Viceroy Hotels
-
సీఎం బినామీ సుజనాకు షాక్
సాక్షి, అమరావతి: బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బినామీ సుజనా చౌదరికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాక్ ఇచ్చింది. సుజనా గ్రూపు కంపెనీ బెస్ట్ అండ్ కాంప్ట్రన్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీఈపీఎల్)పై నమోదైన మనీ లాండరింగ్ కేసులో హైదరాబాద్‌లోని వైస్రాయ్ హోటల్స్‌కు చెందిన రూ.315 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను జప్తు చేసినట్లు ఈడీ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోందని పేర్కొంది. కాగా సుజనా గ్రూపు.. మహల్ హోటల్స్ పేరిట ఒక డొల్ల కంపెనీని సృష్టించి తీసుకున్న రుణం మొత్తాన్ని దొంగ లావాదేవీల రూపంలో వైస్రాయ్ హోటల్స్‌కు తరలించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. వైస్రాయ్ హోటల్స్, మహల్ హోటల్స్ మధ్య వ్యాపార లావాదేవీలు జరిగినట్లుగా ఒప్పందాలు కుదుర్చుకొని ఈ మొత్తాన్ని వైస్రాయ్ హోటల్స్‌కు చేరవేశారు. రూ.315 కోట్లు మహల్ హోటల్స్ నుంచి వచ్చినట్లు విచారణలో వైస్రాయ్ హోటల్స్ అంగీకరించింది. మొత్తం రూ.6,000 కోట్లు ఎగవేత సుజనాచౌదరి బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను.. డొల్ల కంపెనీలు సృష్టించి, దొంగ ఇన్వాయిస్ల ద్వారా జరగని లావేదేవీలు జరిగినట్లు చూపించి సొంత ఖాతాల్లోకి బదలాయించుకున్నట్లు తేలింది. ఈ విధంగా ఇప్పటివరకు వివిధ బ్యాంకుల నుంచి రూ.6,000 కోట్ల రుణాలు తీసుకుని చెల్లించకుండా ఎగ్గొట్టినట్లు తేలింది. బెంగళూరులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదుతో తీగ లాగితే మొత్తం డొంక కదిలింది. బీసీఈపీఎల్ రూ.364 కోట్ల విలువైన రుణాలు తీసుకొని ఎగ్గొట్టిందంటూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులతో కలసి బెంగళూరులో ఫిర్యాదు చేసింది. దీంతో 2010–2013 కాలంలో ఈ సంస్థ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టినట్లుగా.. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. తదనంతరం చెన్నై, న్యూఢిల్లీ, హైదరాబాద్‌ల్లో ఉన్న సుజనా గ్రూపునకు చెదిన కంపెనీలు, నివాసాల్లో చేసిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పంజాగుట్టలోని సుజనా కార్యాలయంలో చేసిన సోదాల్లో వివిధ డొల్ల కంపెనీలకు చెందిన 124 రబ్బరు స్టాంపులు దొరికాయి. అలాగే బీసీఈపీఎల్‌కు చెందిన రబ్బరు స్టాంపుతో పాటు, ఈ రుణం ద్వారా లబ్ధిపొందిన కంపెనీలు, వివిధ రుణదాతలు, వ్యాపార సంస్థలకు చెందిన రబ్బరు స్టాంపులు దొరికాయి. కాగా సుజనాచౌదరి పెద్దమొత్తంలో తీసుకున్న రుణాలు ఎక్కడికి తరలించారు? ఎవరు లబ్ధి పొందారు అనేది ఈడీ తదుపరి విచారణలో తేలాల్సి ఉంది. -
సుజనా చౌదరికి భారీ షాక్
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. బ్యాంకులను మోసగించిన కేసులో రూ.315 కోట్ల విలువైన వైస్రాయ్ హోటల్స్ ఆస్తులను జప్తు చేసింది. షెల్ కంపెనీల పేరుతో బ్యాంకులకు రూ. 364 కోట్లకు కుచ్చుటోపీ పెట్టినట్టు గుర్తించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈమేరకు చర్య తీసుకుంది. మనీ ల్యాండరింగ్ 2002 చట్టప్రకారం హైదరాబాద్‌లోని వైస్రాయ్ హోటల్స్ ఆస్తులను అటాచ్ చేసింది. పెద్ద డొల్ల కంపెనీలు సృష్టించి నకిలీ ఆస్తులు, బోగస్ ఇన్వాయిస్లతో బ్యాంకులను సుజనా గ్రూప్ బురిడీ కొట్టించినట్టు ఈడీ విచారణలో వెల్లడైంది. చైన్నలోని ఆంధ్రా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బును షెల్ కంపెనీలకు తరలించి అక్రమాలకు పాల్పడినట్టు తేలింది. మహల్ హోటల్ అనే డొల్ల కంపెనీని సృష్టించి దీని నుంచి డబ్బును వైస్రాయ్ హోటల్ లిమిటెడ్‌కు తరలించినట్టు దర్యాప్తులో తెలిసింది. పంజాగుట్ట నాగార్జున హిల్స్‌లోని సుజనా గ్రూప్ కార్యాలయం నుంచి కీలక పత్రాలను ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డొల్ల కంపెనీలకు చెందిన 124 నకిలీ రబ్బరు స్టాంపులను కూడా గుర్తించారు. (చదవండి: ‘సుజనా’ క్రియేటివ్స్.. మాయారాజ్యం) -
సుజనా చౌదరికి ఈడీ భారీ షాక్
-
మరోసారి వేలానికి వైస్రాయ్ హోటల్
రిజర్వు ధర రూ.92.34 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆతిథ్య రంగంలో ఉన్న వైస్రాయ్ హోటల్స్‌కు చెందిన కోర్ట్‌యార్డ్ మారియట్ హోటల్ మరోసారి వేలానికి వచ్చింది. వైస్రాయ్కి రుణమిచ్చిన కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా ఆస్తుల పునర్నిర్మాణ, వాటాదారుల ప్రయోజనాల అమలు చట్టం (సర్ఫయేసి) కింద ఈ–వేలాన్ని ప్రకటించాయి. కంపెనీ ఎస్బీఐకి రూ.68.31 కోట్లు, కెనరా బ్యాంకుకు రూ.28.24 కోట్లు బాకీ పడింది. 2012 నుంచి వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంది. ఇరు బ్యాంకుల నుంచి వైస్రాయ్ రూ.100 కోట్లకుపైగా రుణం తీసుకున్నట్టు సమాచారం. 2016 జనవరిలో, అలాగే అదే ఏడాది చివర్లో కూడా బ్యాంకులు వేలం వేస్తున్నట్లుగా ప్రకటించాయి. కానీ అప్పట్లో ఇన్వెస్టర్ల నుంచి స్పందన రాలేదని బ్యాంకు అధికారి ఒకరు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. హుస్సేన్‌సాగర్ సమీపంలోని కోర్ట్‌యార్డ్ మారియట్ హోటల్లో 120 గదులున్నాయి. వైస్రాయ్ హోటల్స్‌ను ప్రస్తుతం యూఎస్‌కు చెందిన మారియట్ ఇంటర్నేషనల్ నిర్వహిస్తోంది. ఫ్రాంచైజీ, మార్కెటింగ్తోపాటు 20 ఏళ్లపాటు నిర్వహణకుగాను 2003లో ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఇక వేలం రిజర్వు ధరను రూ.92.34 కోట్లుగా బ్యాంకులు నిర్ణయిం చాయి. బిడ్డింగులో పాల్గొనేవారు రూ.9.23 కోట్లు డిపాజిట్ చేయాలి. ఈ నెల 28న వేలం జరగనుంది. దరఖాస్తు పంపేందుకు చివరి తేదీ ఈ నెల 26.