విదర్భ వ్యథ వినిపించేనా ?
నాగపూర్: అతివృష్టి, అనావృష్టి, కరువు, వ్యవసాయ సంక్షోభం సంభవించడం, గిట్టుబాటు ధరలు లభించక ప్రాణాలు తీసుకున్న విదర్భ ప్రాంత రైతుల భార్యలు నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వ్యవసాయ సంక్షోభ నివారణకు కొత్త సర్కారు తగిన చర్యలు తీసుకుంటుందని వీళ్లంతా ఆకాంక్షిస్తున్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమం సందర్భంగా మోడీతో మాట్లాడిన పలువురు విదర్భ వితంతువులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. పంట రుణాలు, గిట్టుబాటు ధరలు దక్కడం లేదని, ఫలితంగా చాలా మంది నిరాశానిస్పృహల్లో ఉన్నారని తెలిపారు.
ప్రధానిగా అధికారం చేపట్టగానే విదర్భ రైతుల కుటుంబాలకు ప్రత్యేక సమగ్ర పరిహార, పునరావాస ప్యాకేజీని ప్రకటించాలని మోడీకి విజ్ఞప్తి చేశారు. విదర్భలో ప్రధాన వాణిజ్య పంట అయిన పత్తికి మద్దతుధర లేకపోవడం, వ్యవసాయ సంక్షోభం వల్ల 2004 నుంచి ఇప్పటి వరకు 10 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విదర్భ వ్యవసాయ వితంతువుల సంఘం (వీఎఫ్డబ్ల్యూఏ) అధ్యక్షురాలు బేబితాయి బయాస్ అన్నారు. భర్తలను కోల్పోయిన చాలా మందికి ఇప్పటికీ పింఛన్, భూకేటాయింపు వంటి సదుపాయాలు అందలేదని తెలిపారు. మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా తమకు ఊరటనిచ్చేలా మోడీ చర్యలు తీసుకుంటారన్న నమ్మకం ఉందని అపర్ణ మాలికర్ అనే వితంతువు పేర్కొన్నారు. విదర్భ జనాందోళన్ సమితి అధిపతి కిశోర్ తివారీ సైతం ఎన్డీయే ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని తెలిపారు.
జాతీయ రైతుల సంఘం సూచించిన కనిష్ట మద్దతు ధర విధానాన్ని అమలు చేయాలని, ప్రస్తుతం ఉన్న విధానం రైతులకు మేలు చేయడం లేదని సమితి పేర్కొంది. సంక్షోభం కారణంగా సర్వం కోల్పోయిన రైతుల కుటుంబాలకు మళ్లీ పంటరుణాలు ఇవ్వాలని విన్నవించింది. గత ఎన్డీయే ప్రభుత్వం విదర్భ రైతులకు ఏమీ చేయలేదని, పత్తి దిగుమతికి అనుమతించి రైతులకు అన్యాయం చేసిందని కిశోర్ తివారీ అన్నారు. గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.