viharam
-
విహారం: ప్రకృతి గీసిన చిత్రం... ఆ వెదురు అడవి!
మనిషిని ప్రకృతి ఆనందపరిచినంతగా మరేదీ ఆనంద పరచలేదు. నేచర్ నెవర్ అవుట్‌డేటెడ్. మనకు తెలిసినవి, మనం చూసినవే మనకు కొత్తగా, అద్భుతంగా కనిపించడం అన్నది ఒక్క ప్రకృతి విషయంలో మాత్రమే జరుగుతుంది. అలాంటి ఓ అద్భుతమైన అనుభూతిని ఇచ్చే ఒక టూర్... అరషియామా, జపాన్. జపాన్.. అంటే మనకెప్పుడూ ఏ ఫోనో, మెషినో గుర్తొస్తుంటుంది. ఆ దేశాన్ని ఎపుడూ మనం ప్రకృతితో పోల్చి ఊహించుకున్న దాఖలాలు లేవు. అలాంటి జపాన్‌లో అక్కడే ఉండిపోవాలనిపించేటంత అందమైన ప్రదేశాలుంటాయంటే అతిశయోక్తి అనుకుంటారు. కానీ, ఒక్కసారి ఫొటోలు చూశాక అక్కడకు వెళాల్సిందే అని ఫిక్సయిపోతారు. అంతటి మనోహరంగా ఉంటుందా ప్రదేశం. వెదురు చెట్లు మనకు కొత్త కాదు, కానీ అవే వెదురు చెట్లను అక్కడ చూడటం మహానుభూతి. అది ఎంత గొప్ప అనుభూతి అంటే అక్కడకు వెళ్లొచ్చాక పర్యాటకులు ఆన్లైన్లలో తమ రివ్యూలు ద్వారా ఆ స్థలం గురించి అభిప్రాయం చెబుతూ యావరేజ్ అన్న వారే లేరంటే అర్థం చేసుకోండి... అందరి నోటా అద్భుతం అనే మాటే వస్తుంది. ఎక్కడ ఉంటుంది? ఈ బాంబూ ఫారెస్ట్ అరషియామా-సగానో ప్రాంతంలో ఉంటుంది. ఇది జపాన్‌లో అత్యంత ఆదరణ పొందిన టూరు. ఈ ప్రాంతం జపాన్‌లోని క్యోటో నగరానికి దగ్గరగానే ఉంటుంది. ఇది దాదాపు వెయ్యేళ్ల క్రితం నుంచే పర్యాటక స్థలంగా వర్ధిల్లుతోంది. ఒక్కో సీజను ఒక్కో అనుభూతిని ఇచ్చే ప్రాంతం ఇది. జపాన్‌లోని ఏ నగరం నుంచైనా ఇక్కడకు టూర్ ప్యాకేజీలు ఉన్నాయంటే ఇది ఎంత ప్రసిద్ధి పొందిన టూరో అర్థం చేసుకోవచ్చు. ఈ పర్యాటక ప్రాంతంలో బాంబూ ఫారెస్ట్‌తో పాటు వెయ్యేళ్ల క్రితం నాటి టొగెట్సుక్యో వంతెన, విభిన్న జాతులకు చెందిన కోతులుండే మంకీ పార్క్, సాగా-టొరిమొటో వీధి (ఇది రెండు వందల ఏళ్ల క్రితం కట్టిన భవనాలు మాత్రమే ఉన్న వీధి), వివిధ ఆలయాలు, సాగా సీనిక్ రైల్వే వంటి వెన్నో ఉన్నాయి. ఇక్కడ ప్రతిదానికీ ప్రత్యేకత ఉంది. టొగెట్స్యుకో వంతెన వెయ్యేళ్ల క్రితం కట్టారు. అప్పటికే ఇది పర్యాటకాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మించారట. అది బాగా శిథిలం కావడంతో నిత్యం జన సందోహం ఉండే ప్రాంతమని 1930 లో దానిని పునర్నిర్మించారు. అంటే కొత్తవంతెనకు కూడా ఎనభై ఏళ్ల చరిత్ర ఉందన్నమాట. ఇక్కడ కొండల్లో ఒక రైల్వే లైన్ ఉంది. అందులో ప్రయాణమే ఒక అనుభూతి. ఆ రైలు మార్గానికి ఒకవైపేమో ఎత్తయిన కొండ అడవులతో నిండి ఉంటుంది. మరో వైపు ఏమో నది ప్రవహిస్తూ ఉంటుంది. ఏదో ఒక అందాన్నే చూడగలం... ఎందుకంటే రెండూ వేర్వేరు వైపు ఉంటాయి కదా. ఇక్కడకు వస్తే కచ్చితంగా ఈ రైలు మార్గంలో పయనించాల్సిందే. ఆకట్టుకునే ఆలయాలు ఇక్కడ ఆలయాల్లో ఆధ్యాత్మికతే కాదు... ఆర్కిటెక్చర్ కూడా ప్రధానమైనదే. ఇక్కడున్న టెన్య్రుజి టెంపుల్ జపాన్‌లో ప్రముఖ జైన దేవాలయం. దీనిని 1339లో కట్టారు. కానీ చాలా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. ఇందులో గార్డెన్లు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కొన్ని వందల ఏళ్ల తర్వాత కూడా చెక్కుచెదరకుండా ఉండటమే కాదు ఈ మధ్యనే కట్టిన గుడి అన్నంత కొత్తగా ఉంటుంది. అందుకే దీనికి యునెస్కో గుర్తింపు దక్కింది. దీంతో ఇది ప్రపంచ పర్యాటకుల దృష్టిలో పడింది. అలాగే ప్రశాంత చిత్తంతో ధ్యానముద్రలో ఉన్న కొన్ని వందల విగ్రహాలుండే ఒతగి టెంపుల్ కచ్చితంగా చూడదగ్గది. ఇంకా ప్రకృతి మధ్య ఒదిగి ఉండే నిసోనిన్ టెంపుల్, గియోజీ టెంపుల్, అదాషినో టెంపుల్, 1596లో కట్టిన జకోజీ టెంపుల్ కనుల విందు చేసే వైవిధ్యమైన నిర్మాణాలతో సుందరంగా, ప్రశాంతంగా ఉంటాయి. ఒక్కసారి ఆ ఫారెస్ట్‌లో అడుగుపెడితే... అరషియామాలో మీరెన్ని చూసినా మీకు గుర్తుండేది, మిగతా అన్నింటినీ మరిపించేలా చేసేది బాంబూ ఫారెస్ట్ మాత్రమే. దానికి ముందు, దాని తర్వాత మీరు జీవిత కాలంలో ఎన్ని పర్యాటక స్థలాలు చూసినా... ఈ బాంబూ ఫారెస్ట్‌ను మాత్రం మరిచిపోరు. అంత ప్రత్యేకత దానిది. అది ఒక అడవిలా కాకుండా కళాఖండంలా కనిపిస్తుంది. స్వర్గానికి ఒక దారిని డిజైన్ చేస్తే అది కచ్చితంగా ఇలాగే చేయాలేమో అనిపించేలా ఉంటుంది ఆ ప్రదేశం. స్కేలు పెట్టి గీచినట్టు ఉండే వెదురు చెట్లు ఏపుగా పచ్చగా పెరిగి ఉంటాయి. వాటి మధ్యలో కొలిచి నిర్మించినట్టు ఉండే వెదురు బొంగుల మెట్ల దారి అలా కట్టిపడేస్తుంది. ఇంకో రూట్లో వెళితే వెదురు పలకలతో నిర్మించిన రోడ్డు. దానిమీద నడుస్తుంటే ఆ ఫీలింగే గొప్పగా ఉంటుంది. వెదురు చెట్లలో కాలిబాటకు అటు ఇటు చిన్న వెదురు కట్టెలతో రెయిలింగ్ చూడటానికి ముచ్చటేస్తుంది. మనోహరంగా పచ్చగా ఉండే ఆ వెదురు చెట్లలో ఒక్కో చోట ఒక్కరకమైన కాలిబాటలు వేశారు. ఒకచోట విశాలంగా వెదురు రోడ్లు, మరో చోట చిన్న కాలిబాటు మెట్లతో కూడిన దారి... ఇంకో చోట రాలిన ఆకుల మామూలు కాలిబాట, ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన రాళ్లతో కూడిన కాలిబాట... అబ్బో ఒకటేమిటి ఎన్నో అందాలు. అలా రోజంతా అక్కడే ఉండి ఉదయం-సాయంత్రం వాకింగ్ చేస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడకు వచ్చి ఫొటో దిగని పర్యాటకుడు ఉండనే ఉండరు. ఎపుడు వెళ్లాలి! జపాన్ టూర్లన్నీ మార్చి-నవంబరు మధ్య వెళ్లడం మంచిది. క్యోటో టూర్ అయితే మే నుంచి వెళ్లడం వల్ల దేశంలో జరిగే ప్రముఖ ఫెస్టివల్స్‌ను చూసే అవకాశం వస్తుంది. ఆగస్టు, సెప్టెంబరులో మూడు ఫెస్టివల్స్ ఉంటాయి. వీటిని కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ కాలంలో వెళితే బెటర్. ఎలా చేరుకోవాలి... ఇంటర్నేషనల్ టూర్స్ అంటే ఫ్లైట్ ఎక్కాల్సిందే. క్యోటో జపాన్ పెద్ద నగరాల్లో ఒకటి అయినా కూడా సొంత విమానాశ్రయం లేదు. వంద కిలోమీటర్ల దూరంలోని కన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడకు చేరుకోవాలి. అసలే జపాన్ టెక్నాలజీలో ముందుండే దేశం. ఇక అక్కడ్నుంచి క్యోటోకి చేరుకోవడానికి ఇబ్బందా చెప్పండి.. అందుకే నిశ్చింతంగా బయలుదేరండి. రోడ్డు, రైలు వంటి అన్ని అత్యాధునిక రవాణా మీకందుబాటులో ఉంటుంది. క్యోటో నుంచి అరషియామాకు కేవలం ఎనిమిది కిలోమీటర్లు. బైకులు, సైకిళ్లు కూడా అద్దెకు దొరుకుతాయి. -
విహారం: వైగన్... మధ్యయుగపు అనుభూతి!
ఆదిత్య 369 సినిమా చూసినపుడల్లా... అలాంటి టైమ్ మెషీన్ ఒకటి అందుబాటులో ఉండి మనకు కూడా అలా ముందుకూ వెనక్కు వెళ్లే అవకాశం కనుక వస్తే ఎంత బావుంటుందో అనిపిస్తుంది. ముందుకు తీసుకెళ్లలేం గాని... టైం మెషీన్ లేకుండానే వెనక్కు వెళ్లే అవకాశాలు మాత్రం ఉన్నాయి. అయితే, షరతులు వర్తిస్తాయి. ఆ అద్భుతం... వైగన్! చక్కటి వీధులు.. గుంతలు లేని, వంకరలు లేని, మరమ్మతులు అవసరం లేని ఫుట్‌పాత్‌లతో కూడిన వీధులు... వాటికి ఇరువైపులా బొమ్మలు గీసినంత అందంగా ఉండే ఇళ్లు. వీధిలో ఇవతలి ఇంటి బాల్కనీ నుంచి అవతలి ఇంటి బాల్కనీలో వ్యక్తులతో ముచ్చట్లు చెప్పుకునేలా ఓ క్రమపద్ధతిలో ఆ నిర్మాణాలు. ఇంటింటికీ అమర్చిన వీధిదీపాలు. భూగర్భ మంచినీటి, మురుగు నీటి పారుదల... కాలికి మట్టి అంటని రోడ్లు. పగలు అద్భుతంగా రాత్రి సుందరంగా ఉంటుంది ఆ చిన్న నగరం. వైగన్ నగరం... వైశాల్యంలో జనాభాలో చిన్నదే. పేరులో, ఖ్యాతిలో పెద్దది. జనాభా యాభై వేలు, విస్తీర్ణం 25 చదరపు కిలోమీటర్లు. (మన హైదరాబాదు 700 చదరపు కిలోమీటర్లు కాబట్టి అది ఎంత ఉంటుందో మీరే ఊహించుకోండి). వైగన్ ఫిలిప్పీన్స్ దేశంలో పశ్చిమోత్తరాన ఉంటుంది. దక్షిణ చైనా సముద్రానికి ఎదురుగా ఉండే ఇలాకోస్ సర్ దీవిలో తీరానికి దగ్గరగా ఉంటుంది. ఏ నగరానికి లేని అవకాశం నగరం చిన్నదే గాని విశిష్టతలు బోలెడు. పెద్ద దీవిలో ఒక చిన్న దీవి ఈ నగరం. బహుశా చాలా పెద్ద నగరాలకు కూడా లేని ఒక అద్భుతమైన అవకాశం ఈ బుల్లి నగరానికి దక్కింది. కేవలం ఇరవై ఐదు చదరపు కిలోమీటర్ల ఈ నగరానికి నలువైపులా మూడు నదులున్నాయి. అవి కూడా జీవనదులు. ఏడాదిలో 365 రోజులూ ప్రవహిస్తుంటాయి. అంతేనా... ఇంకో అద్భుతం కూడా ఉంది. నగరం నుంచి సైకిల్‌పై వెళ్లగలిగినంత దూరంలో సముద్ర తీరం ఉంది. అది దక్షిణ చైనా సముద్ర తీరం. కళ్ల ముందు మధ్యయుగపు జాడలు ఫిలిప్పీన్స్‌లోని ఈ ప్రాంతాన్ని పదహారో శతాబ్దంలో స్పానిష్‌లు పరిపాలించారు. దీంతో ఇక్కడ భవనాలు యూరోపియన్ ఆర్కిటెక్చర్‌తో ఉంటాయి. అంతేకాదు... ఇది అత్యుత్తమ ప్రణాళికతో నిర్మించిన నగరం. అందుకే వీధులు అయినా, ఇళ్లయినా చాలా చక్కగా అందంగా రూపుదిద్దబడ్డాయి. ఈ ఊళ్లో ప్రతి కట్టడానికి వందేళ్ల నుంచి ఐదువందల సంవత్సరాల చరిత్ర ఉంటుంది. అంటే... ఆధునిక ఆర్సీసీ బిల్డింగులు, వోల్వో బస్సులు ఇలాంటివేవీ ఇక్కడ కనపడవు. టక్ టక్ మని తిరిగే గుర్రపు బగ్గీలు... మన వద్ద కూడా కనిపించకుండా పోయిన మరమగ్గాలు సైతం ఉన్నాయి. అవి సజీవంగా, చక్కటి ఆదాయంతో నడుస్తున్నాయి. వీధుల్లో రోడ్లన్నీ సిమెంటు, బ్లాక్ టాప్ రోడ్లు కాదు. మధ్యయుగాల నాటి రాతి రోడ్లు. విద్యుద్దీపాలు కూడా అప్పటి మోడల్లోనే ఉంటాయి. పాత భవనాలు కదా అని పాడైపోయిన స్థితిలో ఉంటాయనుకునేరు. ఇప్పటికీ ఫ్రెష్‌గా చక్కటి నిర్వహణతో హాయిగా జీవించడానికి అనువుగా ఉంటాయి. అందుకే ఈ విశిష్టమైన నగరాన్ని యునెస్కో ‘ప్రపంచ వారసత్వపు ప్రదేశం’గా గుర్తించింది. చిన్న నగరం బోలెడు విశిష్టతలు ! శివారులను కూడా కలిపి ఈ నగరాన్ని ఓ జిల్లా కేంద్రం చేశారు. ఈ జిల్లాకు రెండే రెండు ప్రధాన ఆదాయ వనరులు. ఒకటి పర్యాటకం. రెండు వ్యవసాయం. పుష్కలమైన నదీజలాలతో 1400 హెక్టార్ల భూమిలో ఇక్కడ వ్యవసాయం కొనసాగుతోంది. దీనివల్ల ఇక్కడి ప్రజలకు అందుబాటులోనే వ్యవసాయ ఉత్పత్తులు దొరుకుతాయి. అంటే ప్రాంతం చిన్నదైనా స్వావలంబన కలిగినది. చూడదగ్గ ప్రదేశాలు.. నగరం పక్కనే అడవి. సహజసిద్ధంగా ఏర్పడిన రాళ్లే బెంచీలు. ఏపుగా పెరిగిన వెదురు చెట్లు, మనం మరెక్కడా చూడని చిన్నచిన్న కొత్త రకం మొక్కలు వంటివన్నీ కనిపిస్తాయి. స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఆ చిట్టడవిలో నడుస్తూ ఉంటే బాగుంటుంది. ఇంకా నగరంలో ప్రవేశ రుసుము లేని ఓ జంతు ప్రదర్శన శాల కూడా ఉంది. ఇందులో అంతరించిన రాకాసి బల్లులు ఇంకా బతికున్నాయా అన్న అనుమానం వచ్చేంతటి సహజంగా చెక్కిన రాకాసి బల్లుల బొమ్మలు ఆహ్వానం పలుకుతాయి. అక్కడ స్థానికంగా పేరు గాంచిన కొన్ని జంతువులను చూడొచ్చు. వైగన్లోని కొన్ని వీధుల్లో ఖలీసా రైడ్ (గర్రపు బగ్గీ) బాగుంటుంది. గంటన్నర ప్రయాణానికి 150 పెసోలు (ఆ దేశపు కరెన్సీ అడుగుతారు. అంటే మన కరెన్సీలో 210 రూపాయిలు. వీరికి ఇంగ్లిష్ రాదు. ఇంకా వైగన్ కాథడ్రల్, బాంటే చర్చి, సిఖియా ప్రదర్శన శాల, క్రిసోలోగో మ్యూజియం, మధ్యయుగం నాటి మట్టి కుండలు తయారుచేసే కుటీర పరిశ్రమలు, మరమగ్గాల నేతపని, బర్గోస్ నేషనల్ మ్యూజియం వంటివి చాలా ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. బీచ్ కూడా చాలా దగ్గర. ఒక్కే ఒక్క డిస్కో క్లబ్ మినహా నైట్ లైఫ్ ఉండదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. నమ్మకమైన మనుషులు. మోసాలు తక్కువ. దాదాపు అన్ని దేశాల వారు తినదగిన రుచికరమైన తిండి దొరుకుతుంది. ఎలా చేరుకోవాలి ఈ చిన్నసిటీకి దగ్గర్లో ఒక ఎయిర్పోర్ట్ కూడా ఉందండోయ్. గతంలో ప్రైవేటుగా వాడేవారు కానీ.. ఇపుడు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అయ్యింది. అయితే ఇంకా వైగన్ ఎయిర్‌పోర్టుకు మాత్రం ఇపుడు ఫ్లైట్లు కావల్సినన్ని నడవడం లేదు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా నుంచి ట్యాక్సీలో తొమ్మిది గంటలు ప్రయాణిస్తే ఇక్కడికి చేరుకోవచ్చు. లేదా మనీలా నుంచి లావోగ్కు విమానంలో వెళితే అక్కడి నుంచి గంటన్నర ట్యాక్సీ ప్రయాణం. అక్కడ మీరు దిగే హోటల్స్ కూడా పురాతన భవనాలే. కానీ ఇబ్బందేమీ ఉండదు. అన్ని సదుపాయాలు ఉంటాయి. -
విహారం: భీమ్తాల్- ఇతిహాసకాలంలో విహారం
కుమావ్ పర్వతశ్రేణుల మధ్య విశాలమైన సరస్సు. ఆ సరస్సు మధ్యలో చిన్న దీవి. సరస్సు ఒడ్డున ఉన్న పురాతనమైన శివాలయం. పేరు భీమేశ్వర మహదేవ్ ఆలయం. ఇది స్వయానా పాండవ మధ్యముడు కట్టిన ఆలయం. అందుకే ఈ ఆలయానికి భీమేశ్వర ఆలయం అని, ఈ సరస్సుకు భీమ్తాల్ అని భీముడి పేరుతో వాడుకలోకి వచ్చాయి. తాల్ అంటే సరస్సు అని అర్థం. భీమేశ్వర ఆలయ నిర్మాణశైలిని చూస్తే... క్రీస్తుపూర్వం వేలాది ఏళ్ల కిందట కూడా ఇలా నిర్మించేవారా అనే సందేహం కలగడం సహజమే. ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో ఈ ప్రదేశాన్ని పాలించిన చాంద్ వంశీయుడు బాజ్ బహదూర్ పునర్నిర్మించాడు. కుమావ్ పర్వతశ్రేణుల మధ్య ఉన్న ఈ అటవీ ప్రదేశం పాండవులు వనవాసం చేసినప్పుడు సంచరించిన నేల. క్రీ.పూ. వేల ఏళ్ల నాటి మానవ సంచారాన్ని, జీవనశైలిని అధ్యయనం చేయడానికి ఆర్కియాలజీ నిపుణులు తరచూ ఇక్కడ పర్యటిస్తుంటారు. ఇప్పుడు ఈ దారులన్నీ ట్రెకింగ్ చేయాలనుకునే వాళ్లకి మార్గదర్శనాలు. ఇక్కడ ట్రెకింగ్ క్యాంపులు కూడా ఎక్కువే. మౌంటెయిన్ రూట్లో ట్రెకింగ్ సాహసోపేతమే అయినా ఉద్వేగంతో ఒళ్లు పులకించిపోతుంది. భీమ్తాల్ పట్టణంలో నేషనల్ కోల్డ్‌వాటర్ ఫిషరీస్ ఇన్స్టిట్యూట్ను చూసినప్పుడు తప్ప... ఇంత చల్లటి వాతావరణంలో కూడా సరస్సుల్లో చేపలుంటాయనే ఆలోచన రానేరాదు. ఫోక్ కల్చరల్ మ్యూజియంలోకి వెళ్తే జానపద సినిమా సెట్టింగులో అడుగుపెట్టినట్లు ఉంటుంది. షోదశ మహా జనపదాల నాటి జీవనశైలిని ప్రతిబింబిస్తుంటాయి ఇక్కడి హస్త కళాకృతులు. పట్టణానికి కనుచూపు మేరలో ఉన్న సాత్విక్ సదన్ వైపు అడుగులు వేస్తే భారతీయులతోపాటు యోగవిద్యను, వేద తత్వాన్ని అభ్యసిస్తున్న పాశ్చాత్యులు కనిపిస్తారు. భీమేశ్వర ఆలయానికి దగ్గరలోనే ఉన్న చిన్న కొండ పేరు గర్గ్ పర్వత్. గర్గి నది పుట్టింది ఈ కొండమీదనే. ఇక్కడ దాహం తీర్చే గంగామాత ఈ నదే. భీమ్తాల్ సరస్సుకు ఒక చివరగా డ్యామ్ ఉంది. సరస్సు మధ్యలో చిన్న దీవి ఉంది. సరస్సులో బోట్ షికారు అంటే ఈ దీవి చుట్టూ తిప్పుతారు. భీమ్తాల్ నుంచి రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే దమయంతి తాల్ వస్తుంది. ఇక్కడ నలమహారాజు మందిరం ఉండేదని, ప్రకృతి వైపరీత్యాలకు ఆ మందిరం కాస్తా మునిగిపోయిందని చెబుతారు. మరో మూడు కిలోమీటర్లు వెళ్తే సాత్ తాల్కి చేరుతాం. ప్రకృతి ప్రేమికులను ఆకర్షించే ప్రదేశం ఇది. సముద్రమట్టానికి దాదాపుగా పద్నాలుగు వందల మీటర్ల ఎత్తులో పచ్చటి దట్టమైన అడవుల మధ్య స్వచ్ఛమైన నీటి సరస్సుల నిలయం ఇది. సాత్తాల్ అంటే ఏడు సరస్సుల సమూహం. రెండు సరస్సులు ఇంకిపోగా ఇప్పుడు ఐదు సరస్సులు మాత్రమే ఉన్నాయి. ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉండే ఈ ప్రదేశంలో పక్షుల కువకువలు తప్ప ఏ ఇతర శబ్దాలూ వినిపించవు. పర్యాటకులు పడవ విహారంలో, చేపలు పట్టడంలో నిమగ్నమై ఉంటారు. సాత్తాల్ పక్కనే ఉన్న కొండ హిడింబ పర్వత్. భీముడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు హిడింబాసురుణ్ని సంహరించి, అతడి చెల్లెలు హిడింబిని వివాహమాడినట్లు చదివిన పౌరాణిక కథలకు ఆనవాలుగా ఉంటుంది. ఇప్పుడీ కొండ మీద ఆశ్రమంలో వన్క్షాంది మహరాజ్ అనే సాధువు నివసిస్తున్నాడు. ఇది వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం కూడ. ఇక్కడికి దగ్గరలోని కర్కోటక పర్వత్ మీద ఉన్న ఆలయంలోని నాగదేవుడిని కర్కోటక మహారాజ్‌గా కొలుస్తారు. భీమ్‌తాల్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో నౌకుచియాతాల్ ఉంది. తొమ్మిది భుజాల సరస్సు ఇది. పర్యాటకులు ఉన్నప్పటికీ హడావిడి తక్కువ. బోటింగ్ ఎంజాయ్ చేసేవాళ్లు ఇక్కడికి వస్తారు. భీమ్తాల్ నుంచి 22 కి.మీ.లు వెళ్తే నైనితాల్ వస్తుంది. ఎనభైల నాటి సినిమాల ద్వారా ఈ ప్రదేశం మనకు పరిచయమే. పెళ్లయి కుటుంబం ఉన్న హీరో ఆఫీసు పని మీద నైనితాల్‌కు క్యాంపుకెళ్లడం, అక్కడ ఆపదలో ఉన్న యువతికి సాయం చేయడం... వంటి సన్నివేశాలు ఉండేవి. ఆ సినిమాల్లో... కొండలు, లోయల మయంగా ఉన్న ప్రదేశంలో ఇళ్లు అక్కడక్కడా విసిరేసినట్లు ఉండేవి. మగవాళ్లు తలకు మంకీక్యాప్, మెడకు స్టోల్ చుట్టుకుని, స్వెట్టర్ ధరించి, మహిళలు భుజాల చుట్టూ షాల్ చుట్టుకుని కనిపించేవారు. ఈ సీన్లు చల్లటి వాతావరణాన్ని ప్రతిబింబించేవి. ఈ ప్రదేశానికి నైనితాల్ అనే పేరు ఎలా వచ్చిందీ అంటే... దక్షయజ్ఞం సమయంలో దక్షప్రజాపతి చేసిన అవమానానికి దహించుకుపోయిన సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకుని పిచ్చివాడిలా సంచరిస్తుంటాడు పరమశివుడు. అప్పుడు సతీదేవి కన్ను పడిన ప్రదేశమే నైనితాల్. అప్పటి వరకు ఈ సరస్సును అత్రి, పులస్త్య, పులహ రుషుల పేరుతో త్రిరుషి తాల్ అనేవారు. భీమ్తాల్, సాత్తాల్, నైనితాల్, నౌకుచియాతాల్, దమయంతి తాల్... ఇవన్నీ ఉన్న కుమావ్ పర్వతశ్రేణులు ప్రకృతి సౌందర్యానికి నిలయాలు. పచ్చదనాన్ని, సహజత్వాన్ని ఆస్వాదిస్తూ పర్వతాల మీదకు నడిచి వెళ్లి, రాత్రికి అక్కడే బస చేసి నిర్మలాకాశంలో కనిపించే చుక్కలను చూస్తూ గడపడం అనిర్వచనీయమైన అనుభూతి. ఈ కొండల్లో యువకులు రాక్‌క్లైంబింగ్ సాహసం కూడా చేయవచ్చు. పెద్దవాళ్లు దేవాలయాలు పూజలు చేసుకోవచ్చు. ఔషధాలకు పుట్టిల్లయిన భారతదేశంలో ప్రతిచెట్టూ మనిషికి స్వస్థత కలిగిస్తూ తన బాధ్యతను మౌనంగా నిర్వర్తిస్తుంది. పెట్రోల్ పొగతో ఆకాశం కనిపించని నగరాల నుంచి ఓ వారం రోజులు బయటకు వచ్చి... మంచు కప్పుకున్న కొండలకు, మబ్బుల మాటున కనిపించే ఆకాశానికి మధ్య విహరించడం ఆహ్లాదకరం మాత్రమే కాదు ఆరోగ్యకరం కూడ. ఎక్కడ ఉంది? భీమ్తాల్ ఉత్తరాఖండ్ రాష్ట్రం, నైనితాల్ జిల్లాలో ఉంది. జిల్లా కేంద్రానికి 22 కి.మీ.లదూరాన సముద్రమట్టానికి 1,370 మీటర్ల ఎత్తులో ఉంది. ఎప్పుడు వెళ్లవచ్చు? వర్షాకాలం మినహాయించి ఎప్పుడైనా వెళ్లవచ్చు. శీతాకాలంలో ఇక్కడ చలితీవ్రత ఎక్కువ, టూరిస్టులకు అన్ సీజన్. ఈ సమయంలో హోటళ్లలో గది అద్దె తక్కువ, గదులు సులభంగా దొరుకుతాయి కూడ. ఎలా వెళ్లాలి? సమీప విమానాశ్రయం... పంత్నగర్, ఇక్కడి నుంచి భీమ్‌తాల్‌కి 60 కి.మీ.లు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి భీమ్‌తాల్‌కి 300 కి.మీ.లు. ఇక్కడి నుంచి రైలు లేదా రోడ్డుమార్గాన వెళ్లవచ్చు. సమీప రైల్వే స్టేషన్... కత్‌గోదామ్ స్టేషన్, ఇక్కడి నుంచి భీమ్‌తాల్‌కి ఇరవై కిలోమీటర్లు. ఎక్కడ ఉండాలి? శిఖా ఇన్ రిసార్టు, మౌంటెయిన్ క్లబ్ రిసార్టు, కంట్రీ ఇన్, నైని రిట్రీట్ వంటి విలాసవంతమైన హోటళ్లలో ఒక రోజుకు గది అద్దె దాదాపుగా ఐదు వేలు. వీటిలో బ్రేక్‌ఫాస్ట్ ఉచితం. ‘హోటల్ న్యూ భారత్‌లో ఒక రోజు అద్దె తొమ్మిది వందలు, ‘హోటల్ లేక్ ఇన్’లో 1,400 రూపాయలు. భోజనం ఎలా? సదరన్ డిలైట్‌లో దక్షిణాది వంటకాలు ఉంటాయి. ‘గ్రావిటీ బై ద లేక్’రెస్టారెంటు నుంచి సరస్సు వ్యూ అందంగా ఉంటుంది. అందుకోసమే పర్యాటకులు ఇక్కడ ఒక్క భోజనమైనా చేయాలని ఉత్సాహపడుతుంటారు. ఇటలీరుచుల కోసం ‘ఇటాలియానో’ రెస్టారెంట్‌కెళ్లాలి. వాతావరణం? భీమ్‌తాల్‌లో ఉష్ణోగ్రతలు వేసవిలో 15-28 డిగ్రీల మధ్య, శీతాకాలంలో 4-8 డిగ్రీల మధ్య ఉంటాయి. ఏమేం తీసుకెళ్లాలి? ఎగుడుదిగుడు నేల మీద కూడా సౌకర్యంగా నడవడానికి వీలుగా ఉండే షూస్ తీసుకెళ్లాలి. వాతావరణం మారినప్పుడు ఎదురయ్యే జలుబు, అజీర్తి, విరేచనాలు, జ్వరం వంటి సాధారణ అరోగ్య సమస్యలకు మందులు తీసుకెళ్లాలి. వేసవిలో ఒక స్వెటర్, శీతాకాలం అయితే హెవీ ఉలెన్ జాకెట్, మఫ్లర్, క్యాప్ కూడా ఉండాలి. ఏమేమి కొనుక్కోవచ్చు! భీమ్తాల్ పట్టణం నడిబొడ్డున మాల్ రోడ్డు ఉంది. ఇది హస్తకళలకు ప్రసిద్ధి. ఇక్కడ చేతితో తయారు చేసిన కొవ్వొత్తులు, పూసల ఆభరణాలు దొరుకుతాయి. తివాచీలు, దారుకళాకృతులు, చేతిలో ఇమిడిపోయే చిన్న విగ్రహాలు, గర్వాలీ స్టైల్ చిత్రలేఖనాలు ఉంటాయి.