సాగర్మాత ఘాట్ వద్ద యువతి మృతదేహం
విజయపురి (సౌత్) : గుంటూరు జిల్లా విజయపురి సౌత్ స్థానిక సాగర్మాత దేవాలయం ఘాట్ వద్ద మంగళవారం ఓ యువతి(24)మృతదేహం లభ్యమైంది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం రాత్రి 7గంటల సమయంలో ఓ యువతి హడావుడిగా సాగర్మాత ఘాట్ మెట్లు దిగుతూ కృష్ణా జలాశయం వద్దకు వెళ్తుండగా.. అదే సమయంలో ముగ్గురు భక్తులు జలాశయంలో స్నానం చేసి తిరిగి వస్తున్నారు. యువతిని గమనించిన ఆ వ్యక్తులు ఈ సమయంలో నది వద్దకు ఎందుకు వెళ్తున్నావని ప్రశ్నించారు. ఆ యువతి ఆగకుండానే జలాశయం చూసేందుకు వెళ్తున్నానంటూ వెళ్ళిపోయింది. కాగా ఆ వ్యక్తులు గుడి వద్దకు వెళ్లి వాచ్మెన్, సెక్యూరిటి సిబ్బందికి సమాచారం అందించారు.
వెంటనే వారు హుటాహుటిన టార్చ్‌లైట్స్‌ను తీసుకొని జలాశయం ఒడ్డున వెతికినా ఆ యువతి జాడ తెలియలేదు. కాగా మంగళవారం ఉదయం ఘాట్ సమీపంలో మృతదేహం బయటపడింది. నది ఒడ్డున యువతికి సంబంధించిన నల్లటి హ్యాండ్‌బ్యాగ్, లంచ్‌బాక్స్ ఉన్నాయి. బ్యాగ్‌లో హైదరాబాద్ బిహెచ్ఇఎల్ ఆర్టీసీ డిపోకు చెందిన స్టూడెంట్ బస్‌పాస్ ఉంది. ఆ బస్‌పాస్ సౌజన్య అనే పేరు మీద ఉంది. బస్‌పాస్ మీద ఉన్న సెల్‌ఫోన్ నెంబర్, అడ్రస్‌ఫ్రూఫ్‌ను విజయపురి సౌత్ పోలీసులు విచారించగా డి కోటేశ్వరావు, హౌస్‌నెంబర్18-92/1 వెంగళాయపాలెం, గుంటూరు, గుంటూరు జిల్లా పేరు మీద తీసుకున్నట్లు ఉంది. అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా ఉన్నాయి. బహుశా ఆ ఫోటోలు ఆ అమ్మాయివే అయ్యి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.
ఇంకా ఆ బ్యాగ్‌లో కూకట్పల్లి కల్వరిగిరి టెంపుల్ తాత్కాలిక సభ్యత్వ నెంబర్ జె4108 రాసి ఉంది. పోలీసులు కార్డు మీద ఉన్న నెంబర్ ఆధారంగా కల్వరిగిరికి ఫోన్ చేయగా సభ్యత్వ నమోదులో బిహెచ్ఈఎల్, చందనానగర్ అని మాత్రమే ఉందని చెప్పారు. యువతి ఒంటి మీద ఎరుపు, నలుపు రంగుల పంజాబీ డ్రస్ ఉంది. గుంటూరు జిల్లాలోని రెంటచింతల మండలానికి చెందిన యువతి అయ్యి ఉండవచ్చని పోలీసులకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కాగా మృతదేహాన్ని సాగర్ కమలా నెహ్రూ ఆసుపత్రికి తరలించారు. విజయపురి సౌత్ ఎస్ఐ వై.కోటేశ్వరావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.