vijayawada city Police
-
రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా..
సాక్షి, విజయవాడ: రౌడీషీటర్ల కదలికలపై నగర పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కమిషనరేట్ పరిధిలో 476 మంది రౌడీషీటర్లు, 500 మంది సస్పెట్స్ షీటర్లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్లలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. తుపాకులు, మారణాయుధాలతో రౌడీషీటర్ కొక్కొలగడ్డ జాన్ బాబు పట్టుబడటంతో పెనమలూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. స్టేషన్ పరిధిలో నేర ప్రవృత్తి కల్గిన 140 మందిని సమావేశపరిచి సీఐ సత్యనారాయణ హెచ్చరించారు. దందాలు, సెటిల్మెంట్లు చేస్తే పిడీ యాక్టులు పెట్టి నగర బహిష్కరణ చేస్తామన్నారు. గంజాయి అమ్మకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రతిఒక్కరి పై సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా ఏర్పాటు చేశామని, చిన్న తప్పు చేసినా పట్టేస్తామన్నారు. సత్ప్రవర్తనతో మెలిగితే రౌడీషీట్స్ తొలగించే అవకాశం కూడా ఉందన్నారు. ప్రజా జీవనానికి విఘాతం కల్గిస్తే జైలు జీవితం తప్పదని సీఐ సత్యనారాయణ హెచ్చరించారు. -
అర్ధరాత్రి పోలీసుల అత్యుత్సాహం
భక్తులపై పోలీసుల ప్రతాపం ఎదురు తిరిగిన భక్తులు అడుగడుగునా అంక్షలు.. విజయవాడ (వన్‌టౌన్/ఇంద్రకీలాద్రి) : దసరా ఉత్సవాల్లో భాగంగా పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అత్యుత్సాహం ప్రదర్శించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తే తమపై దౌర్జన్యం ఎమిటని భక్తులు ఎదురుతిరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ‘పోలీసులు డౌన్.. డౌన్..’ అంటూ భక్తులు నినాదాలు చేశారు. శనివారం సరస్వతీదేవి అలంకారంలో కొలువుదీరే దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలోనే ఘాట్‌రోడ్డులోని క్యూలైన్లలోకి చేరారు. గతంలో దర్శనానంతరం భక్తులను మెట్ల మార్గం ద్వారా దిగువకు పంపేవారు. ఈసారి ఘాట్‌రోడ్డు నుంచే కిందకు పంపడంతో దర్శనం చేసుకుని వెళ్తున్న కొంతమంది కూడా మళ్లీ క్యూలైన్లలో చేరారు. రాత్రి 11.45 గంటలకు ఘాట్‌రోడ్డులోని క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. సుమారు ఎనిమిది వేల మంది భక్తులు ఉన్నారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు క్యూలైన్లలో ఉన్న భక్తులను ఖాళీ చేయించడం ప్రారంభించారు. భక్తులు అభ్యంతరం తెలపడంతో పోలీసులు తమ స్టేషన్లో మాదిరిగా మాట్లాడారు. మనస్తాపానికి గురైన పలువురు భక్తులు తాము దొంగలం కాదని అక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ఆయన వెంటనే వ్యాన్లు తీసుకొచ్చి అందరినీ ఎక్కించండి.. అని సిబ్బందిని ఆదేశించారు. తన వద్ద ఉన్న ఫోన్లో భక్తులను వీడియో తీశారు. ఈ క్రమంలో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏసీపీ అక్కడకు చేరుకుని భక్తులను బలవంతంగా బయటకు పంపాలని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు మరింత రెచ్చిపోయారు. ఘాట్‌రోడ్డులోని సగం క్యూలైన్లు ఖాళీ చేసిన తర్వాత టోల్గేట్ వద్ద భక్తుల రద్దీ పెరిగిపోయింది. దీంతో ఘాట్‌రోడ్డులో ఉన్న వారిని క్యూలైన్లలోకి పంపించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు పోలీసులు వారిని క్యూలైన్లలోకి పంపారు. అంతరాలయం వద్దకు కూడా భార్యాభర్తలపై ఓ సీఐ దుర్భాషలాడారు. సిబ్బందికి సైతం చుక్కలు చూపించారు భక్తులకే కాకుండా ఆలయ సిబ్బందికి సైతం పోలీసులు చుక్కలు చూపించారు. అర్ధరాత్రి ఎక్కువగా ఉన్న రద్దీ ఉదయం 6 గంటల కల్లా రద్దీ సాధారణంగా మారింది. మరో వైపున వర్షం కురియడంతో భక్తుల రద్దీ మరింత తగ్గినప్పటికీ పోలీసులు బందోబస్తును సడలించలేదు. కుమ్మరిపాలెం, ఇటు వినాయకుడి గుడి, అశోక స్తూపం వద్ద రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టి ఎవరినీ అనుమతించలేదు. ఉదయం 7గంటలకు కొండపై విధులకు వస్తున్న ఆలయ ఉద్యోగులను కూడా పంపకపోవడం విమర్శలకు దారి తీసింది. డ్యూటీ పాస్‌లు ఉన్న మీడియా సిబ్బందిపై కూడా దురుసుగా ప్రవర్తించారు. ఉదయం 8 తర్వాత పరిస్థితి కొంత మార్పు వచ్చింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత రద్దీ పెరగడంతో పోలీసుల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఇలా రోజంతా ఆంక్షలతో భక్తులు, సిబ్బందిని ఇబ్బందుకలు గురిచేశారు. -
బామ్మా.. ఇదేం పనమ్మా
గొలుసులు, బ్యాగుల చోరీలో దిట్ట 70 ఏళ్ల వృద్ధురాలిని అరెస్టు చేసిన పోలీసులు రూ. 3 లక్షల సొత్తు స్వాధీనం డిక్కీ దొంగ అరెస్టు.. 6 లక్షల పట్టివేత విజయవాడ (గుణదల): చిన్నప్పటి నుంచి ఆడంబరంగా జీవించాలనే కాంక్షతో ఉన్న ఓ వృద్ధురాలు తన ‘లక్ష్యం’ కోసం చోరీలను ఎంచుకుంది. ఏమరపాటుగా ఉన్నవారి మెడలో నుంచి బంగారు గొలుసులను దొంగతనాలకు పాల్పడుతూ సిటీ పోలీసులకు దొరికిపోయింది. శనివారం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్ పి. హరికుమార్ ఈ కేసు వివరాల్ని మీడియాకు వెల్లడించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన దాసరి సామ్రాజ్యం (70) రద్దీ ప్రదేశాలైన బస్టాండ్, రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో తిరిగుతూ ఏమరపాటుగా ఉన్న మహిళల మెడల్లో చైన్లను, వారి చేతి సంచులను చాకచక్యంగా కత్తిరించి అక్కడి నుంచి జారుకునేదని అన్నారు. ఈ క్రమంలోనే నిందితురాలిపై గుంటూరు, తెనాలిలో పలు కేసుల్లో నిందితురాలిగా జైలుకు వెళ్లిందని, జైలు నుంచి విడుదలైనా కూడా దొంగతనాలకు పాల్పడుతుందన్నారు. విజయవాడలోనూ దొంగతనాలు ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన కృష్ణలంక శంకర్ మఠం గుడిలోకి వెళ్లి అక్కడ భక్తురాలిగా నటిస్తూ ఒక మహిళ వద్ద బ్యాగ్‌ను దొంగిలించిందని, జూన్, ఆగస్టుల్లో పండిట్‌నెహ్రూ బస్టాండులో ఒక బ్యాగు, గొలుసును, మరొకరి పర్సును కొట్టేసిందన్నారు. ఈనెల 23వ తేదీన కాళేశ్వరరావు మార్కెట్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితురాలిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని నగరంలో చేసిన ఆరు దొంగతనాలకు సంబంధించి రూ.3లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డిక్కీ దొంగ పట్టివేత - రూ.6 లక్షల స్వాధీనం స్కూటర్ డిక్కీల్లో నగదు దొంగిలించే యువకుణ్ని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి రూ. 6లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు జేసీపీ హరికుమార్ తెలిపారు. కానూరుకు చెందిన నిందితుడు నిజాముద్దీన్ అలియాస్ నిజాం చిన్ననాటి నుంచి ఆటోనగర్‌లో తన తండ్రి వద్ద లారీ బాడీలను, చాయిస్‌లను రిపేరు చేస్తూ ఉంటాడు. జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు నేర్చాడు. ఈ నెల 7వతేదీన ఆటోనగర్‌లోని ఓ వ్యక్తి బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చి స్కూటర్ డిక్కీలో పెట్టగా, నగదు మాయం కావడంతో పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 23వ తేదీ పటమట మహాత్మాగాంధీ రోడ్డు సమీపంలో అనుమానంగా తిరుగుతున్న నిజామ్ను సీసీఎస్ పోలీసులు పట్టుకుని అతని వద్ద ఉన్న రూ.లక్షతో పాటు అతని ఇంటి వద్ద ఉన్న రూ.5లక్షలు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. -
రేపు వెనిగళ్ల శ్రీకాంత్ లొంగుబాటు!
రంగంలోకి టీడీపీ నేతలు సోమవారం నేరుగా కోర్టులో లొంగిపోయేలా ప్రణాళిక పది రోజులుగా నగరంలోనే క్యాంప్ హైదరాబాద్ నుంచి పోలీసు అధికారి పక్కా ప్రణాళిక విజయవాడ : కాల్‌మనీ-సెక్స్ రాకెట్ కేసులో కీలక నిందితుడు వెనిగళ్ల శ్రీకాంత్ కోర్టులో లొంగుబాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీలోని కొంతమంది కీలక నేతలు పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. పోలీసులకు దొరికితే శ్రీకాంత్‌ను విచారణ చేసి వాస్తవాలు రాబడతారని భావించిన టీడీపీ ముఖ్య నేతలు, అతను కోర్టులో లొంగిపోయేలా వ్యూహాన్ని రచించారు. హైదరాబాద్‌లో ఉన్న ఓ పోలీసు ఉన్నతాధికారి కూడా ఈ ప్రణాళికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా సాగితే సోమవారం కోర్టులో వెనిగళ్ల శ్రీకాంత్ లొంగిపోతాడని తెలుస్తోంది. వాస్తవానికి గత సోమవారమే లొంగిపోవాల్సి ఉండగా, నగరంలో నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాలు జరుగుతున్నందున తెలుగుదేశం నేతలంతా ఆ హడావుడిలో ఉన్నారు. దీంతో విజయవాడ సమీపంలోని ఉన్న ఒక నియోజకవర్గానికి చెందిన నాయకుడు లొంగుబాటు కార్యక్రమాన్ని మరో వారం వాయిదా వేయాలని సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం కోర్టులో లొంగిపోయిన అనంతరం అనారోగ్య కారణాలు చూపించి బెయిల్ తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. నగరంలోనే శ్రీకాంత్... : గత పది రోజులుగా వెనిగళ్ల శ్రీకాంత్ నగరంలోనే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల పటమట లంకలో నివసిస్తున్న ఆయన నాయనమ్మ నాగేశ్వరమ్మ చనిపోగా అంత్యక్రియల్లో శ్రీకాంత్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. అంత్యక్రియలకు శ్రీకాంత్ వచ్చాడని పోలీసులు తెలుసుకుని వెళ్లేలోగానే అతను చల్లగా జారుకున్నాడని చెబుతున్నారు. ముందుగా ఉన్న సమాచారం మేరకే పోలీ సులు ఆలస్యంగా వెళ్లారని ప్రచారం కూడా జరుగుతోంది. ఈ పది రోజుల నుంచి శ్రీకాంత్ తన బాకీదారుల గురించి వాకబు చేస్తున్నారు. కోర్టులో సరెండర్ అయి బయటకు వచ్చిన తరువాత వీరి వద్ద నుంచి బకాయిలు ఏ విధంగా రాబట్టాలనే అంశంపై తెలుగుదేశం నాయకులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఏదైనా తమ విషయాలను బయటకు రానీయకుండా శ్రీకాంత్‌ను కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ కేసు నుంచి బయటకు తెచ్చేందుకు టీడీపీ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. -
దీపం ఉండగానే.. దోచుకో.. దాచుకో..
సెంట్రల్ జోన్ తీరూతెన్నూ ఇసుక నుంచి పేకాట వరకు అన్నింటా మామూళ్లే నిత్యం సెటిట్మెంట్లతో శివారు స్టేషన్ బిజీబిజీ కాసులకు కక్కుర్తిపడి కేసులు కట్టని మరో స్టేషన్ అధికారి విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో అధిక ఆదాయ వనరులు ఉండే జోన్.. సెంట్రల్. కొత్తగా ఏర్పడినా.. ఏసీపీని నియమించినా ఇక్కడి స్టేషన్లు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది మాత్రం పూర్తిగా పాతవారే. దీంతో ఇక్కడ సెటిల్మెంట్లు, వ్యవహారాలు ఇష్టానుసారంగా సాగుతున్నాయి. భూగర్భ సంపద దోపిడీ మొదలుకొని రియల్ ఎస్టేట్ దందాలు, వ్యభిచార ముఠాల వరకు అన్నీ ఇక్కడ నిత్యకృత్యం. విజయవాడ : పోలీసు కమిషనరేట్‌లోని సెంట్రల్ జోన్లో ఒక్కొక్క అధికారిది ఒక్కో తీరు. కేసులను డీల్ చేసే విధానంలోనే తేడా ఉంటుంది తప్ప ధనార్జన, రాజకీయ సిఫార్సుల విషయంలో మాత్రం దాదాపు అందరూ ఒక్కటే! రాష్ట్రంలోనే సంచలనంగా మారి, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ వ్యవహారానికి సంబంధించిన కేసులు పెద్ద సంఖ్యలో ఇక్కడ నమోదయ్యాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే ధోరణిలో కొందరు అధికారులు ఉండటం గమనార్హం. శివారు స్టేషన్లో దందాలు షురూ... నగర శివారులో ఉన్న పోలీస్‌స్టేషన్ నిత్యం కాసుల వర్షం కురిపిస్తోంది. ఇటీవలే సదరు స్టేషన్ సీఐ పనితీరు బాగోలేదని, అవినీతి ఆరోపణలు ఉన్నాయనే కారణంగా ఏలూరు రేంజ్‌కు సరెండర్ చేశారు. అయినా అధికార పార్టీ ఆధిపత్యంతో ఈ వ్యవహారాలు నిత్యకృత్యంగానే సాగుతున్నాయి. ముఖ్యంగా తాడిగడప, వణుకూరు, చౌడవరం గ్రామాల్లోని అపార్ట్మెంట్లు, తోటలు, నది ఒడ్డున అధికార పార్టీ నేతలు లక్షల్లో నిర్వహించే పేకాట శిబిరాలు కొనసాగుతూనే ఉన్నాయి. రియల్ దందాలపై ఫిర్యాదులు అనేకం వస్తున్నా కేసుల దాకా రానీయని పరిస్థితి. కొన్నింటిని పోలీసులు, మరికొన్ని సందర్భాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధి అనుచరులు సెటిల్మెంట్లు చేస్తుంటారు. ఇక ఇసుక దందాకు అడ్డే లేదు. ప్రజాప్రతినిధి అనుచరులు రోజుకు రూ.5 లక్షలు విలువ చేసే ఇసుకను నాలుగు నెలల పాటు తవ్వారు. నిబంధనలకు విరుద్ధంగా దాదాపు ఆరు లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వినా పోలీసులు కనీసం పట్టించుకోలేదు. ఇక స్టేషన్ పరిధిలోని బార్లు, వైన్ షాపుల నుంచి నెలవారీలు షరా మామూలే. ఒక్కొక్క బార్ నుంచి రూ.18 వేలు, వైన్ షాపు నుంచి రూ.16 వేలు వసూలు చేస్తారు. పంచాయితీలతో బిజీబిజీ... ఆటోనగర్ పంచాయితీలతో మరో స్టేషన్ బిజీబిజీగా ఉంటుంది. కేసులు అతి తక్కువగా ఉండటం ఇక్కడి ప్రత్యేకత. నిత్యం పాత ఇనుప మాయం, దొంగ రవాణా, వ్యాపారుల మధ్య వివాదాలు ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఉన్నా కేసుల దాకా రానివ్వకుండా ప్రత్యేక ధరలతో సెటిల్మెంట్లు చేయటం మామూలే. శివారు ప్రాంతంలో అనేక సంపన్న కాలనీలు ఈ స్టేషన్ పరిధిలో ఉన్నాయి. ఇక్కడ వ్యభిచార ముఠాల కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నా స్టేషన్ వరకు తెలియదు. ఎక్కువ సమయం బిజీగా ఉంటూ స్టేషన్లో తక్కువ ఉంటూ బయటే పంచాయితీలు సాగిస్తుంటారని ఇక్కడి ఒక అధికారిపై ఆరోపణలున్నాయి. ఇక స్టేషన్ పరిధిలో బార్లు ఎక్కువగా ఉండటంతో కలెక్షన్‌కు లోటుండదు. ఇటీవల ప్రసాదంపాడుకు చెందిన ఒక యువతి ప్రేమ పేరుతో మోసపోయిన ఫిర్యాదులో భారీగా దండుకున్నారనే ఆరోపణలున్నాయి. కీలక ఘటనల్లో అధికార పార్టీ కలరింగ్ ప్రత్యేకత. రెండు నెలల క్రితం ఒక ప్రైవేట్ స్కూల్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో స్కూల్ ప్రిన్సిపాల్‌పై మృతిచెందిన బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ నుంచి భారీ మొత్తం తీసుకొని కేసులో పేరు లేకుండా చేసినట్లు సమాచారం. అధికార పార్టీ నేతల ఆధిపత్యం జోన్ పరిధిలోని మూడు స్టేషన్లలో అధికార పార్టీ నేతల అధిపత్యం అధికం. నగరంలోని ఒక ప్రజాప్రతినిధి ప్రత్యేకంగా తన నియోజకవర్గంలో స్టేషన్లకు వచ్చే పంచాయితీలు, అనుకూల ఫిర్యాదుల పష్కారం కోసం ఒక చోటా నేతకు బాధ్యతలు అప్పగిం చారు. ఆ నేత నిత్యం స్టేషన్ల వద్దే ఉంటూ ప్రతి ఫిర్యాదునూ అధికారుల సహకారంతో సొమ్ము చేసుకుంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. శివారు ప్రాం తంలో ఉండే స్టేషన్లో సదరు అధికార ప్రజాప్రతినిధి హవాకు అడ్డే లేదు. కాల్‌మనీ నిందితుల్ని రక్షించటం మొదలుకొని పేకాట శిబిరాల వరకు అన్నీ ఇక్కడే ఉన్నా పోలీసులకు కనిపించదు. -
దొంగలు అరెస్ట్ : మోటర్ సైకిళ్లు స్వాధీనం
విజయవాడ : విజయవాడలో ఇద్దరు దొంగలను నగర పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 15 మోటర్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని పోలీసులు సీజ్ చేశారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సదరు దొంగలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అందులోభాగంగా వారిని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. -
‘భారతీయుడు’పై దాడి కేసులో ...
పోలీసులపై ‘టీడీపీ’ ఒత్తిళ్లు విజయవాడ : సామాజిక కార్యకర్తపై దాడి ఘటన విచారణలో పోలీసులు ఆచితూచీ వ్యవహరిస్తున్నారు. నిందితుల అరెస్టుకు కుటుంబ సభ్యుల డిమాండ్.. వదలాలంటూ టీడీపీ పెద్దల నుంచి పోలీసులపై ఒత్తిళ్లు పెరిగాయి. ఆరోపణలు ఎదుర్కొం టున్న వ్యక్తుల తరపున అధికార పార్టీ ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగడంతో సమగ్ర దర్యాప్తు తర్వాతనే తదుపరి చర్యలకు దిగాలని పోలీసు అధికారులు నిర్ణయించినట్టు తెలి సింది. ‘ఈ భారతీయుడిని..చచ్చేలా కొట్టారు!’ శీర్షికను శనివారం సాక్షిలో ప్రచురితమైన కథనం రాజకీయ, పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పెనమలూరు భారతీయునిగా పేరొందిన సామాజిక కార్యకర్త ముప్పాళ్ల బద్రినారాయణపై జరిగిన దాడి, అధికార తెలుగుదేశం పార్టీ నేతల ప్రమేయంపై కథనంలో సవివరంగా వచ్చింది. విషయం బయటకు పొక్కడంతో పోలీసు అధికారులు అన్ని కోణాల్లోను దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. బద్రినారాయణ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి ఇన్చార్జి ఏసీపీ వి.వి.నాయుడు, పెనమలూరు ఇన్స్పెక్టర్ పి.రాజేష్ వెళ్లి మరోసారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అదుపులోని వ్యక్తులను విచారించారు. తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లే సమయంలో బద్రినారాయణపై దాడి జరిగింది. హఠాత్తుగా నిందితులు దాడి చేయడంతో షాక్‌కు గురైన ఆయన మాటలు వినడం మినహా వచ్చిన వారి ముఖాలను గుర్తించలేకపోయారు. దాడి సందర్భంగా వారు వాడిన పదజాలాన్ని బట్టి నిందితులను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని శనివారం మరోసారి పోలీసుల ఎదుట చెప్పారు. దీనిపై బాధితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా తమపై కేసు నమోదు చేయడాన్ని అదుపులో ఉన్నవారు తప్పుబట్టినట్టు తెలిసింది. ఆ సమయంలో తాము వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నట్టు చెప్పడంతో ఫోన్ కాల్‌డేటా, టవర్ లొకేషన్ తదితర వివరాలు సేకరించేందుకు పోలీసు అధికారులు నిర్ణయిం చారు. వాటి ఆధారంగా కేసు దర్యాప్తులో ముందుకు వెళ్లాలని వారు భావిస్తున్నారు. కేసు నమోదు కాకుండా... దాడి జరిగిన రోజు నుంచే నిందితులుగా చెపుతున్న వారికి మద్దతుగా జిల్లాకు చెందిన ఓ మంత్రి, పెనమలూరు నియోజకవర్గానికి చెందిన కీలక ప్రజాప్రతినిధి కేసు నమోదు కాకుండా పోలీసులపై ఒత్తిళ్లు తెచ్చినట్టు తెలిసింది. అయినప్పటికీ ముగ్గురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణకు ఉపక్రమించడంతో మరోసారి పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నట్టు చెపుతున్నారు. కేసు విచారణ బాధ్యతలను ఇన్చార్జి ఏసీపీ వి.వి.నాయుడు నుంచి తప్పించి మరో అధికారికి అప్పగించాలని వారు కోరుతున్నట్లు కమిషనరేట్ వర్గాల సమాచారం. -
రూ. 10 వేలకు రూ. 20 వేల విలువైన ఫుడ్ కూపన్లు...
విజయవాడ: నకిలీ కూపన్ల తయారు చేస్తున్న ముఠా గుట్టును విజయవాడ పటమట పోలీసులు గురువారం రట్టు చేశారు. అందుకు సంబంధించి హేమంత్, సందీప్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలు తమ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు కూపన్లు ఇస్తూ ఉంటుంది. ఆ కూపన్లు షాపింగ్ మాల్స్‌తోపాటు స్టార్ హోటళలో సదరు ఉద్యోగులు నగదుకు బదులు ఇస్తుంటారు. అయితే రూ. 10 వేలు చెల్లిస్తే... 20 వేల విలువైన కూపన్ల అంటూ ఈ ముఠా పలువురికి ఎర వేసింది. దాంతో నలుగురు వ్యక్తులు రూ. 10 వేల విలువైన కూపన్ల కొనుగోలు చేసి షాపింగ్ మాల్స్‌కి వెళ్లారు. అయితే అవి నకిలీవని తెలింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ క్రమంలో నకిలీ కూపన్ల ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. -
కళానికేతన్లో చోరీ ఛేదించిన పోలీసులు
విజయవాడ: నగరంలోని కళానికేతన్లో నగదు చోరీ కేసును పోలీసులు శనివారం ఛేదించారు. నిందితుడు కళానికేతన్లోని సేల్స్ బాయ్ అని పోలీసులు గుర్తించారు. అనంతరం అతడని అదుపులోకి తీసుకుని... తమదైన శైలిలో విచారణ జరిపారు. అంతే పని చేసే షాపులో చోరీ చేసింది తానే అని పోలీసులు ఎదుట ఒప్పుకున్నాడు. చోరీ చేసిన రూ. 7.5 లక్షల నగదుకు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ బందరు రోడ్డులోని కళానికేతన్ లో జూన్ 10వ తేదీ అర్థరాత్రి భారీ చోరీ జరిగింది. షాపులో ని రూ. 7.5 లక్షలు నగదు చోరీ జరిగింది. జూన్ 11వ తేదీ ఉదయం దొంగతనం జరిగిన సంగతి గుర్తించిన యజమానాలు వెంటనే మాచవరం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సిబ్బందే ఈ చోరీ చేసి ఉండవచ్చని భావించిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. -
టీడీపీ నేతకు చెందిన రూ.68 లక్షలు స్వాధీనం!
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన సందర్భంగా పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేశారు.ఈ నేపథ్యంలో విజయవాడ సమీపంలోని ఇబ్రహీం పట్నం వద్ద ఆదివారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. అందులోభాగంగా కారులో తరలిస్తున్న రూ. 68 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కారు డ్రైవర్‌తోపాటు ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఆ నగదుపై డ్రైవర్‌తోపాటు వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ నగదును టీడీపీకి చెందిన నేతదని వారు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అలాగే నెల్లూరు జిల్లా కోవూరులో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ.11 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఆ నగదును తరలిస్తున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించారు. ఆ నగదుకు సంబంధించిన వివరాలపై పోలీసులు యువకుడిని ప్రశ్నిస్తున్నారు.