హెచ్ఐవీ బాధితులకు త్వరగా క్షయ
కర్నూలు(హాస్పిటల్): ఇతర రోగుల కంటే హెచ్ఐవీతో బాధపడే వ్యక్తులకు క్షయ(టీబీ) త్వరగా వచ్చే అవకాశం ఉందని ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధులిక చెప్పారు. శనివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఏఆర్టీ సెంటర్లో నేస్తం పాజిటివ్ నెట్వర్క్ విహాన్ సీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెచ్ఐవీ–టీబీ వారోత్సవాల్లో ఆమె మాట్లాడారు. క్షయ వ్యాధి గాలి ద్వారా వ్యాపించే అంటు వ్యాధి అని తెలిపారు. హెచ్ఐవీతో జీవిస్తున్న వారికి ఈ వ్యాధి త్వరగా సోకుతుందన్నారు. క్షయ శరీరంలోని ఏ భాగానికైనా సోకుతుందన్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విహాన్ సీఎస్సీ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ బి. నాగరాజు, ఏఆర్టీ సిబ్బంది పాల్గొన్నారు.