విజయరాఘవ పిటిషన్పై సీబీఐ అభ్యంతరం
ఎమ్మార్ కేసులో నింతునిగా ఉన్న ఎమ్మార్ ఎంజీఎఫ్ దక్షిణ భారత ఇన్చార్జ్ విజయరాఘవ ఢిల్లీతోపాటు ఇతర ప్రాంతాల్లోని ఎమ్మార్ ఎంజీఎఫ్ కార్యాలయాలకు వెళ్లేందుకు వీలుగా ఈనెల 25 నుంచి అక్టోబరు 25 వరకు తన బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ విజయరాఘవ దాఖలు చేసుకున్న పిటిషన్పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఎమ్మార్ ఎంజీఎఫ్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోనే ఉందని, ఈ కేసులో సాక్ష్యులుగా ఉన్న వారంతా కంపెనీ ఉద్యోగులేనని తెలిపింది. ఈ నేపథ్యంలో విజయరాఘవ సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంది. తన బెయిల్ షరతులు సడిలించాలని కోరుతూ విజయరాఘవ దాఖలు చేసుకున్న పిటిషన్ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్రావు సోమవారం విచారించారు.
ఢిల్లీకి వెళ్లేందుకు సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బెంగుళూరు, చెన్నై, కోయంబత్తూరు, కొచ్చి, ముంబాయి వెళ్లేందుకైనా అనుమతించాలని విజయరాఘవ తరఫు న్యాయవాది నివేదించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని మంగళవారానికి వాయిదా వేశారు.