశిక్షితురాలైన వైస్–ప్రిన్సిపాల్‌ని. అంతేకాదు. హాబీ డెంటిస్ట్‌ని. అభిరుచి కొద్దీ నేర్చుకున్న దంత పరిజ్ఞానం నాక్కొంత ఉంది. ఆ పరిజ్ఞానంతో మొదట నేను గవిన్ని నోరు తెరవమని అడిగాను. తెరిచాడు. నిజమే. ఒక పన్ను తన స్థానం నుంచి రాలిపోయింది! రాలి పడిన గుర్తుగా అక్కడ ఖాళీస్థలం కనిపించింది. ఉదయం గెవిన్ స్కూల్‌కి వచ్చినప్పుడు అక్కడ ఆ ఖాళీ స్థలం లేదని నిశ్చయంగా చెప్పగలను. కనుక దయచేసి ఓ దంత దేవతా.. ఈ లెటర్ ను అధికారిక పరిశీలనకు స్వీకరించి, నిజంగా పోయిన పన్నుకు ప్రామాణికమైన విలువను నిర్ణయించి ఆ విలువకు సరిపడా డబ్బును గెవిన్కు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి. ఈ విషయమై నీకేమైనా సందేహాలు ఉంటే ఈ లెటర్లో పైన కనిపిస్తున్న చిరునామాకు పంపేందుకు సంకోచించనవసరం లేదు. సిన్సియర్లీ శాండీ ఎం. వైట్‌హెడ్. పి.ఎస్ – నా పన్ను 2000 సంవత్సరంలో ఊడిపోయింది. ఇప్పటి వరకు నాకు అందవలసిన మొత్తం అందనేలేదు. కనుక సాధ్యమైనంత త్వరగా పంపించగలవు. నేను చెల్లించవలసిన బిల్లులు ఉన్నాయి. ∙∙ వారం గడిచింది. ఇరవై ఏళ్ల క్రితం ఊడిపోయిన శాండీ పన్నుకు పరిహారం రాలేదు. వారం క్రితం ఊడిన గెవిన్కి మాత్రం రెండో రోజే వచ్చింది! ‘‘ఉదయాన్నే లేచి చూశాను. ఒక గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్‌ను తెచ్చిచ్చి, నాకు ఇవ్వమని చెప్పి వెళ్లిపోయిందట టూత్ ఫెయిరీ’’ అని గెవిన్.. మేడమ్ శాండీకి చెప్పాడు తొర్రి పన్ను కనిపించేలా నవ్వుతూ. శాండీ కూడా ‘గుడ్’ అని నవ్వారు. ఆమె రాసిన లెటర్ ఇప్పుడు ట్విట్టర్లో వైరల్ అవుతోంది. అంతమంచి లెటర్ రాసిన శాండీకి, గెవిన్ ముఖంలో సంతోషాన్ని ఎలా తెప్పించాలో తెలియకుండా ఉంటుందా?! నెట్ నిండా ఆమెకు అభినందనలే అభినందనలు. ఇలాంటి టీచర్ ఉండాలి అని. -
సర్.. మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా ?
కోవిడ్-19 కారణంగా తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో దాదాపు అన్ని విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. క్లాస్‌రూంలో సిన్సియర్‌గా పాఠాలు వినే స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారో తుంటరి విద్యార్థులు సైతం ఉంటారు. క్లాసులు జరుగుతున్నప్పుడే మిగతా విద్యార్థులతో పాటు, టీచర్‌పై కామెంట్లు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం తరగతి గదులకు నేరుగా హాజరయ్యే పరిస్థితి లేకపోవడంతో ఈ ఫన్ని మిస్ అవుతున్నాం అనుకున్నారో ఏంటో ఆన్లైన్ క్లాస్ జరుగుతుండగా, కొందరు విద్యార్థులు ఏకంగా వైస్ ప్రిన్స్‌పల్ పైనే జోకులేశారు. అందుకు బదులుగా ఆయన కూడా స్టూడెంట్స్‌కు గట్టి చివాట్లే పెట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే..క్లాస్ జరుగుతండగాసర్ ఒక డౌట్ అంటూ స్టూడెంట్ ప్రశ్నించగా...ఏంటో చెప్పమని వైస్ ప్రిన్సిపల్ అడిగారు. దీంతో మీ టూత్ పేస్ట్‌లో ఉప్పు ఉందా సర్ అంటూ తుంటరి ప్రశ్న వేశాడు. ఇందుకు బదులుగా 'ఉప్పు అంటూ ఎలా ఉంటుందో చూపిస్తా..నువ్వు మళ్లీ స్కూల్లో కనపడకుండా చేస్తా' అంటూ వైస్ ప్రిన్స్‌పల్ ఫైర్ అయ్యారు. ఆ తర్వాత కూడా కొందరు స్టూడెంట్స్ జోకులు వేయడానికి ప్రయత్నించగా..ఈ మొత్తం వ్యవహారాన్ని రికార్డ్ చేశానని, వైస్ ఛైర్మన్‌కు కంప్లెంట్ చేస్తానని ఫైర్ అయ్యారు. అంతేకాకుండా వేరే విద్యార్థులను సైతం సెషన్ నుంచి వెళ్లిపోవాలని శాసించారు. అయితే దీనికి ఏమాత్రం బెదరని స్టూడెంట్స్ అదేపనిగా కామెంట్లు చేస్తుండటంతో కోపంతో ఊగిపోయిన వైస్ ప్రిన్సిపల్ చివరికి ఆయనే ఆన్లైన్ సెషన్ నుంచి లాగ్అవుట్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీచర్‌పై కామెంట్లు చేసి నవ్వుకుందామనుకున్న స్టూడెంట్స్‌కి వైస్ ప్రిన్సిపల్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. -
ఎంజీ యూనివర్శిటీ కీచక వైస్ ప్రిన్సిపల్!
సాక్షి, నల్గొండ: మహత్మగాంధీ యూనివర్శిటీ.. దేవాలయంలాంటి ఈ విద్యాలయంలో బాధ్యతగా పర్యవేక్షణ చేయాల్సిన కళాశాల వైస్ ప్రిన్సిపల్.. స్థాయి మరచి ఇంజనీరింగ్ విద్యార్థినులకు ఫోన్లో అసభ్యకర మెసేజ్‌లు పెట్టాడు. అతగాడి వేధింపులు భరించలేని విద్యార్థినులు ఎస్పీకి ఫిర్యాధు చేయడంతో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కాలేజీ వైఎస్ ప్రిన్సిపల్ వై. పునీత్‌కుమార్.. విద్యార్థినులకు ఫోన్లో అసభ్యకర మెసేజ్‌లు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడని మూడు రోజుల క్రితం బాధిత విద్యార్థినులు ఈ విషయాన్ని యూనివర్శిటీ రిజిస్ట్రార్ దృష్టికి తీసుకేళ్లారు. దీనిపై ఆయన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సదరు వైస్ ప్రిన్సిపాల్ మళ్లీ విద్యార్థినులకు అసభ్యకర మెసెజ్‌లు పంపించడం మొదలుపెట్టాడు. దీంతో భరించలేక విద్యార్థులు స్థానిక ఎస్పీ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో బాధితు విద్యార్థినులు వైస్ ప్రిన్సిపల్‌ను విచారణ జరిపి విధుల నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయనను కోరారు. ఫోన్‌డేటా, మెసెజ్‌ల పరిశీలన విద్యార్థినుల ఫిర్యాధు మేరకు ఎస్పీ రంగనాథ్ ప్రత్యేక నిఘా పెట్టారు. ఫోన్‌డేటా, అతను పంపిన మెసెజ్‌లను పరిశీలించడంతో రుజువైంది. ఇక అప్పటికే నిందితుడు పరారీ ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. దీంతో ప్రత్యేక పోలీసు బృందంతో రెండు రోజుల క్రితం అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా నిందితుడు నేరం ఒప్పుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. కవలలపై కీచక తండ్రి, మేనమామ అఘాయిత్యం కమిటీ ఏర్పాటు ఇంజనీరింగ్ వైఎస్ ప్రిన్సిపాల్ పునీత్ కుమార్ విద్యార్థినులను వేధిస్తున్న విషయమై యూనివర్శిటీలో ఓ కమిటీని నియమించినట్లు ఏస్పీ రంగానాథ్ తెలిపారు. కమిటీ సభ్యుల విచారణలో తనకు అనుకూలంగా చెప్పాలని పలువురు విద్యార్థులకు ఫోన్ చేయడంతో పాటు మెసెజ్‌లు పంపినట్లు కమిటీ వెల్లడించింది. దీంతో కమిటీ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని యూనివర్శిటీ యాజమాన్యం చెప్పినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ విషయమై యూనివర్శిటీ రిజీస్టార్ యాదగిరిని ఫోన్లో విచారణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందిచలేదని ఆయన పేర్కొన్నారు. గతంలోనూ ఓ అధ్యాపకుడికి దేహశుద్ధి యూనివర్శిటీలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని, గతంలో కూడా ఓ అధ్యాపకుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విద్యార్థి సంఘాలు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా సదరు కీచక అధ్యాపకుడికి దేహశుద్ధి చేసినట్లు వెల్లడించారు. పిల్లల బంగారు భవిష్యత్తుపై కలలు కంటున్న తల్లిదండ్రులు ఉన్నత విద్య కోసం యూనివర్శిటీలకు పంపిస్తే.. మార్గనిర్దేశం చేయాల్సిన అధ్యాపకులు అనుసరిస్తున్న తీరు బాధాకరమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక సదరు నిందితుడు కీచక వైస్ ప్రిన్సిపల్‌ను అదుపులోకి తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
సిరిసిల్లలో ‘నారాయణ’ వైస్ ప్రిన్సిపల్ అరెస్ట్
హైదరాబాద్: నారాయణ విద్యాసంస్థల ఆడియో టేపుల వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. టేపుల లీకేజీకి బాధ్యుడని భావిస్తున్న వైస్ ప్రిన్సిపల్ నవీన్‌గౌడ్‌ను పోలీసులు సిరిసిల్లలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకురానున్నారు. నవీన్‌గౌడ్ బెదిరించి వాయిస్ రికార్డ్ చేయించాడని ప్రిన్సిపల్ సరిత అగర్వల్ ఆరోపించారు. హైదరాబాద్ రామాంతపూర్‌లోని నారాయణ స్కూల్‌కు చెందిన వైస్ ప్రిన్సిపల్ నవీన్ .. అదే బ్రాంచ్‌కు చెందిన ప్రిన్సిపాల్ సరితా అగర్వాల్‌తో మాట్లాడిన సంభాషణలు బయటపడిన విషయం తెలిసిందే. డీమానిటైజేషన్ సమయంలో బ్లాక్‌మనీని నారాయణ యాజమాన్యం వైట్‌మనీగా ఎలా మార్చిందో వీరిద్దరూ ఆ వీడియోలో చర్చించుకున్నారు. అలాగే యాజమాన్యంలోని కీలక వ్యక్తికి ...మహిళలతో వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆ సంభాషణల్లో వెల్లడి అయింది. హయత్‌నగర్ నారాయణ బ్రాంచ్‌కు చెందిన ఉద్యోగి శ్రీలత ఆత్మహత్యకు కారణం ఏంటో కూడా....ఈ ఆడియోలో చెప్పడం సంచలనంగా మారుతోంది. వనస్థలీపురంలో ఉన్న నారాయణ విద్యాసంస్థల గెస్ట్‌హౌస్ అరాచకాలకు అడ్డాగా మారిందని...ఈ ఆడియో ద్వారా తెలుస్తోంది. నారాయణ సంస్థలకు సంబంధించిన కీలకమైన విషయాలపై చర్చ జరిగిన ఈ ఆడియో టేపు.....ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ విషయం పై నవీన్ నోరు తెరిస్తేనే నిజానిజాలు బయటకి రానున్నాయి. -
మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ జేసీ రెడ్డి
అనంతపురం మెడికల్ : అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ జయచంద్రారెడ్డి (జేసీ రెడ్డి) నియమితులయ్యారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేఎస్ఎస్ వేంకటేశ్వరరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జేసీ రెడ్డి ప్రస్తుతం సర్వజనాస్పత్రిలో ఆర్థో విభాగాధిపతిగా పని చేస్తున్నారు.