vietnam tennis tournament
-
రన్నరప్ జయరామ్
హో చి మిన్ సిటీ (వియత్నాం): సీజన్లో తొలి టైటిల్ సాధించాలని ఆశించిన భారత అగ్రశ్రేణి షట్లర్ అజయ్ జయరామ్‌కు నిరాశ ఎదురైంది. వియత్నాం ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్–100 టోర్నమెంట్లో జయరామ్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఈ టోర్నీలో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న అజయ్ ఫైనల్ పోరులో మాత్రం చేతులెత్తేశాడు. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో 30 ఏళ్ల భారత ఆటగాడు 14–21, 10–21తో రుస్తవిటో (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు. కేవలం 28 నిమిషాల్లోనే భారత ప్లేయర్ ఆట ముగిసింది. ‘ఫైనల్లో ఏ దశలోనూ నేను నిలకడగా ఆడలేదు. అనవసర తప్పిదాలు చాలా చేశాను. నెట్ వద్ద తడబడ్డాను. సుదీర్ఘ ర్యాలీలకు సరైన ఫినిషింగ్ కూడా ఇవ్వలేదు. గాయం నుంచి కోలుకున్నాక గత రెండు నెలల్లో మంచి ప్రదర్శనే చేశాను. రెండు టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచాను’ అని జయరామ్ వ్యాఖ్యానించాడు. -
రన్నరప్ శ్రీవత్స జంట
హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) గ్రేడ్-5 జూనియర్స్ వియత్నాం ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ శ్రీవత్స రాచకొండ డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచాడు. భారత్‌కే చెందిన సిద్ధార్థ్ ఠక్రాన్తో కలిసి శ్రీవత్స ఈ టోర్నీలో ఆడాడు. డబుల్స్ ఫైనల్లో యు సియంగ్ సు (చైనీస్ తైపీ)-చింగ్ హో (హాంకాంగ్) జోడీ 6-3, 6-3తో శ్రీవత్స-సిద్ధార్థ్ జంటపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో శ్రీవత్స- సిద్ధార్థ్ జోడీ 7-6(10/8), 6-2తో చ్యువ్-డేనిల్ స్పాసిబో (రష్యా) జంటపై నెగ్గి ఫైనల్‌కు చేరుకుంది.