బామ్మా.. ఇదేం పనమ్మా | 70 year old woman arrested by vijayawada city police | Sakshi
Sakshi News home page

బామ్మా.. ఇదేం పనమ్మా

Published Sat, Sep 24 2016 8:40 AM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM

70 year old woman arrested by vijayawada city police

గొలుసులు, బ్యాగుల చోరీలో దిట్ట
70 ఏళ్ల వృద్ధురాలిని అరెస్టు చేసిన పోలీసులు
రూ. 3 లక్షల సొత్తు స్వాధీనం
డిక్కీ దొంగ అరెస్టు.. 6 లక్షల పట్టివేత

 
విజయవాడ (గుణదల): చిన్నప్పటి నుంచి ఆడంబరంగా జీవించాలనే కాంక్షతో ఉన్న ఓ వృద్ధురాలు తన ‘లక్ష్యం’ కోసం చోరీలను ఎంచుకుంది. ఏమరపాటుగా ఉన్నవారి మెడలో నుంచి బంగారు గొలుసులను దొంగతనాలకు పాల్పడుతూ సిటీ పోలీసులకు దొరికిపోయింది. శనివారం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్ పి. హరికుమార్  ఈ కేసు వివరాల్ని మీడియాకు వెల్లడించారు.
 
గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన దాసరి సామ్రాజ్యం (70) రద్దీ ప్రదేశాలైన బస్టాండ్, రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో తిరిగుతూ ఏమరపాటుగా ఉన్న మహిళల మెడల్లో చైన్‌లను, వారి చేతి సంచులను చాకచక్యంగా కత్తిరించి అక్కడి నుంచి జారుకునేదని అన్నారు. ఈ క్రమంలోనే నిందితురాలిపై గుంటూరు, తెనాలిలో పలు కేసుల్లో నిందితురాలిగా జైలుకు వెళ్లిందని, జైలు నుంచి విడుదలైనా కూడా దొంగతనాలకు పాల్పడుతుందన్నారు.
 
 విజయవాడలోనూ దొంగతనాలు
 ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన కృష్ణలంక శంకర్ మఠం గుడిలోకి వెళ్లి అక్కడ భక్తురాలిగా నటిస్తూ ఒక మహిళ వద్ద బ్యాగ్‌ను దొంగిలించిందని, జూన్, ఆగస్టుల్లో పండిట్‌నెహ్రూ బస్టాండులో ఒక బ్యాగు, గొలుసును, మరొకరి పర్సును కొట్టేసిందన్నారు. ఈనెల 23వ తేదీన కాళేశ్వరరావు మార్కెట్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితురాలిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని నగరంలో చేసిన ఆరు దొంగతనాలకు సంబంధించి రూ.3లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
 
 డిక్కీ దొంగ పట్టివేత - రూ.6 లక్షల స్వాధీనం
  స్కూటర్ డిక్కీల్లో నగదు దొంగిలించే యువకుణ్ని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి రూ. 6లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు జేసీపీ హరికుమార్ తెలిపారు. కానూరుకు చెందిన నిందితుడు నిజాముద్దీన్ అలియాస్ నిజాం చిన్ననాటి నుంచి ఆటోనగర్‌లో తన తండ్రి వద్ద లారీ బాడీలను, చాయిస్‌లను రిపేరు చేస్తూ ఉంటాడు. జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు నేర్చాడు. ఈ నెల 7వతేదీన ఆటోనగర్‌లోని ఓ వ్యక్తి బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చి స్కూటర్ డిక్కీలో పెట్టగా, నగదు మాయం కావడంతో పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు.  23వ తేదీ పటమట మహాత్మాగాంధీ రోడ్డు సమీపంలో అనుమానంగా తిరుగుతున్న నిజామ్‌ను సీసీఎస్ పోలీసులు పట్టుకుని అతని వద్ద ఉన్న రూ.లక్షతో పాటు అతని ఇంటి వద్ద ఉన్న రూ.5లక్షలు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement