vijayawada hospital
-
తప్పు మీద తప్పు.. ఇదేనా చంద్రబాబు ‘పెద్దరికం’?
ఎవరైనా అత్యాచారానికి గురైన ఒక యువతి వద్దకు వెళ్లి గొడవ చేస్తారా? అందులోను పురుషులు కూడా అంతమంది వెళ్లి అరాచకం సృష్టిస్తే సమాజానికి వీరు ఏమి చెబుతున్నట్లు? ఒక మహిళను పరామర్శించడానికి వెళ్లి మరో మహిళను అవమానిస్తారా? ఏ పార్టీ వారు ఇలా చేసినా తప్పే. కాని పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు సమక్షంలోనే ఈ రకంగా గందరగోళం సృష్టించడానికి తెలుగుదేశం నేతలు, కొందరు కార్యకర్తలు పూనుకోవడం అత్యంత శోచనీయం. చదవండి👉: జగన్ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికే ‘అధర్మ యుద్ధం’ విజయవాడలో బుద్దిమాద్యం ఉన్న ఒక యువతిపై ముగ్గురు నీచులు అత్యాచారం చేశారు. ఈ విషయం బయటకు వచ్చాక ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఆమెకు పది లక్షల పరిహారం ఇవ్వడం, విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయడం వంటి చర్యలు తీసుకుంది. అయినా ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు అక్కడకు వెళ్లడాన్ని ఆక్షేపించనవసరం లేదు. ఆయన ఒక్కరు మర్యాదగా వెళ్లి ఆ యువతిని పరామర్శించి వచ్చి ఉంటే ఎంతో హుందాగా ఉండేది. అలా కాకుండా తనతోపాటు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలను తీసుకువెళ్లడం ఏమిటి? అక్కడ వారు అద్దాలు పగులకొట్టి గొడవ చేయడం ఏమిటి? అసలే బాధలో ఉంటే, ఆ బాధిత యువతి వద్దకు అంతమంది పురుషులు వెళితే ఆమె కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుంది? అదే సమయంలో అక్కడ ఉన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు అనుచితంగా వ్యవహరించడం ఏమిటి? నిజానికి ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే మహిళా కమిషన్ రంగంలోకి దిగి బాధితులకు జరుగుతున్న ఉపశమన చర్యలను పరిశీలించి, కమిషన్‌గా తానేమీ చేయాలో ఆలోచించి చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి పద్మ వెళ్లగా టీడీపీ వారు గో బ్యాక్ అనాల్సిన అవసరం ఏముంది. అంటే టీడీపీ వారు తప్ప ఆ యువతిని మరెవరూ పరామర్శించకూడదా? ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఎవరూ రాలేదని, మహిళా కమిషన్ ఏమి చేస్తుందని ప్రశ్నించవచ్చని వారి ఉద్దేశమా? లేక చంద్రబాబు ఇంకా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారని ఫీల్ అవుతూ వారు ఈ గోల చేశారా? చదవండి👉: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అంటే గౌరవమే కాని... మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తన ఇష్టారీతిలో పద్మపై నోరు పారేసుకుంటుంటే చంద్రబాబు వారించి ఉంటే ఎంత బాగుండేది. పద్మతో పాటు ఆయన కదా ఆ బాధిత యువతిని పరామర్శించి, ఇంకా ఏ విధంగా ఆ యువతి సాయం చేయాలో ఆమెకు చెప్పి ఉంటే ఎంత హుందాగా ఉండేది. తద్వారా తన పెద్దరికం నిలబడేది కదా? అలా చేయకపోగా బొండా ఉమాను, మరో మహిళా నేతను రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడారట. ఈ నేపథ్యంలోనే తన అధికారిక హోదాలో చంద్రబాబుకు, బొండాకు సమన్లు జారీ చేశారు. వీటిని వారు పాటించకపోవచ్చు. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నది తెరపైనే చూడాలి. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాచేపల్లి వద్ద అత్యాచారం ఘటన జరిగితే ఏమని సూక్తులు చెప్పారు. ఎవరికి వారు భద్రత కల్పించుకోవాలి కాని, ప్రతి ఒక్కరికి పోలీసును పెట్టడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అది వాస్తవం కూడా. కాని ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు ఆస్పత్రి నుంచి బయటకు వచ్చి వైసీపీ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి జగన్‌పైన నిందారోపణలు సాగించారు. ఇక్కడే ఆయనలో ఉన్న రాజకీయ కుట్ర కోణం బయటపడుతోంది. ప్రతిదానిని రాజకీయం చేయాలని, రాజకీయాలకు వాడుకోవాలన్న ఆయన దురుద్దేశం బహిర్గతం అవుతుంది. పోనీ తన హయాంలో కాని, ఈ మధ్య కాలంలో ఒకరిద్దరు టీడీపీ నేతలపై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కాని, ఆయన ఇదే రీతిలో స్పందించారా? అలాంటిదేమీ లేదు. మరి ఇప్పుడే ఎందుకు ఇలా చేస్తున్నారంటే, మరో రెండేళ్లలో జరగబోయే శాసనసభ ఎన్నికలలో జగన్‌ను ఓడించాలన్న తహతహతో ఉన్న చంద్రబాబు ఏ చిన్న అవకాశం వచ్చినా, పెద్దరాయితో కొట్టాలని చూస్తున్నారు. కాని ఆ క్రమంలో ఆయన తప్పులపై తప్పులు చేస్తూ, ప్రజలలో అప్రతిష్టపాలవుతున్నారు. ఇక ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా మాత్రం అసలు వాసిరెడ్డి పద్మపై ఏ దాడి జరగలేదేమో అన్న చందంగా వార్తలు ఇచ్చాయి. ఒకవేళ ఇదే పరిస్థితి టీడీపీ మహిళా నేతకు ఎదురైతే, చంద్రబాబు, టీడీపీ మీడియా తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. బ్యానర్ కథనాలు వచ్చేవి. తప్పు టీడీపీ వైపు ఉంది కనుకే ఆ సంబంధింత కథనాన్ని కనిపడి, కనిపించకుండా ప్రచురించారనుకోవచ్చు. ఏ ప్రభుత్వ హయాంలో ఇలాంటివి జరిగినా సహించరాదు. కాని సమాజంలో ఇలాంటి ఘటనలు వివిధ కారణాల వల్ల పెరుగుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఉన్నావ్ ఘటన దేశ వ్యాప్తంగా ఎంతటి ఆందోళన కలిగించిందో తెలుసు. తెలంగాణలో కొద్ది రోజుల క్రితమే ఒక ప్రేమోన్నాది మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చంద్రబాబు పాలనలో తహశీల్దార్ వనజాక్షికి ఎదురైన చేదు అనుభవం, ఆ కేసులో ఏకంగా తన పార్టీ ఎమ్మెల్యేలని చంద్రబాబు ఎలా కాపాడే యత్నం చేశారో అంతా వినే ఉంటారు. అలా చేయడం తప్పు. ప్రభుత్వం ప్రభుత్వంగానే వ్యవహరిస్తే ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశంఉంటుంది. మరి చంద్రబాబుకు అవన్ని గుర్తుకు ఉండవా. వయసురీత్యా ఆయన బాగా పెద్దవాడు కావచ్చు. కాని ఏపీలో ఆయనకు ఒక కీలకమైన బాధ్యత ఉంది. అందువల్ల ఆయన మరింత అర్థవంతంగా ఉండాలి. లేకుంటే వచ్చే ఎన్నికలలో టీడీపీకి మరోసారి కర్రుకాల్చి వాతపెడతారని హెచ్చరించక తప్పదు. -కొమ్మినేని శ్రీనివాస రావు సీనియర్ జర్నలిస్టు -
చంద్రబాబు రెచ్చగొడుతున్నారు: వాసిరెడ్డి పద్మ ఫైర్
సాక్షి, విజయవాడ: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలిని వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా కల్పించారు. అయితే అత్యాచార బాధితురాలిని పరామర్శించడానికి వెళ్తే.. టీడీపీ దౌర్జన్యానికి పాల్పడిందని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలికి ధైర్యం చెప్పేందుకు ఆసుపత్రికి వస్తే టీడీపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. మహిళల పట్ల రాజకీయం చేయడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌పై బెదిరించే స్థాయికి చంద్రబాబు దిగజారనని విమర్శించారు. తనపై దాడికి దిగిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సంబంధిత వార్త👉ప్రభుత్వ ఆస్పత్రి వద్ద టీడీపీ కార్యకర్తల వీరంగం.. వాసిరెడ్డి పద్మపై దాడి ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఆసుపత్రికి వచ్చే సరికి తెలుగు దేశం నాయకులు ఆసుపత్రి ముందు మోహరించి ఉన్నారు. టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆసుపత్రికి వస్తున్నాడని నన్ను వెళ్లడానికి వీళ్లేదని అడ్డుకోవడమే కాదు, వాసిరెడ్డి పద్మ గో బ్యాక్ అంటూ గొడవ చేశారు. అయినా నేను ఆసుపత్రి వద్ద రాజకీయాలు చేయడం సరికాదని సీరియస్ వార్నింగ్ ఇచ్చాను. టీడీపీ నేతలను నెట్టుకుంటూ, వారి నుంచి తప్పించుకొని లోపలికి అడుగుపెట్టాను. ఆ తరువాత కూడా టీడీపీ కార్యకర్తలు దాదాపు 50 మంది గలాటా సృష్టించారు. అయినా కూడా సంయమనం పాటించా. బాధితురాలితో మాట్లాడుతుండగా బోండా ఉమా అడ్డుకునే ప్రయత్నం చేశారు. నాతో చాలా అనుచితంగా ప్రవర్తించారు. చంద్రబాబు సైతం విచక్షణ మరిచి బెదిరించే ప్రయత్నం చేశారు. ఆయన సమక్షంలోనే టీడీపీ మహిళా నేతలు నాపై వేలు చూపిస్తూ దౌర్జన్యానికి దిగారు. చంద్రబాబు అందరినీ రెచ్చగెడుతున్నారు. మహిళా నాయకుల పట్ల గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడిన వాసిరెడ్డి పద్మ, బొండా ఉమాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. -
రసాయన పరిశ్రమలో ప్రమాదం
ముసునూరు: ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ ఇండియా కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి బాయిలర్ పేలి ఇద్దరు మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో 10 మందికి గాయాలయ్యాయి. వీరిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. రాత్రి 11.30 గంటల తర్వాత ప్లాంట్–4లో అకస్మాత్తుగా బాయిలర్ పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ సమయంలో పని చేస్తున్న 30 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో గాయపడిన వారందరినీ ఏడు 108 అంబులెన్స్‌లలో నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వారిని విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఫ్యాక్టరీలో అగ్నికీలలు ఎగసి పడుతుండటం, దట్టంగా పొగ ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఘటన స్థలంలో ఇద్దరు మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇంకా మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా.. అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సుధీర్ (38), బారువల (30), షేక్ సుబానీ (30), కె. జోసఫ్(25), ఎం నాగరాజు(35), ఎస్ నాగేశ్వరరావు (45), విహారీ (25), టి రవికుమార్ (20), పి.సుధీర్‌కుమార్ (35), కిరణ్ (35), సీహెచ్ రాజు (38), ఎం చాష్మమ్ (32), రోషన్ మోచి (24) తదితరులు గాయపడిన వారిలో ఉన్నారు. మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు నేతృత్వంలో అగ్నిమాపక శాఖ, రెవెన్యూ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వస్తేగాని మృతుల సంఖ్య నిర్ధారించలేమని అధికారులు చెబుతున్నారు. కాగా, గాయపడ్డ కార్మికుల్లో ఆరుగురికి పైగా బీహార్ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. -
అమ్మో..ఆ పోస్టు మాకొద్దు
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలోని రాష్ట్ర స్థాయి కోవిడ్ 19 ట్రీట్మెంట్ సెంటర్ (ప్రభుత్వాస్పత్రి) రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. అసలు ఆ కుర్చీలో మేము కూర్చోమంటూ సీనియర్ ప్రొఫెసర్లు సైతం చేతులెత్తేస్తున్నారు. దీంతో రెండు నెలలుగా పూర్తి స్థాయి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ లేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆర్ఎంఓ చూడాల్సిన బాధ్యతలను సైతం సూపరింటెండెంట్ చూసుకుంటున్నారు. కోవిడ్ ఆస్పత్రి నేపథ్యంలో నిత్యం రిపోర్టులు ఇవ్వడం, మృతదేహాలను క్రిమిటోరియంకు రోగుల పర్యవేక్షణ చూడాల్సిన ఆర్ఎంఓ లేక పోవడంతో పాలన క్లిష్టతరంగా మారింది. రెండు నెలల కిందట ఆర్ఎంఓ సరెండర్ కోవిడ్ 19 ట్రీట్మెంట్ సెంటర్‌కు సివిల్ సర్జన్ ఆర్ఎంఓగా పనిచేస్తున్న డాక్టర్ ఆర్. గీతాంజలిని రెండు నెలల కిందట సూపరింటెండెంట్ డాక్టర్ పి. నాంచారయ్య డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు సరెండర్ చేశారు. ఆమె ఇక్కడ ఐదేళ్లుగా పనిచేశారు. అయితే ఎందుకు సరెండర్ చేయాల్సి వచ్చిందనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. అయితే ఆదేశాల్లో మాత్రం పాలనా పరమైన చర్యల్లో భాగంగా సరెండర్ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఆమె ఏప్రిల్ మొదటి వారంలో రిలీవ్ అయ్యి వెళ్లి పోయారు. అప్పటినుంచి ఆర్ఎంఓ లేని పరిస్థితి నెలకొంది. ఇన్‌చార్జీలుగా ఉండని వైనం డాక్టర్ గీతాంజలిని సరెండర్ చేసిన తర్వాత పిడియాట్రిక్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ఎస్ విఠల్‌రావును ఇన్చార్జి ఆర్ఎంఓగా నియమించారు. ఆయన కొద్దికాలం యాక్టివ్గానే పనిచేశారు. తర్వాత ఏమి జరిగిందో ఏమో కానీ ఈ కుర్చీ నాకొద్దు అంటూ తన డిపార్ట్మెంట్కు వెళ్లిపోయారు. అనంతరం డెర్మటాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పెంచలయ్యకు ఇన్చార్జి ఇచ్చారు. ఆయన కూడా రెండు రోజులు ఆర్ఎంఓ చాంబర్లో కూర్చుని తర్వాత వారం రోజులు సెలవుపై వెళ్లారు. తర్వాత డ్యూటీకి వెళ్లినా తన విభాగంలో విధులకు వెళ్లారే కానీ ఆర్ఎంఓ సీటులోకి రాలేదు. తాజాగా మరో అసిస్టెంట్ సివిల్ సర్జన్‌కు ఇన్చార్జి ఇవ్వగా అమ్మో ఆ సీటు నాకొద్దు.. నేను కొద్దిరోజుల్లో పదవీ విరమణ చేయబోతున్నా అంటూ నిరాకరించినట్లు తెలిసింది. ఆర్ఎంఓగా వచ్చేందుకు అనాసక్తి సాధారణంగా విజయవాడ లాంటి ఆస్పత్రిలో సివిల్ సర్జన్ పోస్టు ఖాళీగా ఉంటే దానిని దక్కించుకునేందుకు పోటీ పడతారు. కానీ ఇక్కడ రెండు నెలలుగా పోస్టు ఖాళీగా ఉన్నా ఇక్కడకు వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కోవిడ్ ఆస్పత్రితో పాటు పాలనా పరమైన ఇబ్బందులు ఎదురవుతుండటంతో వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం. అంతేకాదు నాలుగు నెలల కిందట డెప్యూటీ ఆర్ఎంఓగా పనిచేస్తున్న డాక్టర్ సతీష్‌కుమార్ సివిల్ సర్జన్ పదోన్నతిపై గుంటూరు ఆర్ఎంఓగా వెళ్లారు. ఆయన స్థానంలో కూడా ఎవరూ వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో అసలు ఏమి జరుగుతుందోనని బయట చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రభుత్వాస్పత్రిపై దృష్టి సారించి పాలనా పరమైన ఇబ్బందులు సరిచేయడంతో పాటు, ఆర్‌ఎంఓల నియామకం చేయాల్సి ఉంది. -
నాణ్యత డొల్ల.. ఆరోగ్యం గుల్ల
కంపుకొట్టే శనగపిండి.. నాసిరకం బియ్యం, కారం, నూనెల్లో లోపించిన నాణ్యత.. డైట్ క్యాంటీన్ పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం.. ఇవి విజయవాడ సర్వజనాస్పత్రిలో విజిలెన్స్, ఫుడ్‌కంట్రోల్ అధికారుల తనిఖీల్లో కనిపించిన దృశ్యాలు. రోగులకు అందిస్తున్న ఆహారంలో నాణ్యత లోపించిందన్న ఫిర్యాదులతో అధికారులు మంగళవారం సాయంత్రం ఆస్పత్రిలోని డైట్ క్యాంటీన్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పెట్టే ఆహారంలో నాణ్యత లోపించింది. సుద్దయిన అన్నం.. నీళ్ల చారు, మజ్జిక రోగులకు అందిస్తుండటంపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో విజిలెన్స్ ఎస్పీ హర్షవర్థన్‌రాజు ఆదేశాలతో జిల్లా ఆహార నియంత్రణ అధికారులతో కలిసి మంగళవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోగులకు ఆహారం తయారు చేసే డైట్ క్యాంటీన్లోని పలు పదార్థాలను పరిశీలించడంతో పాటు, వాటిని తయారు చేసే వస్తువుల నాణ్యతపై సైతం పరిశీలించారు. శాంపిళ్లను సేకరించారు. అంతేకాక క్యాంటీన్లో 20 కేజీల రేషన్ బియ్యం ఉండటాన్ని సైతం విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వంటకు వాడే ఉప్పు, కారం.. నూనె, చింతపండులతో పాటు, బియ్యం శాంపిళ్లను సేకరించి, ఆస్పత్రి డైటీషియన్ నుంచి విజిలెన్స్ అధికారులు లేఖను తీసుకున్నారు. లోపాల పుట్ట.. జబ్బు చేసి చికిత్స కోసం వచ్చిన రోగులకు పెట్టే ఆహారంలో అనేక లోపాలు ఉన్నట్లు విజిలెన్స్, ఆహార నియంత్రణ అధికారులు గుర్తించారు. కంపుకొట్టే శసన పిండి, బూజు పట్టిన మినపగుళ్లతో పాటు, నాసిరకం కారం, నూనెలు వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. డైట్ క్యాంటీన్లో రేషన్ బియ్యం సైతం 20 కేజీలు వాడటాన్ని గుర్తించారు. ఆహారం తయారు చేసేందుకు ఆర్ఓ వాటర్ వాడాల్సి ఉండగా, బోరు వాటర్ వాడటాన్ని గుర్తించారు. అంతేకాకుండా రోగులకు ఆహారం తయారు చేసే క్యాంటీన్ అపరిశుభ్రంగా ఉండటంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార పదార్థాలు తయారు చేసేందుకు వాడే బియ్యం, ఉప్పు, కారం, నూనెల శాంపిళ్లను సేకరించారు. ఫుడ్ కంట్రోల్ సర్టిఫికెట్టే లేదు.. వెయ్యి పడకల ప్రభుత్వాస్పత్రిలో రోగులకు ఆహారం పెట్టే కాంట్రాక్టర్‌కు ఫుడ్‌కంట్రోల్ సర్టిఫికెట్ సైతం లేదని విజిలెన్స్ తనిఖీల్లో వెల్లడైంది. అసలు ఈ సర్టిఫికెట్ లేకుండా కాంట్రాక్టు ఎలా ఇచ్చారనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు రేషన్ బియ్యాన్ని రైస్ మిల్లులో పాలిష్ పట్టించి సన్నబియ్యంగా వాడుతున్నారని నిర్థారణకు వచ్చారు. ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న ప్రైవేటు క్యాంటీన్‌ను సైతం అధికారులు తనిఖీలు చేయగా, అక్కడ కూడా ఆహార పదార్థాలు నాణ్యత లోపించినట్లు గుర్తించారు. ఈ తనిఖీలో జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నూతలపాటి పూర్ణచంద్రరావు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శేఖర్‌రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణ, ఎడీఏ కళ్యాణ్‌కుమార్, హెడ్‌కానిస్టేబుల్స్ అన్సారీ, నాగభూషణంలు పాల్గొన్నారు. కాంట్రాక్టరుకునోటీసులు ఇస్తాం.. ప్రభుత్వాస్పత్రిలో డైట్ కాంట్రాక్టరు నిర్వహించేందుకు ఫుడ్ కంట్రోల్‌శాఖ నుంచి సర్టిఫికెట్ లేదు. దీనిపై నోటీసులు జారీ చేస్తాం. మజ్జిగ, సాంబారు నాసిరకంగా ఉండటంతో పాటు, సుద్ద అన్నం పెడుతున్నట్లు మాకు ఫిర్యాదులు అందాయి. దీంతో తనిఖీలు నిర్వహించాం. బోరు నీటితో వంట చేయడంతో పాటు, అనేక లోపాలు గుర్తించి శ్యాంపిళ్లను సేకరించాం.– నూతలపాటి పూర్ణచంద్రరావు, విజిలెన్స్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ -
ప్రభుత్వ వైద్యులపై మంత్రి మండిపాటు
ఒక్కళ్లూ సమయానికి రారు.. మీ కోసం రోగులు ఎంతసేపు వేచిచూడాలి.. ఇదేనా మీరు చేసే పని అంటూ ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రి వైద్యులపై మండిపడ్డారు. ఆస్పత్రిలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆయన వచ్చిన సమయానికి ఏ ఒక్క వైద్యుడూ రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలోని సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో జరుగుతున్న లంచాల తంతును... ఓ రోగి బంధువులు మంత్రికి వివరించారు. పచ్చనోటు పెట్టనిదే సిబ్బంది పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. లంచం పేరుతో పీక్కు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోగుల ఫిర్యాదులు విన్న మంత్రి దీనిపై వెంటనే ప్రత్యేక విచారణ జరిపించి, బాధ్యులపైకఠిన చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే ఆస్పత్రి మొత్తాన్ని ప్రక్షాళన చేస్తామన్నారు.