vighnes Sivan
-
వి అంటే అతనేనా?
‘ప్యారులో పడిపోతే పరేషానురా..’ అని ‘ధృవ’లో ఒక పాట ఉంది. కరెక్టే.. ప్యారులో పడితే పరేషానే. ఎవరికీ వినిపించకుండా దొంగచాటుగా ఫోన్లు మాట్లాడుకోవడం, కనిపించకుండా తిరగడం.. అబ్బబ్బ... అంతా పరేషాన్. ఇప్పుడు నయనతార–దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ పరేషాన్లోనే ఉన్నారని చెన్నై టాక్. ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్త ప్రచారంలోకొచ్చినప్పటి నుంచి ఔత్సాహికరాయుళ్లు తమ దృష్టినంతా వాళ్ల మీదే పెట్టారు. ఇద్దరూ కలసి తిరిగితే.. స్మార్ట్ ఫోన్లో చాలా స్మార్ట్‌గా ఫొటోలు తీస్తున్నారు. చేతులు, మెడ.. ఇలా కంటికి కనిపించే శరీర భాగాల్లో ఏమైనా పచ్చబొట్లు ఉన్నాయా? అని అదే పనిగా వెతకడం మొదలు పెట్టారు. అలా వెతికిన ఓ రెండు కళ్లకు నయనతార చెవికి ఉన్న కమ్మలు కనిపించాయి. ‘వి’ ఆకారంతో అగుపించిన ఆ ఇయర్ రింగ్స్ గురించే ఇప్పుడు హాట్ టాపిక్. ‘వి’ అంటే ఏంటి? అనడిగితే ‘వ్యాన్’ అని చిన్నపిల్లలు చెబుతారు. విజయాల బాటలో దూసుకెళుతున్నవాళ్లు ‘విక్టరీ’ అంటారు. కానీ, ‘వి ఫర్ విఘ్నేష్ శివన్’ అన్నది కొందరి ఓపీనియన్. ప్రియుడి పేరు వచ్చేట్లుగా నయన ఇయర్ రింగ్స్ సెలక్ట్ చేసుకున్నారని అంటున్నారు. మరి.. ‘వి అంటే అతనేనా?’ నయనతారే చెప్పాలి. -
సొంత ఇంట్లో...సహజీవనం?!
కొంతమంది వార్తల్లో నిలవకపోతే అది పెద్ద వార్త అవుతుంది. అలాంటివాళ్లల్లో నయనతార ఒకరు. ఎప్పుడూ ఏదో ఒక లవ్‌స్టోరీ ద్వారా వార్తల్లో నిలుస్తుంటారామె. ముందు హీరో శింబు.. తర్వాత కొరియోగ్రాఫర్-దర్శకుడు-నటుడు ప్రభుదేవా... ఇప్పుడు దర్శకుడు విఘ్నేశ్ శివన్. మొదటి ఇద్దరితో ఆమె పెళ్లి వరకూ వెళ్లి, ఆనక విడిపోయారు. తాజాగా విఘ్నేశ్ శివన్‌తో ప్రేమాయణాన్ని మాత్రం పెళ్లి పట్టాలెక్కించా రని చెన్నై టాక్. నయన-విఘ్నేశ్ సీక్రెట్‌గా పెళ్లి తంతు ముగించారని కోడంబాక్కమ్ భోగట్టా. చెన్నైలోని ఎగ్మూర్ ప్రాంతంలో ఇటీవల నయనతార ఖరీదైన ఇల్లు కొన్నారట. అందులో విఘ్నేశ్‌తో సహజీవనం చేస్తున్నారని టాక్. ఆ మధ్య ఓనమ్ పండగను ఇద్దరూ జాయింట్‌గా జరుపుకున్నారు. అప్పుడు బయటికొచ్చిన ఫొటోల్లో ఇద్దరి మధ్య లవర్స్ కన్నా మించిన కెమిస్ట్రీ ఏదో కనిపించిందని చూసినవాళ్లు అభిప్రాయపడుతున్నారు. సో.. నయన మూడో లవ్‌స్టోరీకి పెళ్లితో శుభం కార్డు పడినట్లేనా? లేక ఆ తంతు ముగియకుండానే ఇద్దరూ సహజీవనం చేస్తున్నారా? సినిమా రంగంలో ఏ రహస్యమూ చాలాకాలం దాగదు కాబట్టి, త్వరలోనే ఈ గుట్టు బయటపడుతుందని ఊహించవచ్చు.