ఒంగోలులో కొత్త రాజధాని లేనట్టే?
విజయవాడ: రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారనే దానిపై దోబూచులాట కొనసాగుతోంది. తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి నూతనంగా నిర్మించనున్న రాజధానిపై ప్రతిష్టంభన నెలకొంది. ఒంగోలులో కొత్త రాజధాని ఏర్పాటవుతుందని ప్రచారం జరుగుతోంది. అటు ఆంధ్రకు, ఇటు రాయలసీమకు మధ్యలో ఉన్న ఒంగోలులో రాజధాని ఏర్పాటు చేస్తే బావుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒంగోలు పరిసర ప్రాంతాల్లో రాజకీయ నాయకులు భారీగా భూములు కొనుగోలు చేయడంతో ఇక్కడ రాజధాని ఖాయమన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. అయితే మెజారిటీ రాజకీయ నాయకులు ఒంగోలు వైపు మొగ్గుచూపడం లేదని తాజా సమాచారం. విజయవాడ, గుంటూరు మధ్యలో కొత్త రాజధాని రావాలని సీమాంధ్ర కేంద్ర మంత్రులతో సహా ఎక్కువ మంది నేతలు కోరుకుంటున్నారని తెలిసింది. జీవోఎంకు ఇచ్చిన నివేదికలో ఈ విషయాన్ని పొందుపరిచారని సమాచారం.
ప్రకాశం జిల్లాకు చెందిన కేంద్ర మంత్రులు పురందేశ్వరి కూడా రాజధానిగా ఒంగోలు ఉండాలన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ జిల్లాతో అనుబంధం ఉన్న కేంద్ర మంత్రులు జేడీ శీలం, పనబాక లక్ష్మి ఇదే వైఖరితో ఉన్నారని అంటున్నారు. సీనియర్ మంత్రులు కావూరి సాంబశివరావు, ఎంఎం పళ్లంరాజు ఒంగోలు వైపు మొగ్గుచూపడం లేదని విశ్వసనీయవర్గాల సమాచారం. వీరితో సహా ఐదుగురు కేంద్ర మంత్రులు విజయవాడ-గుంటూరులో కొత్త రాజధాని కోరుతున్నారని తెలిసింది.
ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న తమ భూముల విలువ పెంచుకునేందుకే ఇక్కడ రాజధాని పెట్టాలని రాజకీయ నాయకులు కోరుతున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఒంగోలు రాజధాని ఆశలు సన్నగిల్లినట్టేనని ఊహాగానాలు వస్తున్నాయి. కాగా, విశాఖపట్టణాన్ని రాజధానిగా ప్రకటించాలని ఉత్తరాంధ్ర నేతలు డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రాంతంలోనే రాజధాని ఉండాలని రాయలసీమ నాయకులు పట్టుబడుతున్నారు.