బతుకు నావ సాగక చావుకు ఎదురీత
సాక్షి ప్రతినిధి, విజయనరం : ఉన్న ఊరిలో ఉపాధి దొరక్క... ప్రకృతి ప్రకోపానికి పంటలు పండక... ఆదుకోవాల్సిన అధికారులు చేష్టలుడిగి చూసిన వేళ... అగమ్యగోచరంగా ఉన్న బతుకులకు వలసలే శరణ్యం. జిల్లా వాసు లు కూడా పూట గడవడానికి జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల సరిహద్దులను దాటి చావుకు ఎదురు వెళ్తున్నారు. భార్యాభర్త లు ఒకచోట, పిల్లలు మరొక చోట ఉంటున్నారు. కన్నవారి ప్రేమకు పిల్లలు దూరమవుతున్నారు. పిల్లల ఆలనాపాలనను పండుటాకులకు అప్పగిస్తున్నారు. అలాగ ని వారంతా సుఖంగా ఉంటున్నారా అంటే అదీ లేదు. పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్లిన వారికి చివరికి వేదనే మిగులుతోంది.
ఇళ్లు వదిలి సంవత్సరాల తరబడి వలస జీవితం గడుపుతున్న కుటుంబాల్లో ఎప్పుడు ఏ విషాదం చోటు చేసుకుంటుం దో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం జిల్లాలో ఏ పల్లెకెళ్లినా ఇవే దృశ్యాలు కన్పిస్తున్నా యి. వలసల్లేని గ్రామాలు మచ్చుకైనా కన్పించడం లేదు. ప్రతి గ్రామంలో సరాసరి 50 కుటుంబాలు జిల్లా సరిహద్దులుదాటి బతుకుబండిని ఈడుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రమాదాలకు గురై పెద్ద దిక్కును కోల్పోతున్నాయి. ఆ జీవితాలు ఛిద్రమైపోతున్నాయి. ఇందుకు చెన్నై భవన కూలి ఘటననే తీసుకోవచ్చు. అనుకోని ప్రమాదంలో జిల్లాకు చెందిన 24 మంది ప్రాణాలను కోల్పోయారు. దీంతో ఆ పల్లెలు గొల్లుమన్నాయి. ఊళ్లకు ఊళ్లు కన్నీటి పర్యంతమయ్యాయి.
అనధికారిక లెక్కల ప్రకారం జిల్లా నుంచి సుమారు నాలుగు లక్షల మంది ప్రతి ఏటా వలస వెళ్తున్నారు.
స్థానికంగా పనుల్లేకపోవడంతో విశాఖ, తూర్పుగోదావరి, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్‌తో పాటు తమిళనాడు రాష్ట్రాలకు వలస బాట పడుతున్నారు. కొందరైతే గల్ఫ్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, బర్మా వంటి దేశాలకు వలస పోతున్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాలు, జిల్లాల్లో ఎవరైనా మరణించారంటే వారంతా ఉపాధికి వెళ్లిన వారే అని నిర్ధారించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికంతటికీ ఉన్న ఊరిలో ఉపాధి దొరక్కపోవడం, జీవనాధారమైన వ్యవసాయం సాగకపోవడమే కారణమని కచ్చితంగా చెప్పవచ్చు.
ఈ పరిస్థితుల్ని నియంత్రించే ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసినా ప్రయోజనం ఒనగూరడం లేదు. చట్టంలో ఉన్న నిబంధనలతో ఆ పథకం ప్రయోజనమివ్వలేకపోతోంది.ఒక కుటుంబానికి 100 రోజులు మాత్రమే పని కల్పించాలన్న షరతు పెద్ద ప్రతిబంధకంగా మారింది. 100 రోజులు పని చూపించి, మిగతా 265 రోజులు ఏం చేయాలంటూ ప్రశ్నించే పరిస్థితి ఎదురైంది. ఇక చట్టంలో చెబుతున్న 100 రోజుల పనిదినాలు కూడా కల్పించని పరిస్థితులు జిల్లాలో చాలాచోట్ల ఉన్నాయి.ఒక్క 2013-14 ఆర్థిక సంవత్సరాన్ని తీసుకుంటే 3.37లక్షల కుటుంబాల్లో కేవలం 1.23 లక్షల కుటుంబాలకు మాత్రమే 100 రోజుల పనిదినాలు కల్పించారు. అంతకుముందు 2012-13లో లక్షా 23వేల 815 కుటుంబాలకు. 2011-12లో లక్షా 23వేల 776 కుటుంబాలకు, 2010-11లో 92,851 కుటుంబాలకు మాత్రమే 100రోజుల ఉపాధి దొరికింది. ఈ లెక్కను గమనిస్తే మిగతా వారంతా మిగతా రోజుల్లో ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వ్యవ‘సాయం’లేదు
మిగతా 265 రోజుల్లో వ్యవసాయ, ఇతరత్రా ఉపాధి పనులు దొరుకుతాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ పరిస్థితులు ఆ విధంగా లేవు. గత నాలుగేళ్లుగా చూసుకుంటే ఒకవైపు కరువు, మరోవైపు ముంపుతో ఏ ఏడాదీ పంటలు సరిగా పండిన దాఖల్లాలేవు. దీంతో వ్యవసాయ పనులు పరిమితమైపోయాయి. ఈ నేపథ్యంలో ఇళ్లు గడవక అనేక కుటుంబాలు రోజుల తరబడి పస్తులుండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నాళ్లీ బతుకులని పిల్లల్ని వదిలి, జిల్లా సరిహద్దులు దాటి కూలి పనుల కోసం లక్షలాది మంది వలసపోవాల్సిన దుస్థితి ఎదురవుతోంది. ఇలా వెళ్లే అనేక మంది మృత్యువాత పడుతున్నారు. అందుకు తాజా ఉదాహారణ చెన్నై భవన కూలిన ఘటనే.
ఈ ప్రమాదంలో దత్తిరాజేరు మండలం కె.కృష్ణాపురానికి చెందిన ఏడుగురు, బాడంగికి చెందిన ఇద్దరు, మక్కువ మండలం తూరుమామిడికి చెందిన ముగ్గురు, పెద గైశీలకు చెందిన ముగ్గురు, కొమరాడ మండలం దళాయిపేటకు చెందిన ముగ్గురు, మాదలింగికి చెందిన ఒకరు, జియ్యమ్మవలస మండలం నీలమాంబపురానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ఇప్పుడా కుటుంబాలన్నీ దిక్కులేనివయ్యాయి. ఆదుకోవాల్సిన పెద్ద దిక్కును కోల్పోవడంతో భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పుడా పల్లెలన్నీ విషాదంతోనే ఉన్నాయి. ప్రమాదంలో బయటపడి గ్రామానికొచ్చిన వారికి ఇంకా అవే దృశ్యాలు వెంటాడుతున్నాయి. కళ్లముందే భవనం కూలిపోవడం, ఆత్మీయులు, అయినవారు సజీవసమాధి చెందిన ఘటనలు గుండెలను మెలేస్తున్నాయి. ఘటన జరిగిన పక్షం రోజులు దాటుతున్నా ఆ గ్రామాలు ఇంకా శోకసంద్రంలో ఉన్నాయి.